Sovereign Gold Bonds: సార్వ‌భౌమ పసిడి బాండ్లు నేటి నుంచే ఆరంభం.. ఎలా కొనుగోలు చేయాలి?

డిజిట‌ల్ రూపంలో కొనుగోలు చేసేవారికి గ్రాము బంగారం రూ. 4,741 కే ల‌భిస్తుంది.

Updated : 29 Nov 2021 14:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ (2021-22) ఎనిమిదో విడత సార్వభౌమ పసిడి బాండ్లు ఈ రోజు (న‌వంబ‌రు 29) నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ బాండ్లు డిసెంబ‌రు 3వ తేదీ వరకు స‌బ్‌స్క్రిప్ష‌న్‌కు అందుబాటులో ఉంటాయి. ఇష్యూ ధ‌ర గ్రాముకు రూ.4,791గా ఆర్‌బీఐ నిర్ణయించింది. డిజిటల్‌ రూపంలో కొనుగోలు చేసే వారికి రూ.50 డిస్కౌంట్ ల‌భిస్తుంది.

ఏవిధంగా కొనుగోలు చేయొచ్చు?: మదుపర్లు వివిధ మార్గాల్లో సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకుల‌ను మిన‌హాయించి), స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), పోస్టాఫీసుల వ‌ద్ద‌, గుర్తింపు పొందిన స్టాంక్ ఎక్స్‌ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ద్వారా గానీ కొనుగోలు చేయొచ్చు. 

డిజిట‌ల్‌గా: డిజిట‌ల్‌ విధానంలో కొనుగోలు చేసే వారు జాబితాలో పేర్కొన్న షెడ్యూల్డ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుని, డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో చెల్లింపులు చేసేవారికి నామిన‌ల్ ధ‌ర‌పై రూ.50 డిస్కౌంట్‌ను ప్ర‌భుత్వం ఆర్‌బీఐతో క‌లిసి అందిస్తుంది. అంటే డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేసే వారికి రూ.4,741కే గ్రాము బంగారం ల‌భిస్తుంది.

చెల్లింపులు: ఒక వ్య‌క్తి గ‌రిష్ఠంగా రూ.20 వేల వ‌ర‌కు న‌గ‌దు రూపంలో చెల్లించి బాండ్ల‌ను కొనుగోలు చేయొచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్‌, ఎల‌క్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారానూ చెల్లింపులు చేయొచ్చు.

కాల‌ప‌రిమితి: 8 ఏళ్ల కాల‌ప‌రిమితి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్‌ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పనిదినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి దాని ప్రకారం చెల్లింపులు చేస్తారు. 8 ఏళ్ల కంటే ముందుగానే ప‌థ‌కం నుంచి నిష్ట్ర‌మించే అవ‌కాశం ఉంది. అలాంటి సమయంలో మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. బాండ్ల‌ను కొనుగోలు చేసిన ఐదో సంవ‌త్స‌రం నుంచి నిష్క్ర‌మించేందుకు వీలుంటుంది.

వ‌డ్డీ: ప్రస్తుతం సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి మొత్తంపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకోసారి చందాదారుని బ్యాంక్ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది. చివరి ఆరు నెలల వడ్డీని మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తంతో కలిపి చెల్లిస్తారు.

ఎస్‌బీఐ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పసిడి బాండ్లను కొనుగోలు చేసే విధానం..
* ముందుగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
* ఇ-సర్వీస్ ఆప్షన్‌లో ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్‌పై క్లిక్ చేయాలి.
* టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్‌లో టిక్ చేసి ప్రొసీడ్ బటన్‌ను క్లిక్ చేయాలి.
* రిజిస్ట్రేషన్ ఫారమ్‌ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.

గోల్డ్ బాండ్లను ఒక గ్రాము బంగారం ధరతో మొదలుకుని జారీ చేస్తారు. అంటే, ఈ పథకంలో జారీ చేసే ఒక్కో బాండు ఒక గ్రాము బంగారంతో సమానం. కనీసం ఒక గ్రాము నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలవారు గరిష్ఠంగా 4 కేజీల వరకు, సంస్థలు 20 కేజీల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని