ఎఫ్‌డీలపై టీడీఎస్‌ మినహాయింపు ఎలా?

పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) ఒకటి. దీంట్లో కచ్చితమైన ఆదాయం రావడంతోపాటు నష్టభయం తక్కువ.......

Published : 05 Apr 2021 14:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) ఒకటి. దీంట్లో కచ్చితమైన ఆదాయం రావడంతోపాటు నష్టభయం తక్కువ. అందుకే చాలా మంది మదుపు చేయడానికి ఎఫ్‌డీని ఎంచుకుంటారు. ప్రస్తుతం ఎఫ్‌డీ రేట్లు తక్కువగానే ఉన్నప్పటికీ.. సేవింగ్స్ అకౌంట్స్‌ వడ్డీతో పోలిస్తే మెరుగే. అలాగే సీనియర్‌ సిటిజన్స్‌కి ఇస్తున్న ఎఫ్‌డీ రేట్లు ఫరవాలేదు. ఇక కొవిడ్‌ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో చాలా మందికి ఎఫ్‌డీ ఫేవరెట్‌ ఇన్వెస్టింగ్‌ ఆప్షన్‌గా ఉంది.  

అయితే, ఎఫ్‌డీపై వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో దీన్ని ‘ఇతర ఆదాయ వనరుల(ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌)’ కింద చూపించాల్సి ఉంటుంది. ఎఫ్‌డీపై లభించిన రాబడిని మన ఏడాది మొత్తం ఆదాయంలో జోడించాలి. దానికనుగుణంగా మన పన్ను శ్లాబును నిర్ణయిస్తారు. ఒకవేళ మొత్తం ఆదాయం ఏ శ్లాబులోకి రాకపోతే ఎలాంటి పన్ను ఉండదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రికరింగ్‌ డిపాజిట్‌, సేవింగ్స్‌ ఖాతా ద్వారా పొందే వడ్డీ ఆదాయంపై సీనియర్‌ సిటిజన్లకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఏడాదికి రూ.50 వేల వరకు ఆదాయపు పన్నులో వారు మినహాయింపు కోరవచ్చు.

ఎఫ్‌డీలపై టీడీఎస్‌.. 

* బ్యాంకుల్లో ఉన్న అన్ని ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం రూ.40వేల కంటే తక్కువ ఉంటే.. టీడీఎస్‌ నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ రూ.40వేలు దాటితే బ్యాంకులే టీడీఎస్‌ను కత్తిరించి మిగిలిన సొమ్మును ఖాతాలో జమచేస్తాయి. సాధారణంగా ఎఫ్‌డీలపై 10 శాతం టీడీఎస్‌ ఉంటుంది. ఒకవేళ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌ నెం) అనుసంధానించకపోతే టీడీఎస్‌ 20 శాతానికి పెరుగుతుంది.

* ఒకవేళ మీ వార్షికాదాయం పన్ను శ్లాబులోకి రానట్లయితే.. టీడీఎస్‌ నుంచి పూర్తి మినహాయింపు పొందవచ్చు. దీనికోసం బ్యాంకుల్లో ముందుగానే 15జీ/15హెచ్‌ అనే స్వీయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఇలా చేస్తే ఐటీఆర్‌ రిటర్నులు సమర్పించి.. తిరిగి టీడీఎస్‌ను క్లెయిమ్‌ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.

* సీనియర్‌ సిటిజన్లకు ఏడాదికి ఎఫ్‌డీలపై వచ్చే ఆదాయం రూ.50 వేలు మించనట్లయితే.. టీడీఎస్‌ నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

* బ్యాంకులకు బదులు పోస్టాఫీసుల్లో ఎఫ్‌డీ చేస్తే ఇంకా మేలు. పోస్టాఫీసుల్లో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ వర్తించదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని