Bank accounts: అవసరంలేని బ్యాంకు ఖాతాలు మూసేయండిలా..

బ్యాంకు ఖాతాల్లో క‌నీస నిల్వ‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది కాబ‌ట్టి ఎక్క‌వ ఖాతాల్ని క‌లిగి ఉండ‌టం మంచిది కాద‌ని అంటున్నారు ఆర్థిక స‌ల‌హాదారులు

Updated : 22 Sep 2021 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగరీత్యానో, వేరే ఇతర కారణాలతోనో కొత్త బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తుంటాం. కొన్నేళ్లకి వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అలాగని అన్ని బ్యాంకు ఖాతాలూ నిర్వహించడం కష్టం. ఎప్పటికప్పుడు ఖాతాలు చెక్‌ చేసుకోవడం, కార్యకలాపాలు కొనసాగించడం కష్టంతో కూడిన వ్యవహారం. పైగా వాటిలో కనీస నిల్వలు ఉంచాలి. అలా చేయకపోతే పెనాల్టీలు పడతాయి. దీనివల్ల క్రెడిట్‌ స్కోర్‌పైనా ప్రభావం పడుతుంది. అందుకే కొత్త ఖాతా తీసుకున్నప్పుడు పాతది మూసేయడం మంచిది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాతాను డీ-లింక్ చేయ‌డం..
మీరు మూసివేయాల‌నుకున్న ఖాతా ఏదైనా చెల్లింపుల సేవ‌ల‌కు అంటే ఫండ్స్ ఇండియా, పేటీఎం, స్విగ్గీ, ఉబ‌ర్ వంటి ఖాతాల‌కు అనుసంధానం చేసి ఉంటే వాటిని డీ-లింక్ చేయాలి. యూపీఐ పేమెంట్స్ మీ ఫోన్‌తో అనుసంధానం చేసి ఉంటాయి. కాబ‌ట్టి మొద‌ట వాటిని డీ-లింక్ చేయాల‌న్న విష‌యం గుర్తుంచుకోండి. దానికి బ‌దులుగా మీరు కొన‌సాగించాల‌నుకున్న‌ ఖాతాను అనుసంధానం చేస్తే చెల్లింపుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎప్ప‌టిలాగే కొన‌సాగుతాయి. కొన్ని ప్లాట్‌ఫాంలు డీ-లింక్ ఫారంను కూడా అడుగుతాయి.

క్లోజ‌ర్ ఫారం..
అన్ని బ్యాంకులు ఖాతా క్లోజ‌ర్ ఫారంను అందిస్తాయి. బ్యాంకు శాఖ లేదా వెబ్‌సైట్ ద్వారా దీనిని పొందొచ్చు. ఉమ్మ‌డి ఖాతా అయితే అంద‌రూ దీనికి స‌మ్మ‌తి తెలపాల్సి ఉంటుంది. ఖాతాలో ఉన్న‌ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు మ‌రొక ఫారంలో ఖాతా నంబ‌ర్‌ను జ‌త చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకు డాక్యుమెంట్లు..
బ్యాంకు జారీ చేసిన‌ ఉప‌యోగించ‌ని చెక్కు బుక్కుల‌ను, డెబిట్‌, క్రెడిట్ కార్డులు, పాస్‌బుక్‌, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరొచ్చు. ఖాతా క్లోజ‌ర్ ఫారంతో పాటు ఇవ‌న్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ డాక్యుమెంట్లను చింపేయాల్సిందిగా చెప్తాయి.

ముగింపు ఛార్జీలు..
ఖాతా ప్రారంభించిన ఏడాదిలోగా మూసేస్తే బ్యాంకులు ముగింపు ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ ఖాతా ప్రారంభించిన 14 రోజుల్లో మూసివేస్తే ఛార్జీలు లేవు. 15వ రోజు నుంచి ఏడాదిలోపు మూసివేస్తే రూ.500 ఛార్జీల‌తో పాటు జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. ఏడాది దాటితే మ‌ళ్లీ ఎలాంటి రుసుములూ ఉండ‌వు. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం బ్యాంకులు స్వ‌తంత్రంగా ఈ ముగింపు ఛార్జీల‌ను విధించుకోవ‌చ్చు. ఈ ప్రాసెస్ మొత్తం పూర్త‌యిన త‌ర్వాత బ్యాంకుకు చెల్లించాల్సిన‌ ఏవైనా పెండింగ్ ఛార్జీలు ఉంటే చెక్ చేస్తాయి. ఖాతా ముగించిన‌ట్లు బ్యాంకు వ‌ద్ద‌ అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. ఇవ‌న్నీ స‌రైన విధానంలో చేసి అవ‌స‌రం లేని ఖాతాల‌ను మూసివేస్తేనే ఆర్థిక ప్ర‌ణాళిక‌కు ఎటువంటి ఇబ్బందీ ఉండ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు