పీపీఎఫ్ ఖాతా కొన‌సాగించాల‌నుకుంటున్నారా! ఇది చ‌ద‌వండి

ఒక్క‌సారి మీ జీవితంలో 15 ఏళ్ల కాలాన్ని వెన‌క్కి తిప్పి, ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) లో ఖాతా తెరిచిన రోజుకి వెళ్లండి. గ‌త 15 ఏళ్లుగా పీపీఎఫ్‌లో మ‌దుపు చేసిన మీకు ఖాతా మెచ్యూర్ అయ్యే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది.....

Updated : 02 Jan 2021 16:08 IST

పీపీఎఫ్ ఖాతా కొన‌సాగించడానికి ఉన్న రెండు అవ‌కాశాల గురించి ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఒక్క‌సారి మీ జీవితంలో 15 ఏళ్ల కాలాన్ని వెన‌క్కి తిప్పి, ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) లో ఖాతా తెరిచిన రోజుకి వెళ్లండి. గ‌త 15 ఏళ్లుగా పీపీఎఫ్‌లో మ‌దుపు చేసిన మీకు ఖాతా మెచ్యూర్ అయ్యే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. పీపీఎఫ్‌లో 15 ఏళ్ల లాకిన్ పీరియ‌డ్ ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ లోపు పీపీఎఫ్‌లోని డిపాజిట్ల‌పై రుణం పొంద‌వ‌చ్చు లేదా పాక్షికంగా న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌లు చేయ‌వ‌చ్చు. కానీ అస‌లు ప్ర‌శ్నేంటంటే, పీపీఎఫ్ మెచ్యూరిటీ ముగిస్తే ఏం చేయాలి. మ‌ళ్లీ దీనిని కొన‌సాగించేందుకు ఏవైనా అవ‌కాశాలున్నాయా

మెచ్యూరిటీ త‌ర్వాత పీపీఎఫ్ ఖాతాను ఈ కింద వివ‌రించిన మూడు ప్ర‌త్యామ్నాయాల ద్వారా కొన‌సాగించ‌వ‌చ్చు.

  1. ఖాతాను మూసివేసి, మొత్తం నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం
  2. కొత్త‌ డిపాజిట్లు లేకుండా ఖాతాను కొన‌సాగించ‌డం
  3. కొత్త‌ డిపాజిట్ల ద్వారా ఖాతాను కొన‌సాగించ‌డం

1) ఖాతాను మూసివేసి, మొత్తం నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం

పీపీఎఫ్ ఖాతాను 15 ఏళ్ల గ‌డువు త‌ర్వాత మాత్ర‌మే ర‌ద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఖాతా ప్రారంభించిన రోజు నుంచి కాకుండా ఖాతాలో మొద‌టి సారిగా పెట్టుబ‌డులు పెట్టిన తేదీని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని 15 ఏళ్ల మెచ్యూరిటీ తేదీని నిర్ణ‌యిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి మే 18, 2002 నాడు ఖాతా ప్రారంభించిన‌ట్ల‌యితే, ఏప్రిల్ 1, 2018 ని మెచ్యూరిటీ తేదీగా ప‌రిగ‌ణిస్తారు. ఎందుకంటే ఖాతా ప్రారంభించిన ఆర్థిక సంవ‌త్స‌రం మార్చి 31, 2003 న ముగుస్తుంది కాబ‌ట్టి.

ఖాతాను ర‌ద్దు చేసుకునేట‌ప్పుడు అకౌంట్స్ ఆఫీసు(పోస్టాఫీసు) వారికి తెలిపితే మీ ఖాతాలో ఉన్న న‌గ‌దు మొత్తం మీకు చెల్లిస్తారు. మెచ్యూరిటీ వ‌చ్చిన‌ప్ప‌టికీ మీరు పీపీఎఫ్ ఖాతాను నిర‌వ‌ధికంగా ఐదేళ్ల పాటు కొన‌సాగించ‌వ‌చ్చు. ఈ కొన‌సాగించే క్ర‌మంలో మీరు త‌ప్ప‌నిస‌రిగా కొత్త డిపాజిట్లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే పాక్షికంగా న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌లు కూడా చేయ‌వ‌చ్చు. అయితే ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు పాత నిబంధ‌న‌లే వ‌ర్తిస్తాయి.

2) కొత్త పెట్టుబ‌డులు లేకుండా ఖాతా కొన‌సాగించ‌డం

కొత్త‌గా పెట్టుబ‌డులు పెట్ట‌కుండా పీపీఎఫ్ ఖాతాను కొన‌సాగించాల‌నుకుంటే సంబందిత అకౌంట్స్ ఆఫీస‌ర్‌కి ఆ విష‌యం క‌చ్చితంగా తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం లేదు. దానంత‌ట అదే కొన‌సాగుతుంది. ఇక్క‌డ‌ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే ఆ త‌ర్వాత కూడా అందులో కొత్త‌గా పెట్టుబ‌డులు పెట్ట‌కూడ‌దు. అయితే ఖాతాలో ఉన్న న‌గదుకు వ‌డ్డీ వ‌స్తుంది.

కొన‌సాగింపు ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక్క‌సారి మాత్ర‌మే న‌గ‌దును ఉప‌సంహ‌రించుకునే వీలుంది. ఒక్కో ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక్కో ద‌ఫా చొప్పున ఎంత మొత్త‌మైనా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఈ విధానంలో ఒక్క‌సారి ఖాతా పొడిగించ‌బ‌డి, ఏడాది దాటిన త‌రువాత కూడా కొత్త డిపాజిట్లు చేయ‌లేక‌పోతే 5 ఏళ్లపాటు మ‌ళ్లీ కొత్త డిపాజిట్లు చేసే వెసులుబాటును కోల్పోయిన‌ట్లే.

3) కొత్త పెట్టుబ‌డుల‌తో ఖాతాను కొన‌సాగించ‌డం

కొత్త‌గా పెట్టుబ‌డుల‌తో కూడా పీపీఎఫ్ ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే ఈ విధానంలో ఖాతాను కొన‌సాగించాల‌నుకున్న‌ప్పుడు మెచ్యూరిటీ గ‌డువు ఏడాదిలో ముగుస్తుంద‌న‌గా సంబంధిత అకౌంట్స్ ఆఫీస‌ర్‌కి ఫారం-హెచ్ నింపి స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫారం-హెచ్‌ని స‌మ‌ర్పించ‌కుండా కొత్త డిపాజిట్లు చేస్తే వాటికి వ‌డ్డీ ల‌భించ‌దు. అంతేగాకుండా ఈ డిపాజిట్ల‌కు ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీ కింద ల‌భించే ప‌న్ను మిన‌హాయింపులు కూడా ద‌క్క‌వు.

ఒక్కసారి కొత్త పెట్టుబ‌డుల‌తో ఖాతాను కొన‌సాగించి, ఆ త‌రువాత డిపాజిట్లు చేయ‌క‌పోయినప్ప‌టికీ ఖాతాలోని న‌గ‌దు నిల్వ‌ల‌కు వ‌డ్డీ ల‌భిస్తుంది.

కొనసాగించే స‌మ‌యంలో పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌లు ఎలా

కొత్త డిపాజిట్లు లేకుండా ఖాతాను కొన‌సాగించే విధానంలో ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక్క‌సారి మాత్ర‌మే ఎంత న‌గ‌దునైనా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. మిగిలిన మొత్తానికి వ‌డ్డీ వ‌ర్తిస్తుంది.

అయితే కొత్త పెట్టుబ‌డుల‌తో ఖాతాను కొన‌సాగించే విధానంలో ప్ర‌తీ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఫారం-సీ ని స‌మ‌ర్పించి కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే పాక్షికంగా న‌గ‌దును ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అయితే 5 ఏళ్ల కాలంలో ఉప‌సంహ‌రించుకున్న మొత్తం ఖాతా కొన‌సాగించ‌డానికి ముందున్న నిల్వ‌ల‌లో 60 శాతం ప‌రిమితిని మించ‌కూడ‌దు.

ఈ న‌గ‌దును ఒక్కో ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక్కో ద‌ఫా చొప్పున ఐదేళ్ల‌లో మీ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అయితే ఖాతాను మ‌రో ఐదేళ్ల పాటు కొన‌సాగించిన‌ట్ల‌యితే, రెండో బ్లాక్ పీరియ‌డ్‌లోనూ అప్ప‌టి వ‌ర‌కున్న న‌గ‌దు నిల్వ‌ల‌లో 60 శాతం మొత్తాన్ని ఏడాదికొక సారి చొప్పున ఐదేళ్ల పాటు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఈ ప‌రిమితి ప్ర‌తీ ఐదేళ్లకోసారి ఖాతాను పొడిగించిన‌ప్పుడు అమ‌లవుతూనే ఉంటుంది.

మీరు ఇప్పుడేం చేయాలంటే

ఒక వేళ మీ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు కంటే ముందే పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగుస్తున్న‌ట్ల‌యితే, ఖాతాను కొన‌సాగించ‌డం మంచిది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి 30 ఏళ్ల వ‌య‌సులో పీపీఎఫ్ ఖాతాను ప్రారంభిస్తే, అత‌నికి 60 ఏళ్లు వ‌చ్చే స‌రికి మూడు ఏళ్ల పాటు ఖాతాను కొసాగించే వెసులుబాటు ఉంది. ఖాతాను కొన‌సాగించ‌డానికి ఫారం-హెచ్ స‌మ‌ర్పించ‌డంతో పాటు, ఏటా రూ.500 లు చెల్లించాల్సి ఉంటుంది. లాకిన్ పీరియ‌డ్ స‌మ‌యంలో 40 శాతం మొత్తాన్ని ఉప‌సంహ‌రించుకునే వీలుండ‌దు. కాబ‌ట్టి వాటిపై వ‌డ్డీని ఆర్జించ‌డంతో పాటు, మీ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా పాక్షికంగా న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని