Health Insurance:  సీనియర్ సిటిజన్లు త‌గిన‌ ఆరోగ్య బీమా పాల‌సీ ఎలా ఎంచుకోవాలి? 

స‌రైన‌ ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లు తమ పొదుపు, ఆర్థిక భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.  

Updated : 26 Aug 2021 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా ప్రాధాన్యత, దాని అవసరం అర్థమైన‌ప్ప‌టికీ కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తుంటారు కొందరు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమాను తమ ఆర్థిక ప్రణాళికలో భాగం చేయాలి. ఎందుకంటే వ‌య‌సుతో సంబంధం లేకుండానే అనారోగ్యం బారినప‌డేవారెంద‌రో.  సీనియర్ సిటిజన్లకు దీని అవసరం మరింత ఎక్కువ. ముఖ్యంగా కరోనా వైరస్ వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. వీరు అధిక రిస్క్ కేట‌గిరీలోకి వ‌స్తారు. కాబట్టి సీనియర్ సిటిజన్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్య అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. ఇందుకోసం సమగ్ర కవరేజ్‌తో కూడిన అత్యుత్తమ ఆరోగ్య పాలసీని ఎంచుకోవాలి. అయితే, మార్కెట్లో చాలా రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నుంచి తగిన ఆరోగ్య బీమాను ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లు తమ పొదుపు, ఆర్థిక భద్రత గురించి ఆందోళన చెందకుండా అవసరమైన చికిత్సను పొందొచ్చు.

కీలకదశలో తీసుకునే ఆరోగ్య బీమా ఆర్థిక భద్రతను అందించడంతో పాటు, మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అందువల్ల ఆరోగ్య బీమా ప్లాన్‌ ఎంచుకునేప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పాలసీకి వర్తించే నియమ నిబంధనలు, షరతులను పూర్తిగా చదవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరిగాయి. కాబట్టి గరిష్ఠ కవరేజ్‌ ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం ముఖ్యం. పాలసీ సాధారణ అనారోగ్యాలతో పాటు క్లిష్టమైన వ్యాధులను కూడా కవర్ చేయాలి. ముందుగా ఉన్న వ్యాధులకు ఎంత వెయిటింగ్ పిరియడ్ ఉందో చెక్ చేయాలి. సీనియర్ సిటిజన్లు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. తద్వారా ఆసుపత్రిలో చేరే అవకాశాలు ఎక్కువే. అందువల్ల తక్కువ వెయిటింగ్ పిరియడ్ ఉన్న పాలసీని ఎంచుకోవడం మంచిది.

ప‌రిగ‌ణనలోకి తీసుకోవాల్సిన ముఖ్య‌మైన అంశాలు..
వ‌య‌సు: పాల‌సీ కొనుగోలు, పున‌రుద్ధ‌ర‌ణ అనేవి పాల‌సీదారుని వ‌య‌సుపై ఆధార‌ప‌డి ఉంటాయి. ఇది అంద‌రికీ ఒకే విధంగా ఉండ‌దు. చాలా పాల‌సీల‌కు ప్ర‌వేశ వ‌య‌సు 60 నుంచి 75 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. ఎక్కువ ప్ర‌వేశ వ‌య‌సుతో పాటు విస్తృత‌మైన క‌వ‌రేజ్ అందించే పాల‌సీలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అనువైన‌వి. ఇవి ఎక్కువ కాలం ఆర్థిక సాయం అందిస్తాయి. కొన్ని బీమా సంస్థ‌లు 80 ఏళ్లు దాటిన వారికి పాల‌సీలు విక్ర‌యించ‌వు. పున‌రుద్ధ‌ర‌ణ‌కు అనుమతించ‌వు. కొన్ని పాల‌సీల‌కు గ‌రిష్ఠ ప్ర‌వేశ/పున‌రుద్ధ‌ర‌ణ‌ వ‌య‌సు లేదు. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో వ‌య‌సు ప్ర‌మాణాల గురించి తెలుసుకోవాలి. ప్ర‌స్తుతం చాలా ఆరోగ్య బీమా సంస్థ‌లు ప్ర‌వేశ వ‌య‌సు ప‌రిమితి లేకుండా పాల‌సీల‌ను అందిస్తున్నాయి. ప్ర‌వేశ వ‌య‌సుతో పాటు పున‌రుద్ధ‌ర‌ణ వ‌య‌సును ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి. 

నెట్‌వర్క్‌ ఆసుపత్రులు: వృద్ధుల కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేప్పుడు బీమా సంస్థ నెట్‌వర్క్‌ ఆసుప‌త్రుల జాబితాను చూడాలి. మీ ప‌రిస‌ర ప్రాంతంలో క‌నీసం ఒక్క ఆసుప‌త్రి అయినా ఉందా అనేది చెక్‌ చేయాలి. ఇది వైద్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో పనికొస్తుంది. విస్తృత నెట్‌వ‌ర్క్ హాస్పిటల్స్‌ ఉన్న బీమా సంస్థ‌ను ఎంపిక చేయాలి.

వ్యాధుల కవరేజ్: పెరిగిన వ‌య‌సుతో పాటు అనారోగ్యాలు పెరుగుతుంటాయి. వివిధ వ్యాధుల బారినప‌డే అవ‌కాశం ఉంది. అంద‌వ‌ల్ల ఎక్కువ‌ వ్యాధుల‌ను క‌వ‌ర్ చేయ‌డంతో పాటు వివిధ వ్యాధుల‌కు స‌మ‌గ్ర క‌వ‌రేజ్ అందించే పాల‌సీని ఎంచుకోవ‌డం వ‌ల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉండ‌దు. ఇంటి వ‌ద్ద చేసే చికిత్స‌, డేకేర్ క‌వ‌ర్ కూడా సీనియర్‌ సిటిజ‌న్లు ప‌రిగ‌ణించాల్సి ఒక ముఖ్య‌మైన అంశం. వైద్య నిపుణుడు ఇంటి వ‌ద్ద చికిత్స (హోమ్ కేర్ ట్రీట్‌మెంట్) అందించి ఇచ్చిన ప్రిస్క్రిప్ష‌న్‌ను పాల‌సీ క‌వ‌ర్ చేస్తుందో లేదో చూడాలి.

ఇప్ప‌టికే ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌లు: మీ కుటుంబంలోని వృద్ధులకు ఇప్పటికే ఆరోగ్య సమస్య ఉంటే, దాని కోసం కవరేజ్ అందించే పాలసీ కోసం ప్ర‌య‌త్నించండి. వ్యాధికి సంబంధించిన వెయిటింగ్ పిరియ‌డ్ చూడ‌టం మర్చిపోవద్దు. ఇప్ప‌టికే నిర్ధార‌ణ అయిన జీవిన శైలి వ్యాధుల కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరాల్సి రావ‌చ్చు. అందువ‌ల్ల‌ త‌క్కువ వెయిటింగ్ పిరియ‌డ్ ఉన్న పాల‌సీ తీసుకోవాలి. పాల‌సీ తీసుకునే ముందు ఉన్న ఆరోగ్య స్థితిని పాల‌సీలో త‌ప్ప‌నిస‌రిగా తెలియ‌జేయాలని గుర్తుంచుకోండి. ఒక‌వేళ దాచిపెడితే క్లెయిమ్‌లు తిర‌స్క‌ర‌ణ‌కు దారితీయొచ్చు.

క్లెయిమ్ ప్రాసెస్‌: క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ సింపుల్‌గా ఉంటే, సెటిల్‌మెంట్ త్వ‌ర‌గా పూర్త‌వుతుంది. ఎక్కువ ప‌త్రాలు, ఎక్కువ ఎంక్వైరీలు ఉంటే ప్రాసెస్ ఆల‌స్యం అవుతుంది. న‌గ‌దు ర‌హిత లేదా రీయింబ‌ర్స్‌మెంట్ సౌక‌ర్యం రెండు విధానాల్లోనూ సర‌ళ‌మైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ విధానం ఉన్న సంస్థ‌ల‌కే సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎల్ల‌ప్పుడూ ప్రాధాన్య‌ం ఇవ్వాలి.

ప్రీమియం: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. సీనియర్ సిటిజన్ల విషయంలో అనారోగ్యానికి లోన‌య్యే అవ‌కాశాలు మ‌రింత ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వారి వైద్య చికిత్స కూడా ఖరీదైనదిగా ఉంటుంది. తక్కువ ప్రీమియం చెల్లించే విధంగా పాల‌సీని ఎంచుకుంటే క‌వ‌రేజ్ కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. కొన్ని బీమా పాలసీలు బీమా రీఫిల్ సదుపాయాన్ని అందిస్తాయి. అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఇప్పటికే ఉన్న బీమా మొత్తాన్ని వినియోగించుకుని ఉంటే బీమా మొత్తాన్ని పునరుద్ధరించొచ్చు. కాబట్టి, పాల‌సీని ఎంచుకునేప్పుడు ప్రీమియాన్ని మాత్ర‌మే ప్రాతిప‌దిక‌గా తీసుకుని త‌క్కువ ప్రీమ‌యంతో కూడిన పాల‌సీల‌ను ఎంచుకోవ‌డం కంటే, కొంత ప్రీమియం ఎక్క‌వైన‌ప్ప‌టికీ, ఎక్కువ ప్ర‌యోజ‌నాలు అందించే పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని