Bank Locker: ఆన్‌లైన్‌లో లాకర్‌ లభ్యత ఇలా తెలుసుకోండి..

బ్యాంకు లాక‌ర్లు ఫ‌స్ట్-క‌మ్-ఫ‌స్ట్‌-స‌ర్వ్ బేసిస్ లో ల‌భిస్తాయి. 

Updated : 27 Nov 2021 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలువైన వ‌స్తువుల‌ భ‌ద్ర‌త కోసం చాలా మంది బ్యాంక్ లాక‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తారు. ఇందుకోసం వారి ద‌గ్గ‌ర‌లోని బ్యాంకు శాఖ‌కు వెళ‌తారు. అయితే శాఖ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా లాక‌ర్ ల‌భ్య‌త‌ను ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే తెలుసుకునే సౌక‌ర్యాన్ని అందిస్తున్నాయి బ్యాంకులు. ఒక‌వేళ అప్ప‌టికి, అందుబాటులో లేక‌పోయినా బ్యాంకు లాక‌ర్ కోసం రిజిస్ట‌ర్ చేసుకునే స‌దుపాయం క‌ల్పిస్తున్నాయి. రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం వ‌ల్ల అందుబాటులో ఉన్న‌ప్పుడు మీరు లాక‌ర్‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంద‌న‌ల ప్ర‌కారం.. బ్యాంకులు లాక‌ర్ల కోసం వెయిటింగ్ లిస్ట్‌ను నిర్వ‌హించాలి. లాక‌ర్ కోసం సంప్ర‌దించిన‌వారికి వెయిటింగ్‌ లిస్ట్ నంబ‌ర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు లాక‌ర్ ల‌భ్య‌త‌ను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునేందుకు వీలుంది.

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఆన్‌లైన్‌లో లాక‌ర్ ల‌భ్య‌త‌ను తెలుసుకునే విధానం..
ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా అనేక శాఖల్లో  సేఫ్ డిపాజిట్ వ్యాలెట్‌ లేదా లాక‌ర్ సేవ‌ల‌ను అందిస్తోంది. క‌నీస వార్షిక రుసుములు ఉంటాయి. మీరు ఏబ్రాంచ్‌లో లాక‌ర్ తీస‌కుంటున్నారు? లాక‌ర్ ప‌రిమాణం ఎంత? వంటి అంశాల ఆధారంగా రుసుములు మారుతుంటాయి. అయితే లాక‌ర్ తీసుకునేందుకు ముందు ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు.. వారు అనుకున్న బ్రాంచ్‌లో లాక‌ర్ ఖాళీగా ఉందా లేదా నిర్ధారించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్‌ శాఖ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో లాక‌ర్ ల‌భ్య‌త గురించిన వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా లాక‌ర్ ల‌భ్య‌త‌ను తెలుసుకునే విధానం..
*
ముందుగా ఎస్‌బీఐ యోనో యాప్‌కి లాగిన్ అవ్వాలి.
* 'మోర్‌' బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే 'ఇ-లాక‌ర్' ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.
* ఇక్క‌డ మీ రాష్ట్రం, జిల్లా, పిన్ నంబర్లను ఎంట‌ర్ చేసి 'స‌బ్మిట్‌'ను క్లిక్ చేయాలి. 
* ఇప్పుడు స్క్రీన్‌పై లాక‌ర్ స‌దుపాయం అందుబాటులో ఉన్న బ్రాంచ్‌ల‌ వివ‌రాలు క‌నిపిస్తాయి. 
* మీకు కావ‌ల‌సిన బ్రాంచ్‌ను ఎంచుకుని, దాని పేరుపై టాప్‌ చేస్తే మ‌రిన్ని వివ‌రాలు ల‌భిస్తాయి.

ఎస్‌బీఐ ఆన్‌లైన్ పోర్ట‌ల్ ద్వారా లాక‌ర్ ల‌భ్య‌త‌ను తెలుసుకునే విధానం..
లాక‌ర్ ల‌భ్య‌త‌ను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. 
* ముందుగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
* 'ఇ-స‌ర్వీసెస్‌'లో అందుబాటులో ఉన్న 'ఆన్‌లైన్ లాక‌ర్‌'పై క్లిక్ చేయాలి.
* ఇక్క‌డ మీ రాష్ట్రం, జిల్లా, పిన్ నంబర్లను ఎంట‌ర్ చేసి 'స‌బ్మిట్‌'ను క్లిక్ చేయాలి.
* ఇప్పుడు స్క్రీన్‌పై లాక‌ర్ స‌దుపాయం అందుబాటులో ఉన్న బ్రాంచ్‌ల‌ వివ‌రాలు క‌నిపిస్తాయి.
* లాక‌ర్ సైజు త‌దిత‌ర వివ‌రాల కోసం.. కావ‌ల‌సిన బ్రాంచ్‌ను ఎంచుకుని, దాని పేరుపై టాప్‌ చేస్తే కావ‌ల‌సిన వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

బ్యాంకు లాక‌ర్లు ఫ‌స్ట్-క‌మ్-ఫ‌స్ట్‌-స‌ర్వ్ బేసిస్‌లో ల‌భిస్తాయి. ఎవ‌రైనా లాక‌ర్ నుంచి నిష్ర్క‌మిస్తే ఆ అవ‌కాశం రిజిస్ట‌ర్ చేసుకున్న వారికి ల‌భిస్తుంది. బ్యాంకు లాక‌ర్ ఉప‌యోగించుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా ఆ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవ‌సరం లేద‌న్న విష‌యం గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని