ఫారం 16లు రెండున్నాయా?

ఒక ఆర్థిక సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో ఉద్యోగం మార‌డం వ‌ల్ల రెండు ఫారం 16లు అందుకున్న‌వారి ప‌రిస్థితేమిటి? రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు వీటిలో ఏది వాడాలో తెలుసుకుందాం..  

Published : 18 Dec 2020 18:01 IST

మీరు ఉద్యోగం చేసేవారా? నెల నెలా వేత‌నం పొందుతూ ఆదాయ‌పు పన్ను రిట‌ర్నులు దాఖ‌లు చేస్తున్నారా? గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో ఉద్యోగం మారారా? మా అంచ‌నా స‌రైన‌దైతే మీ వ‌ద్ద రెండు ఫారం 16లు ఉండాలి.

ఈ సారి రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు కూర్చున్న‌ప్పుడు … రెండు ఫారం 16ల‌తో రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను ఎలా కొన‌సాగించాలో తెలియ‌డం లేదా? అయితే ఈ క‌థ‌నం మీలాంటి వారికోస‌మే…

ఏం కావాలి?

  • ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ప్ర‌తి ఉద్యోగికి సంస్థ యాజ‌మాని ఫారం 16ని అంద‌జేయాలి. స్థూల ఆదాయ‌మైన వేత‌నం, మూలం వ‌ద్ద ప‌న్ను కోతతో పాటు సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు వివ‌రాలు ఈ ఫారం 16లో పొందుప‌ర్చి ఉంటాయి.

  • పాత సంస్థ‌లో ఆదాయ వివ‌రాల‌ను కొత్త సంస్థ‌లో తెలియ‌జేస్తే అందుకు త‌గిన‌ట్టు లెక్క‌లు వేసి ఫారం 16ని అంద‌జేయాల్సిన బాధ్య‌త కొత్త కంపెనీది.

  • ఒక వేళ పాత సంస్థ ఇచ్చే వేత‌న వివ‌రాలు, మిన‌హాయింపుల‌ను కొత్త సంస్థ‌కు తెలియ‌జేయ‌క‌పోతే… అందుకు త‌గిన‌ ప‌న్ను చెల్లించాల్సి రావ‌చ్చు.

  • ఐటీఆర్ రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు స్థూల వేత‌నాన్ని స్వ‌యంగా కూడా లెక్క‌పెట్ట‌వ‌చ్చు.

రిట‌ర్నులు దాఖ‌లు చేసే విధానం

  • ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి స్వ‌యంగా ఈ-ఫైలింగ్ చేయ‌ద‌లిస్తే మాత్రం … తొలుత అన్ని ఫారం 16ల‌ను ముందుంచుకోవాలి.
  • లాగిన్ అయ్యాక ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానించాక ఈ-ఫైలింగ్ ప్ర‌క్రియ మొద‌లు పెట్ట‌వ‌చ్చు.
  • స‌రైన ఐటీఆర్ ఫారంను ఎంచుకొని సాధార‌ణ వివ‌రాలైన పూర్తి పేరు, చిరునామా లాంటివి నింపాలి.
  • రివైజ్డ్ రిట‌ర్న్ లేదా ఒరిజిన‌ల్ రిట‌ర్న్… వీటిలో ఏది దాఖ‌లు చేస్తున్నామా అనే దాన్ని తెలపాలి.
  • Income details సెక్ష‌న్‌లో వేత‌న ఆదాయాన్ని న‌మోదు చేయాలి. ఇక్క‌డ రెండు కంపెనీల నుంచి వ‌చ్చిన వేత‌నాన్ని స్వయంగా నింపాల్సి ఉంటుంది.
  • సెక్ష‌న్ 80సీ మిన‌హాయింపుల‌ను పేర్కొనాలి. ఆ త‌ర్వాత సిస్ట‌మ్ ఆటోమెటిక్‌గా లెక్క‌వేసి చెల్లించాల్సిన ప‌న్నును తెలియ‌జేస్తుంది.

రీఫండ్‌, ప‌న్ను కోత వివ‌రాల‌ను స‌రిచూసుకోవాలి

  • లెక్క‌లు వేశాక‌, త‌ర్వాతి పేజీలో… వేత‌నంలో మూలం వ‌ద్ద ప‌న్ను కోత వివ‌రాలు క‌నిపిస్తాయి.

  • కొత్త సంస్థ వివ‌రాలు లేక‌పోతే… స్వయంగా చేర్చే అవ‌కాశం ఉంది.

  • ఈ వివ‌రాలు నింపాక‌… ప‌న్ను చెల్లింపుల‌ను వెరిఫై చేసుకునేందుకు అవ‌కాశంతోపాటు రీఫండ్‌, లేదా ఇంకా చెల్లించాల్సిన ప‌న్ను గురించి వివ‌రాలు తెలుస్తాయి.

  • ఇన్‌క‌మ్ ట్యాక్స్‌ వెబ్‌సైట్ లో ల‌భించే ఫారం 26ASతో ప‌న్ను చెల్లింపుల వివ‌రాల‌ను స‌రిచూసుకోవ‌చ్చు.

  • ఈ ప్ర‌క్రియంతా గంద‌ర‌గోళంగా అనిపిస్తే కొన్ని వెబ్‌సైట్లు నామ‌మాత్ర‌పు ఫీజుతో ఈ సేవ‌ల‌ను అందిస్తాయి.

గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు

  • కొత్త సంస్థ‌లో … మీ పాత సంస్థ‌కు సంబంధించిన వేత‌న వివ‌రాలు తెలియ‌జేయ‌క‌పోతే… కొత్త కంపెనీ మీ పాత ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోకుండానే త‌క్కువ మూలం వ‌ద్ద ప‌న్నును కోత విధిస్తుంది.

  • అదే విధంగా… కొత్త సంస్థ యాజ‌మాని వ‌ద్ద సెక్ష‌న్ 80సీ మిన‌హాయింపులు(పాత సంస్థ చేసిన‌) గురించి చెప్ప‌క‌పోతే… రెండు సార్లు కోత ప‌డే అవ‌కాశం ఉంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఒక సారి స‌మీక్ష చేసుకోవ‌డం మంచిది.

(Courtesy: LiveMint)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని