Updated : 15 Nov 2021 16:12 IST

Credit Card: క్రెడిట్ కార్డుతో వీలైన‌న్ని ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే..

 

బ్యాంకులు వినియోగదారుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు అనేక రకాల క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వినియోగ‌దారుని జీవ‌న శైలిని దృష్టిలో ఉంచుకుని ర‌క‌ర‌కాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉంచుతున్నాయి. కొన్ని కార్డులు రివార్డ్ పాయింట్లు అందిస్తుండ‌గా మ‌రికొన్ని కార్డులు సినిమా టికెట్ల మీద డిస్కౌంట్లు, పెట్రోలు లేదా డీజిల్ కొనుగోళ్లపై ప్రయోజనాలను, దుస్తుల కొనుగోళ్ల పై డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అయితే కార్డు తీసుకునేముందు కార్డు ఫీచ‌ర్లు, రివార్డ్ పాయింట్లు, చెల్లించాల్సిన వార్షిక రుసుములు వంటి వాటిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అంటున్నారు ఆర్ధిక నిపుణులు. 

క్రెడిట్ కార్డు ద్వారా ఎక్కు వ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకోవాలి. 

1. క్రెడిట్ కార్డు ఫీచ‌ర్లు...
కొన్ని సార్లు క్రెడిట్ కార్డును రుణ సంస్థలు ఉచితంగా జారీ చేసినప్పటికీ, వార్షిక పునరుద్ధరణ రుసుమును వసూలు చేయవచ్చు. మరోవైపు, మీ వ్యక్తిగత జీవనశైలికి సరిపోనీ క్రెడిట్ కార్డును ఎంచుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అందువ‌ల్ల మీ జీవ‌నశైలికి త‌గిన క్రెడిట్ కార్డును ఎంచుకోండి. ఉదాహరణకు, మీరు ఉద్యోగం లేదా వ్యాపార రీత్యా ఎక్కువ‌గా సొంత వాహ‌నం వినియోగించే వారైతే ఫ్యూయ‌ల్ కార్డును ఎంచుకోవ‌డం మంచిది. వార్షిక రుసుముల‌తో పాటు వ‌ర్తించే ఇత‌ర ఛార్జీల గురించి కూడా తెలుసుకోండి.

2. తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని తెలుసుకోండి:
క్రెడిట్ కార్డు చేతిలో ఉంటే.. పండుగ‌ల వంటి స‌మ‌యంలో నియంత్ర‌ణ కోల్పోతుంటారు చాలామంది. తమ కొనుగోలు శక్తికి మించి క్రెడిట్ కార్డుతో ఖ‌ర్చు చేస్తుంటారు. తీరా స‌మ‌యం వ‌చ్చే స‌రికి చెల్లింపులు చేయ‌లేక క‌నీస మొత్తాన్ని చెల్లించి మిగ‌లిన మొత్తాన్ని త‌రువాతి నెల‌కు బ‌దిలీ చేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ రుణ ఊబి లో చిక్కుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని నిపుణులు అంటున్నారు. సాధారణంగా చెల్లించని మొత్తంపై అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి క్రెడిట్ కార్డ్ సంస్థ‌లు.  కనీస మొత్తం చెల్లించినా మిగిలిన మొత్తం పై అధిక వడ్డీ రేటు చెల్లించక తప్పదు.   

3. సకాలంలో చెల్లింపులు చేయండి:
క్రెడిట్ కార్డుపై చేసిన ఖ‌ర్చును నిర్ణీత స‌మయంలో చెల్లించ‌డం ద్వారా ఎలాంటి రుసుములు, చార్జీలు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీంతో పాటు మంచి క్రెడిట్ ప్రొఫైల్ ను నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి చాలా త్వ‌ర‌గా రుణాలు, త‌క్కువ వ‌డ్డీ రేటుతో ల‌భిస్తాయి. అందువ‌ల్ల‌ క్రెడిట్ కార్డు బిల్లులను గడువు తేదీలోగా చెల్లించడం మంచిది. 

4. నగదు విత్‌డ్రా వద్దు..
క్రెడిట్‌ కార్డు పరిమితిలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది. దీంతో చాలా మంది ఈ కార్డు డెబిట్/ఏటీఎం కార్డులా కూడా వాడుతుంటారు. అయితే, అత్యవసరమైతే తప్ప.. నగదు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే నగదు తీసుకున్న తర్వాత రోజు నుంచే వడ్డీ ప్రారంభమవుతుంది. దీనికి బిల్లింగ్‌ సైకిల్‌ అంటూ ఏమీ ఉండదు.

5. బ్యాలన్స్ ట్రాన్స్ఫర్
అత్యవసర పరిస్థితుల్లో మీరు చివరి రోజు కూడా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతే ఈ బ్యాలన్స్ మొత్తాన్ని మరో క్రెడిట్ కార్డుకి బదిలీ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు బిల్లు మొత్తాన్ని సమకూర్చడానికి మరి కాస్త సమయం లభిస్తుంది. మీ వద్ద 2-3 క్రెడిట్ కార్డుల్లో బిల్లులు ఉన్నట్టయితే  బ్యాలన్స్ మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటు, తక్కువ చార్జీలు ఉన్న ఒకే కార్డు కి బదిలీ చేసుకోవచ్చు.    

చివరగా..

మీరు క్రెడిట్ కార్డు అందించే ప్ర‌యోజ‌నాల‌ను పూర్తిగా పొందాలంటే ఆర్థిక క్రమశిక్షణతో మెల‌గ‌డం అవ‌స‌రం. కనీస బ్యాలెన్స్‌ను మాత్రమే చెల్లించకుండా పూర్తి బకాయిల‌ను స‌మ‌యం కంటే ముందే చెల్లించడం మంచిది. దీని ద్వారా మీరు రుణ ఉచ్చులో చిక్క‌కుపోరు. అలాగే క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బ తినకుండా ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts