ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్.. కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి? 

ప్రస్తుతం ఉన్న అంబుడ్స్‌మన్ పథకాలను.. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ ద్వారా ఒకే పథకంలో విలీనం చేయ‌డం వ‌ల్ల ఒకే ఫ్లాట్‌ఫామ్ ద్వార‌ వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే అవ‌కాశం ఉంటుంద‌ని ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. 

Updated : 16 Nov 2021 14:36 IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రారంభించిన‌ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం (ఐఓఎస్)తో బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులతో సహా ఆర్థిక సేవలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం సులభతరం కానుంది. ఐఓఎస్ కింద బ్యాంకులు, బ్యాంకింగేత‌ర‌ సంస్థ‌లు(ఎన్‌బీఎఫ్‌సి)లు, డిజిట‌ల్ లావాదేవీల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌ను ఒకేచోట న‌మోదు చేయ‌వ‌చ్చు. ప్రస్తుతం ఉన్న అంబుడ్స్‌మన్ పథకాలను.. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ ద్వారా ఒకే పథకంలో విలీనం చేయ‌డం వ‌ల్ల ఒకే ఫ్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే అవ‌కాశం ఉంటుంద‌ని ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ ప‌థ‌కాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ న‌వంబ‌ర్ 12న ప్రారంభించారు.

ఏంటీ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మన్ స్కీమ్?
బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ, డిజిట‌ల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల ప‌రిష్కారం కోసం ఇప్పటి వరకు మూడు వేర్వేరు అంబుడ్స్‌మన్ పథకాలు పనిచేస్తున్నాయి.  బ్యాంకింగ్ సంబంధించిన ఫిర్యాధుల కోసం బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (బీఓఎస్‌) 1995 నుంచి పని చేస్తోంది,  బ్యాంకింగ్-యేతర ఆర్థిక సంస్థ‌ల కోసం.. ద అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ ఫర్‌ నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీస్‌ 2018 నుంచి, డిజిటల్ లావాదేవీల కోసం.. ద అంబుడ్స్‌మన్‌ స్కీమ్ ఫర్‌ డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ 2019 నుంచి ప‌నిచేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూడింటిని ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మెన్‌’ వ్య‌వ‌స్థ‌గా ఏకీకృతం చేసి సేవ‌లు అందించ‌నున్నారు. రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లున్న నాన్‌-షెడ్యూల్డ్‌ ప్రాథమిక సహకార బ్యాంకులూ ఈ వ్యవస్థ కిందకే వస్తాయి. వినియోగ‌దారుడు ఆర్థిక సంస్థ అంత‌ర్గ‌త ఫిర్యాదుల ప‌రిష్కార విధానంతో సంతృప్తి చెంద‌క‌పోతే అంబుడ్స్‌మెన్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఫీచ‌ర్లు..
* ఫిర్యాదుదారుడు ఏ ప‌థ‌కం కింద అంబుడ్స్‌మ‌న్‌కి ఫిర్యాదు చేస్తున్నారో గుర్తించాల్సిన అవ‌సరం లేదు
* "స్కీమ్‌లో జాబితా చేయ‌బ‌డిన కార‌ణాల కింద క‌వ‌ర్ కాలేదు" అనే కార‌ణంతో ఫిర్యాదులు తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా విస్తృత సేవ‌లు అందుతాయి. 
* ఏ భాష‌లోనైనా ఫిర్యాదులు చేయ‌వ‌చ్చు.  ప్రారంభ నిర్వ‌హ‌ణ కోసం చండీగ‌ఢ్‌లో రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. 
* ఖాతా ఎక్కడున్నా దాని యజమాని ఎక్కడినుంచైనా అంబుడ్స్‌మెన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఆన్‌లైన్‌ మోసాల పరిష్కారానికి కృత్రిమ మేధా సాంకేతికతను ఉపయోగిస్తారు. దీనివల్ల బ్యాంకు, దర్యాప్తు ఏజెన్సీల మధ్య తక్కువ సమయంలోనే సమన్వయం సాధ్యమవుతుంది.
* ఫిర్యాదును న‌మోదు చేయ‌డంతో పాటు స్టేట‌స్‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు, అలాగే సంబంధిత ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌వచ్చు, ఇంకా ఫీడ్‌బ్యాక్ కూడా పొంద‌చ్చు.
* సంతృప్తికరమైన, సమయానుకూల సమాచారాన్ని అందించనందుకు గానూ అంబుడ్స్‌మన్ జారీ చేసిన అవార్డును అప్పీల్ చేసే హక్కు నియంత్రిత సంస్థకు లేదని ఆర్‌బీఐ చెబుతోంది.

ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి?
ఫిర్యాదు నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ ‍ https://cms.rbi.org.in లో వినియోగ‌దారులు వారి ఫిర్యాదుల‌ను ఫైల్ చేయ‌వ‌చ్చు. చండీగ‌ఢ్‌లోని సెంట్ర‌లైజ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌కి ఇమెయిల్ లేదా భౌతికంగా లేఖ‌ను పంప‌డం ద్వారా కూడా ఫిర్యాదుల‌ను న‌మోదు చేయ‌వ‌చ్చు. 

అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబ‌రు - 14448 ద్వారా కాల్ సెంట‌ర్‌కు కాల్ చేసి హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఎనిమిది ప్రాంతీయ భాష‌ల‌లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఇత‌ర భార‌తీయ భాష‌ల‌లో త్వ‌ర‌లోనే ఈ సేవ‌లు అందుబాటులో తీసుకురానున్న‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని