బంగారాన్ని నిల్వ ఉంచుతున్నారా?

పిల్ల‌ల వివాహం కోసం ఇప్ప‌టినుంచే బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకుంటున్నారా...

Published : 19 Dec 2020 11:27 IST

పిల్ల‌ల వివాహం కోసం ఇప్ప‌టినుంచే బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకుంటున్నారా​​​​​​​

భార‌త ప్ర‌జల‌కు బంగారం అంటే ఎన‌లేని మ‌క్కువ‌. వారి ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉన్నా కొంతైనా బంగారాన్ని కొనుక్కోవాల‌ని అంద‌రూ అనుకుంటారు. బంగారం త‌మ వ‌ద్ద ఉంటే అదొక ప‌ర‌ప‌తిగా భావిస్తారు. వారి ఆర్థిక స్థితిని బ‌ట్టి బంగారాన్ని వివిధ రూపాల్లో కొని దాచుకుంటారు. ఇక పెళ్లిళ్ల విష‌యానికొస్తే పెళ్లికూతురుకి ఆభ‌ర‌ణాలు చేయించ‌డం సాంప్ర‌దాయంగా వ‌స్తోంది. కొన్ని వివాహాల‌లో ద‌గ్గ‌రి బందువులకు బంగారం కానుక‌గా కూడా అందిస్తారు. ఈ స‌నాత‌న సాంప్ర‌దాయంతో బంగారం ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం ముఖ్యంగా ఆడ‌పిల్ల వారికి వీలైన‌ప్పుడ‌ల్లా బంగారాన్ని స‌మ‌కూర్చుకుంటున్నారు.

బంగారం లేదా ఆభ‌ర‌ణాలు:

త‌మ అవ‌స‌రాల‌కు మించి కొంత అద‌నంగా డ‌బ్బు ఉందంటే, చాలావ‌ర‌కు బంగారం కొనుగోలు చేయాల‌నుకుంటారు. బంగారం ధ‌ర కాస్త త‌గ్గింద‌ని తెలిస్తే వివాహ కోసం ఇప్ప‌టినుంచే బంగారాన్ని స‌మ‌కూరుస్తుంటారు. అయితే ఇలా బంగారం రూపంలో కొనుగోలు చేయ‌డం వ‌ల‌న కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి. బంగారం స్వ‌చ్ఛ‌తలో లోపాలు ఉండే అవ‌కాశం ఉంది. అదేవిధంగా బంగారాన్ని ఇంట్లో నిల్వ చేసుకోవ‌డం అంత సుర‌క్షితం కాదు. దీనికి బ‌దులుగా లాక‌ర్‌లో దాచుకోవ‌డం లేదా బంగారానికి బీమా తీసుకోవ‌డంతో ద్వారా దోపిడి జ‌రిగినా ర‌క్ష‌ణ ఉంటుంది.

గోల్డ్ ఫండ్లు:

దాదాపు అన్ని మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీలు గోల్డ్ ఫండ్లు లేదా గోల్ట్ ఈటీఎఫ్‌ల‌ను ఆఫ‌ర్ చేస్తాయి. ఈ ఫండ్లు గోల్ట్ మైనింగ్ కంపెనీలు, జువెల‌రీ కంపెనీల‌ షేర్ల‌లో పెట్టుబ‌డులు పెడ‌తాయి. దీంతో మంచి రాబ‌డిని కూడా ఆశించ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు బంగారం ధ‌ర‌లు త‌గ్గిన‌ప్పుడు, కంపెనీల షేర్ల ధ‌ర‌లు పెరుగుతాయి. మ‌రి ఈ స్కీముల్లో ఎప్పుడు పెట్టుబ‌డులు పెట్టాలా అని గంద‌ర‌గోళానికి గురికాకుండా ఉండేందుకు సిప్ పెట్టుబ‌డులు మేలైన‌వి. ఎందులో పెట్టుబ‌డులు పెట్టినా రిస్క్, ఫండ్ తీరును తెలుసుకొని ప్రారంభించాలి.

సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు (ఎస్‌జీబీ):

ఈ ప్రభుత్వ బాండ్ల‌ను ఆర్‌బీఐ జారీ చేస్తుంది. ఈ స్కీమ్‌లో భాగంగా బంగారాన్ని బాండ్ల రూపంలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. బంగారాన్నిఇంట్లో నిల్వ ఉంచ‌డం అంత సుర‌క్షితం కాదు. దీంతో పాటు ఇలా కొనుగోలు చేస్తే మేకింగ్ ఛార్జీలు, స్వ‌చ్ఛ‌త వంటి ఎలాంటి అద‌న‌పు భారం ఉండ‌దు. విత్‌డ్రా చేసుకునే స‌మ‌యంలో మార్కెట్ ధ‌ర‌ను బ‌ట్టి న‌గ‌దు లేదా బంగారం తీసుకోవ‌చ్చు. వార్షికంగా 2.5 శాతం వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. ఇవి ఆరునెల‌ల‌కోసారి చెల్లిస్తారు. గ‌రిష్ఠంగా ఒక ఏడాదిలో 4 కేజీల వ‌ర‌కు వ్య‌క్తులు బాండ్ల రూపంలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. 20 కేజీల వ‌ర‌కు ట్ర‌స్టులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

గోల్డ్ మానిటైజేష‌న్ స్కీమ్ (జీఎమ్ఎస్‌):

పసిడి నగదీకరణ పథకాన్ని మరింత ఆకర్షణీయం చేసేందుకు ఆర్‌బీఐ స్వల్ప మార్పులను ప్రవేశపెట్టింది. పసిడి డిపాజిట్‌ ఖాతాను ప్రజలు సులువుగా తెరిచేలా వీలు కల్పించాలన్నదే దీని ఉద్దేశం. బ్యాంకుల్లో పసిడిని స్వల్పకాలానికి అంటే ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితికి డిపాజిటు చేయొచ్చు. కాలపరిమితి గడువు తీరాక ఇష్టమైతే మళ్లీ డిపాజిట్‌ (రోలోవరు) కొన‌సాగించ‌వ‌చ్చు.

ఇక నుంచి పూర్తి సంవత్సరమనే కాకుండా సంవత్సరం మూడు నెలలు, రెండేళ్ల మూడు నెలల 5 రోజులు… ఇలా మధ్యమధ్య రోజుల కాలపరిమితికి కూడా డిపాజిట్‌ చేసే వీలును ఆర్‌బీఐ కల్పించింది. అలాగే స్వల్పకాలిక పసిడి డిపాజిట్లను బ్యాంకులు తమ బ్యాలెన్స్‌ షీట్లలో తిరిగి చెల్లించాల్సిన బాకీ కింద చూపించాలని కూడా ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
వ‌డ్డీ రేట్ల‌ను మెచ్యూరిటీల‌కు అనుగుణంగా ఇస్తారు. దీంతో పాటు ఇంకొంత కాలం పొడ‌గిస్తే అన్ని రోజుల‌కు వ‌డ్డీని లెక్కిస్తారు. 2015 లో ప్ర‌భుత్వం ప‌సిడి న‌గ‌దీక‌ర‌ణ ప‌థ‌కాన్ని అందుబాటులోకి తెచ్చింది.

మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎంటీజీడీ) గ‌డువు 5-7 ఏళ్లు, దీర్ఘకాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎల్‌టీజీడీ) గ‌డువు 12-15 సంవ‌త్స‌రాలు లేదా ప్ర‌భుత్వం నిర్ణ‌యించినంత ఉంటుంది. అయితే డిపాజిట్లు పూర్తి సంవ‌త్స‌ర‌మే కాకుండా 5 సంవ‌త్స‌రాల 7 నెల‌లు, 13 సంవ‌త్స‌రాల 4 నెల‌ల 15 రోజులు ఇలా ఎంత కాలం అయినా కొన‌సాగించ‌వ‌చ్చు. బంగారాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వ‌డ్డీ రూపంలో 2.25 శాతం నుంచి 2.50 శాతం వ‌ర‌కు రాబ‌డిని బ్యాంకులు వినియోగ‌దారుల‌కు అందించ‌నున్నాయి.

ఎంటీజీడీ మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత డిపాజిట్ చేసిన వారి ఇష్ట ప్ర‌కారం డ‌బ్బు బంగారం ధ‌ర‌ను డ‌బ్బు రూప‌లో లేదా బంగారం రూపంలోనూ తీసుకోవ‌చ్చు. అయితే మెచ్యూరిటీ ముగియ‌క‌ముందే తీసుకుంటే న‌గ‌దు రూపంలోనే తీసుకునే అవ‌కాశ‌ముంది. ప‌సిడి రూపంలో తీసుకుంటే ఉప‌సంహ‌ర‌ణ సమ‌యంలో అడ్మినిస్ర్టేటివ్ ఛార్జీల రూపంలో 0.2 శాతం డిపాజిట‌ర్ వ‌ద్ద తీసుకుంటారు. ఎంఎల్‌టీజీడీ విత్‌డ్రా స‌మ‌యంలో బంగారం ధ‌ర ఎంత ఉందో లెక్కించి న‌గదు రూపంలో కావాల‌నుకుంటే ఇస్తారు.

పైన తెలిపిన ఆప్ష‌న్స్ మాత్ర‌మే కాకుండా కొన్ని ముఖ్య‌మైన జువెల‌రీ దుకాణ‌దారులు సొంతంగా కొన్ని స్కీములను ప్ర‌వేశ‌పెట్టాయి. ఇందులో ముంద‌స్తుగా కొంత మొత్తలుగా చెల్లిస్తూ మెచ్యూరిటీ పీరియ‌డ్ ముగిసిన త‌ర్వాత బంగారాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. అదేవిధంగా త‌మ వినియోగ‌దారుల‌కు ఈ జువెల‌ర్స్ బంగారం ధ‌ర‌లో కొంత డిస్కౌంట్ లేదా మేకింగ్ ఛార్జీల‌లో త‌గ్గుద‌ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. అయితే ఇలాంటి స్కీముల్లో కొంత రిస్క్ కూడా లేక‌పోలేదు. ఇటీవ‌లి కాలంలో మ‌నం చూస్తున్న కొన్ని కేసుల‌ను ప‌రిశీలిస్తే ఉదాహ‌ర‌ణ‌కు నీర‌వ్‌మోదీ స్కామ్‌తో గీతాంజ‌లి జువెల‌ర్స్ మూసివేత అంద‌రికీ తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని