Travel Insurance: కొవిడ్‌ స‌మ‌యంలో స‌రైన ప్ర‌యాణ బీమాను ఎలా ఎంచుకోవాలి? 

కోవిడ్‌-19 ప‌రిస్థితుల దృష్ట్యా కొన్ని దేశాలు ప్ర‌యాణ బీమాను త‌ప్ప‌నిస‌రి చేశాయి. మ‌రికొన్ని దేశాలు కూడా అనుస‌రించే ఆలోచ‌న‌లో ఉన్నాయి.

Updated : 25 Aug 2021 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 కార‌ణంగా దాదాపు అన్ని రంగాలూ ప్ర‌భావితమ‌య్యాయి. ర‌వాణా, ఆతిథ్య రంగాలయితే తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. కొవిడ్‌ ప్ర‌భావంతో 2020 నుంచి దేశీయ‌, విదేశీ ప్ర‌యాణాలు రెండూ గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయి. దీంతో టూరిజం ప‌రిశ్ర‌మ బాగా న‌ష్ట‌పోయింది. తిరిగి పుంజుకునేందుకు ఇప్ప‌టికీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ప్ర‌యాణాలు త‌గ్గిపోవ‌డంతో దాని ప్ర‌భావం ప్ర‌యాణ బీమాపై అదే స్థాయిలో క‌నిపిస్తోంది.

ప్ర‌యాణాల నిషేధం.. బీమా పరిశ్రమపై భారం

కొవిడ్‌ మొద‌టి వేవ్ త‌ర్వాత అంటే.. 2020 న‌వంబ‌ర్‌ త‌ర్వాత ట్రావెల్ మార్కెట్ కొంత వ‌ర‌కు పుంజుకున్న‌ప్ప‌టికీ రెండో వేవ్ ప్ర‌భావంతో మ‌ళ్లీ క్షీణించింది. చాలా దేశాలు అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం, ఒక‌వేళ అనుమ‌తించినా కొవిడ్‌ నిర్ధార‌ణ ప‌రీక్ష‌, వ్యాక్సినేషన్‌, క్వారంటైన్ వంటివి త‌ప్ప‌నిస‌రి చేయ‌డంతో విదేశీ ప్ర‌యాణ మార్కెట్ నెమ్మ‌దించింది.

ప్ర‌యాణ‌, ఆతిథ్య ప‌రిశ్ర‌మ‌లు ప‌రస్ప‌ర సంబంధం క‌లిగి ఉంటాయి. ఒక‌దాని ప్ర‌భావం మ‌రొక దానిపై ప‌డుతుంది. ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు, నిషేధం ప్ర‌యాణ బీమాకు భారంగా మారింది. అయితే రాబోయే కొద్ది నెల‌ల్లో ప‌రిస్థితులు మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌యాణాలు పెరిగే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిస్థితుల దృష్ట్యా కొన్ని దేశాలు ప్ర‌యాణ బీమాను త‌ప్ప‌నిస‌రి చేశాయి. మ‌రికొన్ని దేశాలు కూడా ఈ అంశాన్ని అనుస‌రించే ఆలోచ‌న‌లో ఉన్నాయి. అంటే ఇప్ప‌టి నుంచి ప్ర‌యాణ బీమా ప్ర‌తి ఒక్క‌రి ట్రావెల్ ప్లాన్‌లో చేర్చాల్సి ఉంటుంది.

రాబోయే రోజుల్లో ప్ర‌యాణాల‌కు ప్లాన్ చేసుకునే వారు కొవిడ్ -19 కార‌ణంగా తలెత్తే ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేసే ప్ర‌యాణ బీమా పాల‌సీల‌కు ప్రాధాన్య‌ం ఇవ్వాలి. ప్ర‌యాణం ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేందుకు టాటా ఏఐజీ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్, గో-డిజిట్, కేర్ ఇన్సూరెన్స్, భారతీ ఎక్సా వంటి బీమా సంస్థ‌లు ఇచ్చే ప్ర‌యాణ బీమా పాల‌సీలు స‌హాయ‌ప‌డ‌తాయ‌ని నిపుణ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సిన అంశాలు..

* బీమా కొనుగోలు చేసేప్పుడు మ‌న అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు స‌రైన బీమాను ఎంచుకోవాలి. ప్రాథ‌మిక వైద్య ఖ‌ర్చుల‌తో పాటు, బ్యాగేజ్ న‌ష్టం/దొంగతనం, విమానాశ్రయానికి చేరుకునేందుకు ఆల‌స్యం కావడం, విమానం మిస్ అవ్వ‌డం/ఆల‌స్యం/ ర‌ద్దు, ఖ‌రీదైన వ‌స్తువులు పోయినా బీమాలో క‌వ‌ర్ అయ్యే విధంగా ప్ర‌యాణ బీమాను ఎంచుకోవాలి. వీటితో పాటు కొవిడ్-19 కి సంబంధించిన అన్ని ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేసే విధంగా ఉండాలి.

* మార్కెట్‌లో ప్ర‌యాణ బీమాకు సంబంధించి అనేక ప్రొడెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. తీసుకునే వ్య‌క్తి పాల‌సీ ఫీచ‌ర్లతో పాటు, బీమా సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్ప‌త్తి, విదేశీ నెట్‌వ‌ర్క్ హాస్పిటల్స్‌ టై-అప్‌లు, సాల్వెన్సీ రేషియో, ట్రాక్ రికార్డు వంటివి కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని బీమా సంస్థ‌ను ఎంపిక చేసుకోవాలి.

* అనుకోకుండా సామాను లేదా పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా ఆర్థిక అత్య‌వ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ట్రావెల్ బీమా ఉండాలి.

* ఆరోగ్య ర‌క్ష‌ణ‌, దీంతో పాటు ఎయిర్ అంబులెన్స్‌, రోజువారీ ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు న‌గ‌దు భ‌త్యం, యాక్సిడెంట‌ల్ క‌వ‌రేజ్ వంటి ఇత‌ర‌ వైద్య ఖ‌ర్చుల‌ను అందించే స్టాండ్‌-ఇన్-స‌పోర్ట్ ప్ర‌యాణ బీమాను ఎంచుకోవాలి.

* ఇత‌ర రాష్ట్రాలు లేదా దేశాల‌కు ప్ర‌యాణించే వారు ప్ర‌స్తుత పరిస్థితుల‌లో త‌ప్ప‌నిస‌రిగా క్వారెంటైన్‌లో ఉండాలి. కొన్ని బీమా సంస్థ‌లు క్వారెంటైన్ ఖ‌ర్చుల‌ను కూడా చెల్లిస్తున్నాయి. వాటిని ప‌రిశీలించాలి.

* ప్ర‌స్తుత రోజుల్లో విమాన ప్ర‌యాణం ర‌ద్దు అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. కాబ‌ట్టి క్యాన్సల్ ఫర్ ఏ రీజన్ (CFAR) యాడ్-ఆన్‌తో పాటుగా కరోనా వైరస్ సమయంలో బస, ఫ్లైట్ క్యాన్సిలేషన్ ప్రయోజనాలను అందించే పాల‌సీని ఎంచుకోవాలి.

* సాధార‌ణంగా విమాన ప్ర‌యాణం ర‌ద్దయితే దానికి సంబంధించిన ఖ‌ర్చులు పాల‌సీలో క‌వ‌ర్ అవుతాయి. అయితే పాల‌సీ జాబితాలో ఉన్న కార‌ణాల వ‌ల్ల ప్ర‌యాణం క్యాన్సిల్ అయితేనే ఖ‌ర్చులు క‌వ‌ర్ చేస్తాయి. సీఎఫ్ఏఆర్ రైడ‌ర్ ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ర‌ద్ద‌యినా ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేస్తుంది. దీని వ‌ల్ల ట్రావెల్ రిజ‌ర్వేష‌న్ గురించి మ‌రింత సౌల‌భ్యంతో నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని