అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటుకు ఐదు మార్గాలు

ఉరుకుల ప‌రుగుల ప్ర‌స్తుత జీవితంలో ఎప్పుడు, ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక వేళ అనుకోని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఏవైనా ప్ర‌మాదాలు త‌లెత్తితే మీ ఆధార‌ప‌డ్డ వారి ప‌రిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా లేదా అనుకోని కార‌ణాల‌తో ఉద్యోగం కోల్పోవ‌డం లేదా వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌డు మీ కుటుంబం ఎలా జీవ‌నం గ‌డ‌ప‌డడం గురించి యోచించారా....

Published : 17 Dec 2020 13:11 IST

అత్య‌వ‌స‌ర నిధి ఆవ‌శ్య‌క‌త గురించి తెలుసుకుందాం.

ఉరుకుల ప‌రుగుల ప్ర‌స్తుత జీవితంలో ఎప్పుడు, ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక వేళ అనుకోని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఏవైనా ప్ర‌మాదాలు త‌లెత్తితే మీ ఆధార‌ప‌డ్డ వారి ప‌రిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా లేదా అనుకోని కార‌ణాల‌తో ఉద్యోగం కోల్పోవ‌డం లేదా వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌డు మీ కుటుంబం ఎలా జీవ‌నం గ‌డ‌ప‌డడం గురించి యోచించారా. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌న‌కు చేయాత‌నిచ్చేదే అత్య‌వ‌స‌ర నిధి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌నీసం ఆరు నెల‌ల అవ‌స‌రాల‌కు స‌రిపోయే విధంగా అత్య‌వ‌స‌ర నిధి ఉండాల‌ని ఆర్థిక నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. అయితే ఇది ఆయా వ్య‌క్తుల ఆర్థిక స్థోమ‌త‌, ఆదాయం, ఖ‌ర్చులు, అప్పులు, ఇత‌ర ఆదాయ వ‌న‌రుల‌పై ఆధార‌ప‌డి ఉంటాయి.

వ్య‌క్తుల ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ఇంత కీల‌క‌మైన ఈ అత్య‌వ‌స‌ర నిధిని ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఈ కింద వివ‌రించాం.

  1. ఖ‌ర్చులు, పెట్టుబ‌డుల వివరాలు ఒక‌సారి లెక్కేయండి

అత్య‌వ‌సర నిధి ఏర్పాటులో మొద‌టగా చేయాల్సిన ప‌ని ఆరు నెల‌ల‌కు మీకు ఎంత మొత్తంలో ఖ‌ర్చులు ఉంటాయో ఒక సారి లెక్కించుకోండి. ఉదాహ‌ర‌ణకు ఇంటి అద్దె, ఆహారం, ర‌వాణా, పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజులు, స‌రుకులు ఇలాంటి వాటిక‌య్యే ఖ‌ర్చుల వివ‌రాల‌ను జాగ్ర‌త్త‌గా లెక్కించండి. వీటితోపాటు ఇళ్లు, కార్, ఇత‌ర రుణాలేవైనా తీసుకుని ఉంటే వాటి నెల‌వారీ వాయిదాలు(ఈఎమ్ఐలు)తో పాటు క్రెడిట్ కార్డుల బిల్లులు కూడా మ‌దింపు వేయండి.

వీటంన్నింటి త‌ర్వాత పెట్టుబ‌డులు ఏమైనా పెడుతుంటే వాటికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఆ ఖ‌ర్చుల‌ను కూడా లెక్కించండి. ఆరోగ్య‌, జీవిత బీమా ప్రీమియంలు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు(సిప్‌), పీపీఎఫ్ ఖాతా చెల్లింపులు వంటి వాటికి అవ‌స‌ర‌మ‌య్యే చెల్లింపుల మొత్తాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలి. ఆ ఖ‌ర్చుల‌క‌య్యే డ‌బ్బుల‌ను ప్ర‌త్యేకంగా కేటాయించుకోవాలి. భ‌ర్త లేదా భార్య ఇద్ద‌రిలో ఎవ‌రు సంపాదిస్తున్నా ఖ‌ర్చుల‌ను మాత్రం కుటుంబానికి వ‌ర్తించే విధంగా ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలి.

ఈ లెక్క‌ల‌న్నీ తుది ద‌శ‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆరు నెల‌ల‌కు మీకు ఎంత మొత్తం అవ‌స‌ర‌మ‌వుతుందో, అత్య‌వ‌స‌ర నిధికి ఎంత మొత్తం జ‌మ చేయాలో మీకు అవ‌గాహ‌న వ‌స్తుంది. అత్య‌వ‌స‌ర నిధిని ఏర్ప‌రుచుకోవ‌డం ఒకే రోజులో జ‌ర‌గ‌ని ప‌ని, కాబ‌ట్టి క్ర‌మక్ర‌మంగా న‌గ‌దు జ‌మ చేస్తూ పోతే మంచిది.

  1. ఖ‌ర్చులు త‌గ్గించుకునే మార్గాల‌ను అన్వేషించండి

ఆరు నెల‌ల‌కు ఎంత మొత్తం అవ‌స‌ర‌ప‌డుతుంద‌న్న విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చాకా, మీ ఖ‌ర్చుల‌ను తగ్గించుకునే మార్గాల‌ను అన్వేషించండి. క్రెడిట్ కార్డు బిల్లుల‌ను త‌గ్గించుకోవ‌డం, కొన్ని విలాస‌వంత‌మైన అల‌వాట్ల‌ను మార్చుకోవ‌డం లాంటివి చేయాలి. ప్ర‌స్తుతం ఉన్న ఖ‌ర్చుల‌లో క‌నీసం 10 నుంచి 15 శాతం మేర త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

  1. తుది ఆదాయాన్ని మ‌దింపు వేయండి

మీ ఖ‌ర్చుల‌న్నీ తీరిన త‌ర్వాత మిగిలే ఆదాయాన్ని తుది ఆదాయం అంటారు. దీంతో అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటుకు మీకు ఎంత స‌మ‌యం ప‌డుతుంతో తెలుస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీ పెట్టుబ‌డులు, రుణ‌వాయిదాలు క‌లిపి మీకు నెల‌కు రూ.1 ల‌క్ష ఖ‌ర్చ‌వుతుంద‌నుకుంటే, మీ అత్య‌వ‌స‌ర నిధి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రూ.6 ల‌క్ష‌ల‌కు త‌క్కువ కాకూడ‌దు. దీనిని సాధించాలంటే మీ తుది ఆదాయంలో మీరు ఎంత‌వ‌ర‌కూ ఆదా చేయ‌గ‌ల‌ర‌నే విష‌యాన్ని లెక్క‌లోకి తీసుకోవాలి. ఒక వేళ మీరు నెల‌కు రూ.25 వేలు ఆదా చేయ‌గ‌ల‌ర‌నుకుంటే, అత్య‌వ‌స‌ర నిధి ఏర్నాటుకు ప‌ట్టే స‌మ‌యం 24 నెల‌లు అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

అత్య‌వ‌స‌ర‌మ‌యితే త‌ప్ప ఖ‌ర్చుల‌ను ఆదా చేసేందుకే ప్ర‌య‌త్నించాలి. అత్య‌వ‌స‌ర నిధికి ఏర్పాటుకు మీ డిపాజిట్ల‌లో నుంచి ఏక‌మొత్తంగా న‌గ‌దును స‌మ‌కూర్చుకోవ‌డ‌మూ మంచి ఆలోచ‌నే. ఒక్క‌సారి అత్య‌వ‌స‌ర నిధికి అవ‌స‌ర‌మైన సొమ్ము స‌మ‌కూరిన త‌ర్వాత వాటిని వివిధ ఆర్థిక సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు చేయ‌డం మంచిది.

  1. మీ పెట్టుబ‌డుల‌ను విభ‌జించండి

న‌గ‌దు ల‌భ్య‌త అధికంగా ఉండే రిక‌రింగ్ డిపాజిట్లు లేదా 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సాంప్ర‌దాయ ఆర్థిక సాధనాల‌లో మీ డ‌బ్బులు పెట్ట‌డం మంచిది. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో నుంచి న‌గ‌ద‌ను సుల‌భంగా వెనక్కి తీసుకోవ‌చ్చు కాబ‌ట్టి. ఒక‌వేళ ఇత‌ర మార్గాల‌ను ప్ర‌య‌త్నించాల‌నుకుంటే, లిక్విడ్ ఫండ్ల‌ను సైతం ప‌రిశీలించ‌డం మంచిది. ఎందుకుంటే న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో వాటిపై నిష్క్ర‌మ‌ణ రుసుములు ఉండ‌వు గ‌నుక‌.

అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటుకు జీవిత భాగ‌స్వామితో క‌లిసి సంయుక్తంగా బ్యాంక్ ఖాతాను ప్రారంభించ‌డం మంచిది. పెట్టుబ‌డుల‌లో వైవిధ్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ఉత్త‌మం.

  1. జాగ్ర‌త్త వ‌హించాల్సిన అంశాలు
  • కుటుంబ‌మంత‌టికీ వ‌ర్తించేలా ఆరోగ్య బీమా తీసుకోవ‌డం మంచిది. ఎందుకంటే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌ర నిధి నుంచి డ‌బ్బులు తీయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డ‌దు.
  • కుటుంబలో ప్ర‌ధానంగా ఆర్జించే వ్య‌క్తికి ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే మంచిది. ఒక‌వేళ భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ సంపాదిస్తుంటే ఇద్ద‌రికీ బీమా తీసుకోవ‌డం మ‌రీ మంచిది.
  • చిన్న పిల్లలున్న‌ట్ల‌యితే వారి కోసం ప్రత్యేకంగా మ‌దుపు చేస్తే వారి ఉన్న‌త విద్యకు ఆ మొత్తం అక్క‌ర‌కొస్తుంది.
  • మీ అప్పులు తీరే వ‌ర‌కూ కొత్త అప్పుల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.
  • ఒక వేళ అత్య‌వ‌స‌ర నిధి నుంచి మీరు ఏదైనా సొమ్ము వెన‌క్కి తీసుకున్న‌ట్ల‌యితే, వీలైనంత త్వ‌ర‌గా ఆ సొమ్మును జ‌త చేయ‌డం మ‌ర‌చిపోవ‌ద్దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని