ఆరోగ్య బీమాలో.. థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్ల‌ను ఎంచుకోవ‌డం ఎలా?

టీపీఏ అందించే సేవ‌ల‌తో పాల‌సీదారుడు సంతృప్తిగా లేక‌పోతే, పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో టీపీఏను మార్చుకోవ‌చ్చు.

Updated : 08 Jun 2021 15:51 IST

ఆరోగ్య బీమాలో న‌గ‌దు ర‌హిత క్లెయిమ్‌లు ఫైల్ చేసే సమ‌యంలో థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్లు(టీపీఏ) ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీ టీపీఏ క్రియాశీలకంగా లేక‌పోయినా, ఆధునిక వ్య‌వ‌స్థ‌కు అప్‌డేట్ కాక‌పోయినా క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఆల‌స్యం కావ‌డ‌మే కాకుండా.. గంద‌ర‌గోళం జ‌రిగే ప్ర‌మాదం ఉంది.  ఆరోగ్య బీమా పాల‌సీల క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి, ఆసుపత్రుల నెట్వర్కింగ్, నగదు రహిత వైద్య సేవల ఏర్పాటు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌, స‌కాలంలో సెటిల్ చేయటం వంటి పలు రకాల సేవలను బీమా సంస్థ నుంచి పాల‌సీదారునికి అందించ‌డంలో థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్లు స‌హాయ‌ప‌డ‌తారు. 

ఆరోగ్య బీమా పాల‌సీలో..  థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్ల‌ను బీమా సంస్థ‌లు నియ‌మిస్తాయి. ఇవి బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి మ‌ధ్య వారదిలా ప‌నిచేస్తాయి.  ఇందుకోసం టీపీఏలు ఇన్సురెన్స్ రెగ్యుటేట‌రీ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) వ‌ద్ద రిజిస్ట‌ర్ కావాల్సి ఉంటుంది. 

పాల‌సీ కొనుగోలు చేసే స‌మ‌యంలో మీరు స్వ‌యంగా టీపీఏను ఎంచుకోవ‌చ్చు. ఒక‌వేళ ప్ర‌స్తుతం ఉన్న‌ టీపీఏ అందించే సేవ‌ల‌తో మీరు సంతృప్తి చెంద‌క‌పోతే, పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో టీపీఏను మార్చుకోవ‌చ్చు. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో ఎంచుకోనివారికి,  బీమా సంస్థే టీపీఏను కేటాయిస్తుంది. 

టీపీఏలు ఆరోగ్య బీమా పాల‌సీల‌ను విక్ర‌యించవు. పాల‌సీదారుడు అందించిన ప‌త్రాల స‌హాయంతో న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌లు, క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ప్రాసెస్‌ వంటి ప‌లు ర‌కాల సేవ‌ల‌ను బీమా సంస్థ నుంచి పాల‌సీదారునికి అంద‌జేయ‌డ‌మే టీపీఏ ప్ర‌ధానంగా చేసే ప‌ని. 

టీపీఏలు పాల‌సీ దారుల‌కు హెల్త్ కార్డులు జారీ చేస్తాయి. ఇవి ఆసుప‌త్రిలో చేరే స‌మ‌యంలోనూ, క్లెయిమ్‌ల‌ను పూర్తిచేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా పాల‌సీదారుని స‌మాచారం, క్లెయిమ్ స్టేట‌స్‌ను ట్రాక్ చేసేందుకు ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. 

"క్లెయిమ్‌ల‌ను అంగీకరించ‌డం, తిరస్క‌రించ‌డం పూర్తిగా బీమా సంస్థపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విష‌యంలో టీపీఏకు సంబంధం ఉండ‌దు. పాల‌సీ సంబంధిత ప‌త్రాలు, ఆసుప‌త్రి బిల్లులు, క్లెయిమ్ సెటిల్‌మెంటుకు కావ‌ల‌సిన ఇత‌ర ప‌త్రాల‌ను పాల‌సీదారుని నుంచి సేక‌రించి, సెటిల్‌మెంట్ ప్రాసెస్ త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు టీపీఏ స‌హాయ‌ప‌డుతుంది." అని ప్రోబ‌స్ ఇన్సురెన్స్ డైరెక్ట‌ర్ రాకేష్ గోయ‌ల్ తెలిపారు. అన్ని బీమా సంస్థ‌లు టీపీఏను నియ‌మించ‌వు.  కొన్ని సంస్థ‌లు ఇన్ - హౌస్ సెటిల్‌మెంట్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకుంటాయి. టీపీఏ, ఇన్-హౌస్ వ్య‌వ‌స్థ‌  రుండూ పాల‌సీదారునికి క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌తో పాటు ఇత‌ర సేవ‌ల‌ను అందిస్తాయి. అయితే ఈ రెండింటికి మ‌ధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

టీపీఏ vs ఇన్‌-హౌస్(అంత‌ర్గ‌త‌) సెటిల్‌మెంట్‌..
ఆరోగ్య బీమా సంస్థల అందించే వివిధ రకాల‌ సేవలు, రోజు వారి కార్య‌కలాపాలను టీపీఏలు నిర్వ‌హిస్తాయి. పాల‌సీదారుడు ఆసుప్ర‌తిలో చేరిన‌ప్పుడు అత‌ను/ఆమెకు అందించే చికిత్స.. అందుకు అయ్యే ఛార్జీల‌పై రివ్యూ చేసేందుకు టీపీఏలు వృత్తిప‌రంగా అర్హ‌త గ‌ల వైద్యుని నియ‌మిస్తాయి. పాల‌సీదారులకు త‌క్కువ ఖ‌ర్చుతో మెరుగైన వైద్య స‌దుపాయం అందించేందుకు వివిధ ఆసుప‌త్రుల‌తో ఒప్పందాలు చేసుకుంటాయి. వీటినే నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు అంటారు.

టీపీఏలు పాల‌సీదారునికి బీమా సంస్థ‌ల‌కు మ‌ధ్య వారిదిగా ప‌నిచేస్తాయి. బీమా సంస్థ‌.. పాల‌సీదారుని నేరుగా సంప్ర‌దించ‌దు. పాల‌సీదారుడు, టీపీఏను సంప్ర‌దిస్తే... టీపీఏ బీమా సంస్థ‌తో మాట్లాడుతుంది. అదే విధంగా బీమా సంస్థ త‌న నిర్ణ‌యాన్ని టీపీఏకి తెలియ‌జేస్తే.. టీపీఏ పాల‌సీదారునికి తెలియ‌జేస్తారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు కొంత టైం ప‌డుతుంది కాబ‌ట్టి క్లెయిమ్ ప‌రిష్కారం కూడా ఆల‌స్యం అవుతుంది. దీనికి తోడు టీపీఏను ప్ర‌స్తుతం ఉన్న టెక్నాలిజికీ అప్‌డేట్ కాక‌పోతే, ఈ ప్ర‌క్రియ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. 

ఇక ఇన్‌-హౌస్ సెటిల్‌మెంట్ విష‌యానికి వ‌స్తే, బీమా సంస్థ‌లు అంత‌ర్గ‌తంగా క్లెయిమ్ సెటిల్‌మెంట్ వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకుంటాయి కాబ‌ట్టి, ఈ ప్ర‌క్రియ‌లో.. బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి మ‌ధ్య‌వ‌ర్తి ఉండ‌రు. ఏ విష‌య‌మైన‌, నిర్ణ‌యాలు, చ‌ర్చ‌ల‌యినా బీమా సంస్థ‌కు పాల‌సీదారునికి మ‌ధ్యే ఉంటాయి. దీంతో స‌మ‌యం వృధా కాదు అని గోయ‌ల్ తెలిపారు. 

టీపీఏను ఎంచుకోవడం ఎలా?
ప్ర‌తీ బీమా సంస్థ‌కు అంత‌ర్గ‌త క్లెయిమ్ సెటిల్‌మెంట్ వ్య‌వ‌స్థ ఉండ‌దు. అందువ‌ల్ల ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసేప్పుడే టీపీఏను ఎంచుకోవ‌ల‌సి ఉంటుంది. 

* టీపీఏను ఎంపిక చేసేప్పుడు ముందుగా చూడాల్సింది నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల జాబితా. మీరు నివ‌సించే ఇంటికి ద‌గ్గ‌ర‌గా ఉన్న లేదా మీరు త‌ర‌చూ వైద్యం కోసం వెళ్లే ఆసుప‌త్రులు గుర్తించండి. ఆ ఆసుప‌త్రిలు టీపీఏ నెర్క్‌వ‌ర్క్ జాబితాలో ఉన్నాయో.. లేదో తెలుసుకోండి. 
* టీపీలు అందించే ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఆయా టీపీఏ వెబ్‌సైట్‌ల‌ను సంద‌ర్శించవ‌చ్చు. 
* కొన్ని టీపీఏలు వాల్యు యాడెడ్ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు, అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో వైద్య స‌దుపాయం వంటివి. వాటి సేవ‌ల‌ను మొబైల్ యాప్ ద్వారా ఇంటి వ‌ద్ద అందిస్తున్నాయి. 
* దాదాపు రెండు దశాబ్దాలుగా ఆరోగ్య బీమాలో టీపీఏలు సేవ‌లు అందిస్తున్నాయి.  సాంకేతిక ప‌రిజ్ఞానంలో ముందుండి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ త్వ‌ర‌గా పూర్తిచేయ‌గ‌ల సామ‌ర్ధ్యం ఉన్న టీపీఏను ఎంచుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని