SBI Home Loan: 6.7 శాతం ప్రారంభ వ‌డ్డీతో ఎస్‌బీఐ గృహరుణం.. ద‌ర‌ఖాస్తు ఇలా

వినియోగ‌దారుని.. వ్య‌క్తిగ‌త‌ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు క‌స్ట‌మైజ్డ్ గృహ రుణాల‌ను ఎస్‌బీఐ ఆఫ‌ర్ చేస్తుంది. 

Updated : 24 Sep 2021 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణాల‌పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. మొట్ట‌మొద‌టిసారిగా క్రెడిట్ స్కోరు ఆధారిత‌ గృహ‌ రుణాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారంగా కేవ‌లం 6.70 శాతం ప్రారంభ వ‌డ్డీతో గృహ రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తుంది.
ఈ పండుగ వేళ ఖాతాదారుల‌ను ప్రోత్స‌హించేందుకు గృహ‌రుణాల‌పై మాత్ర‌మే కాకుండా కారు, బంగారం, వ్య‌క్తిగ‌త రుణాల‌పై కూడా ఎస్‌బీఐ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. బంగారంపై 7.5 శాతం వార్షిక‌ వ‌డ్డీతో రుణం అందిస్తుండ‌గా, కారు రుణాలు ల‌క్ష‌కు రూ.1539, వ్య‌క్తిగ‌త రుణాలు ల‌క్ష‌కు రూ.1832 ప్రారంభ ఈఎంఐతో వ‌స్తున్నాయి.

ఎస్‌బీఐ గృహ‌రుణ ఫీచ‌ర్లు, ప్ర‌యోజ‌నాలు..

* త‌క్కువ వ‌డ్డీ (6.70 శాతం వ‌డ్డీతో క్రెడిట్ స్కోర్ ఆధారంగా గృహ రుణాల‌ను బ్యాంక్ ఆఫ‌ర్ చేస్తుంది.)

* జీరో ప్రాసెసింగ్ ఫీజు

* అంత‌ర్గ‌త లేదా అడ్మినిస్ట్రేష‌న్ ఛార్జీలు ఉండ‌వు

* మ‌హిళా రుణ గ్ర‌హీత‌ల‌కు వ‌డ్డీ రేటుపై రాయితీ ఉంటుంది. 

* మొద‌టిసారిగా క్రెడిట్ స్కోరు ఆధారిత గృహ‌రుణాలు ఆఫ‌ర్ చేస్తోంది.

* ముందుస్తు చెల్లింపుల‌పై పెనాల్టీ ఉండ‌దు.

* రోజువారీ త‌గ్గించిన బ్యాలెన్స్‌పై వ‌డ్డీ లెక్కిస్తారు.

* ఓప‌ర్‌డ్రాఫ్ట్‌గానూ గృహ‌రుణం ల‌భిస్తుంది.

ఆన్‌లైన్‌లో ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?
* వినియోగ‌దారులు ఎస్‌బీఐ గృహరుణం లింక్‌ను క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
* లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా ఓపెన్ అయిన పేజీలో కావ‌ల‌సిన వివ‌రాలు ఇవ్వాలి.
* వినియోగ‌దారులు వారి రుణ అర్హ‌త‌ను చెక్ చేసి లోన్ కొటేష‌న్ పొందొచ్చు. 

ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా..
* ముందుగా యోనోయాప్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. 
* హోమ్ పేజీపైన ఎడ‌మ‌వైపు ఉన్న మెనూ (మూడు గీత‌లు)పై క్లిక్ చేసి లోన్స్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. 
* ఇందులో ఉన్న గృహ రుణాల‌పై క్లిక్ చేయాలి.
* ఇక్క‌డ రుణ అర్హ‌త‌ను తెలుసుకునేందుకు పుట్టిన తేదీ వివ‌రాల‌ను అడుగుతుంది.

* పుట్టిన తేదీని ఇచ్చిన త‌రువాత ఆదాయ మార్గం, నిక‌ర నెల‌వారీ ఆదాయం, ఇత‌ర రుణాలు ఉంటే వాటి వివ‌రాలు ఇవ్వాలి.

* మీ రుణ అర్హ‌త‌ను చెక్ చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.

* కావ‌ల‌సిన‌ ఇత‌ర వివ‌రాల‌ను ఇచ్చి స‌బ్‌మిట్ చేయాలి.

* మీకు రిఫ‌రెన్స్ నంబర్‌ వస్తుంది. ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ త్వ‌ర‌లోనే మీకు కాల్ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని