Bank Account: బ్యాంక్ ఖాతాను ఆప‌రేట్ చేయ‌క‌పోతే..అందులో ఉన్న‌ డ‌బ్బు ఏమౌతుంది? 

 రెండేళ్ల‌పాటు ఎలాంటి లావాదేవీలు జ‌ర‌గ‌ని ఖాతాల‌ను ప‌నిచేయ‌ని ఖాతాలుగా గుర్తిస్తారు  

Updated : 13 Nov 2021 15:59 IST

చాలామంది త‌మ ఆర్థిక విష‌యాల‌ను ఎవ‌రితో పంచుకోవ‌డానికి ఇష్ట‌పడ‌రు. దీంతో వారికి అనుకోకుండా ఏమైనా జ‌రిగినా బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు ఉంద‌న్న సంగ‌తి క‌టుంబ స‌భ్యుల‌కు కూడా తెలియ‌దు. మ‌రోవైపు వేరే ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు పాత బ్యాంకు ఖాతాల‌ను ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తారు. ఇలా క్లెయిమ్ చేసుకోని బ్యాంకు డిపాజిట్లను ఆర్‌బీఐ డిపాజిట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏఎఫ్‌) లో జ‌మ‌చేస్తారు. దీనిని 2014 లో ఆర్‌బీఐ ప్రారంభించింది.
  
ఈ ఫండ్‌లో చేరిన మొత్తాన్ని ప్ర‌భుత్వ సెక్యూరిటీలలో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన క‌మిటీ పెట్టుబ‌డి చేస్తుంది. దానిపై వ‌చ్చిన ఆదాయాన్ని డిపాజిట్ల‌కు వ‌డ్డీ చెల్లించేందుకు, పెట్టుబ‌డుల అవ‌గాహ‌న‌, విద్య కోసం ఉప‌యోగిస్తారు. డీఈఏఎఫ్ ఖాతాలో న‌గ‌దు పెరిగేందుకు కార‌ణం క్లెయిమ్ చేసుకొని ఖాతాల డిపాజిట్లు, రాబ‌డి నుంచి వ‌చ్చినదే.
 
ఆర్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ డిపాజిట్ల‌పై వ‌డ్డీ చెల్లిస్తుంటుంది. ఖాతాదారులు లేదా వార‌సులు ఈ ఖాతాల‌ను ఎప్పుడైన అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు చూపి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే బ్యాంకులు ఇటువంటి క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
    
క్లెయిమ్ చేయ‌ని డ‌బ్బు..
ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, బ్యాంకు ఖాతాను ప‌దేళ్ల‌కు మించి ఆప‌రేట్ చేయ‌క‌పోతే అందులో ఉన్న డ‌బ్బు డీఈఏఎఫ్ ఖాతాకు చేరుతుంది. రెండేళ్ల వ‌ర‌కు ఆప‌రేట్ చేయ‌ని  ఖాతాను ( వ‌డ్డీ, క‌నీస ఛార్జీలు) ప‌నిచేయ‌ని ఖాతాగా ప‌రిగ‌ణిస్తారు. ఇలాంటి వాటిలోకి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకు చెక్కులు, పే ఆర్డ‌ర్లు, ప‌రిష్కారం కాని నెఫ్ట్ లావాదేవీలు కూడా వ‌స్తాయి. బ్యాంకు ఇ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా వినియోగ‌దారునికి దీని గురించి స‌మాచారం అందించాల్సి ఉంటుంది. కానీ, బ్యాంకులు వినియోగ‌దారులకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు వినియోగ‌దారులు వారి వివ‌రాల‌ను, మొబైల్ నంబ‌ర్‌ను అప్‌డేట్ చేయ‌క‌పోవ‌డం కూడా కార‌ణంగా చెప్తున్నారు.
    
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి..
ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, ప్రతి బ్యాంకు క్లెయిమ్ చేయని ఖాతాల వివరాలను బ్యాంక్ వెబ్‌సైట్‌లో చూపించాల్సిన అవసరం ఉంది. వెబ్‌సైట్‌లోని వివరాలను ప‌రిశీలించిన‌ తరువాత, ఖాతాదారులు  సరిగ్గా నింపిన క్లెయిమ్ ఫారమ్, డిపాజిట్ల రశీదులు, కేవైసీ ప‌త్రాల‌తో బ్యాంక్ శాఖను సంప్ర‌దించి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే ఇంత‌కుముందు ఖాతా ఉన్న బ్యాంకుకే వెళ్లి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు బ్యాంకు ఏ శాఖ‌కు వెళ్లినా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే బ్యాంకు ఖాతా చాలా పాత‌ది అయితే దానికి మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాలు లేక‌పోతే హోమ్ బ్రాంచ్‌కు వెళ్ల‌డ‌మే మంచిది. ఖాతాదారుడి వార‌సులు లేదా నామినీలు డిపాజిట్ల ర‌శీదులు, ఖాతాదారుడి మ‌ర‌ణ దృవీక‌ర‌ణ ప‌త్రం, మీకు సంబంధించిన గుర్తింపు ప‌త్రాల‌ను తీసుకెళ్లాలి. అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత బ్యాంకు ఖాతాలోని డ‌బ్బును అప్ప‌గిస్తుంది.

బ్యాంక్ వినియోగ‌దారుల‌కు చెల్లింపు చేసిన తరువాత, అది డీఈఏఎఫ్  ఖాతా నుంచి రీఫండ్ పొందడానికి నెల చివరిలో ఆర్‌బీఐకి క్లెయిమ్ చేస్తుంది. వినియోగ‌దారుడు క్లెయిమ్ చేసుకున్న త‌ర్వాత ఖాతా ఆప‌రేటివ్‌గా మారుతుంది. ఒకవేళ చట్టబద్ధమైన వారసుడు లేదా నామినీ క్లెయిమ్ కోరిన‌ట్ల‌యితే, బ్యాంక్ ఖాతా పరిష్కార ప్రక్రియను ప్రారంభిస్తుంది, దీనికి ఎటువంటి ఛార్జీలు వ‌ర్తించ‌వు.

చివ‌ర‌గా..
మీ పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా ఉండాల‌నేది నిపుణుల సూచ‌న‌. క్లెయిమ్ చేయ‌ని డిపాజిట్లు పెరిగేందుకు ముఖ్య‌ కార‌ణం, ఖాతాదారులు వారి కుటుంబ స‌భ్యుల‌కు, ద‌గ్గ‌రివారికి కూడా పెట్టుబ‌డులు, డిపాజిట్ల గురించి చెప్ప‌క‌పోవ‌డ‌మే అని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. పెట్టుబ‌డుల వివ‌రాల‌కు సంబంధించిన‌ అన్ని రికార్డుల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. క‌నీసం ఇద్ద‌రికైనా పెట్టుబ‌డుల విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఒక‌రు కుటుంబ స‌భ్యులు మ‌రొక‌రు మీకు విశ్వాసం ఉన్న‌వారు కూడా ఉండొచ్చు. మీరు లేక‌పోయినా మీకు సంబంధించిన వారికి డ‌బ్బు చేరేలా ఉండాలి. డ‌బ్బు సంపాదించేందుకు చాలా శ్ర‌మిస్తారు. మ‌రి క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు ఎవ‌రికి చెంద‌కుండా ఉంటే ఏం లాభం. మీరు ఎవ‌రికోసం కూడ‌బెట్టారో వారికి చేరేలా ప్లాన్ చేయ‌డం కూడా మీ భాద్య‌తే.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని