పీపీఎఫ్ ఖాతా బ‌దిలీ ఎలా?

మ‌న దేశంలో పొదుపు చేసుకోవ‌డానికి రూపొందించిన ప‌థ‌కాల్లో ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) అత్యంత ఆద‌ర‌ణ పొందిన ప‌థకం. ఇందులో చేసే పెట్టుబ‌డులకు భ‌ద్ర‌తతో పాటు ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలుండ‌ట‌మే ఇందుకు కార‌ణం....

Published : 17 Dec 2020 13:33 IST

పీపీఎఫ్ ఖాతాను ఒక శాఖ నుంచి మ‌రో శాఖకు ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం​​​​​​​

మ‌న దేశంలో పొదుపు చేసుకోవ‌డానికి రూపొందించిన ప‌థ‌కాల్లో ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) అత్యంత ఆద‌ర‌ణ పొందిన ప‌థకం. ఇందులో చేసే పెట్టుబ‌డులకు భ‌ద్ర‌తతో పాటు ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల ద్వారా మీరు పీపీఎఫ్ లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అయితే బ్యాంకుల్లో మాదిరిగా ఆన్‌లైన్‌లో డ‌బ్బులను పంపించ‌డం పోస్టాఫీసుల్లో కుదర‌దు. ప్ర‌తీసారి పోస్టాఫీసులను సంద‌ర్శించేందుకు విముఖత ఏర్ప‌డుతుంది. ఈ కార‌ణం చేత చాలా మంది పోస్టాఫీసుల్లోని త‌మ‌ ఖాతాల‌ను బ్యాంక్‌కు బ‌దిలీ చేసుకోవాల‌నుకుంటారు. అలాగే కొన్ని కార‌ణాల చేత బ్యాంకుల్లో పీపీఎఫ్ ఖాతా క‌లిగిన వారు కూడా త‌మ ఖాతాను బ‌దిలీ చేసుకోవాల‌నుకుంటారు. వారికి వేరో చోటుకి బ‌దిలీ అయిన‌ప్పుడు, లేదా బ్యాంకు అందించే సేవ‌ల ప‌ట్ల వారు సంతృప్తిగా లేని సంద‌ర్భాల్లో బ్యాంక్ లోని ఖాతాను బ‌దిలీ చేసుకోవాల‌నుకోవ‌చ్చు. బ్యాంకు, పోస్టాఫీసుల్లోని వారు త‌మ ఖాతాల‌ను బ్యాంక్ నుంచి పోస్టాఫీసుకు లేదా పోస్టాఫీసు నుంచి బ్యాంకుకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. లేదా ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కీ మార్చుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకు లేదా పోస్టాఫీసులోనే ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు మార్చుకోవాల‌నుకున్న‌ప్పుడు బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు మార్చుకోవ‌డం చాలా సుల‌భం. ప్ర‌స్తుతం మీ ఖాతా ఉన్న శాఖ‌ను సంప్ర‌దించి వేరే శాఖ‌కు మార్చాల‌ని ఒక ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పిస్తే చాలు. ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌డానికి ఒక రోజు నుంచి ఏడు రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు లేదా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు మార్చుకోవాల‌నుకున్న‌ప్పుడు…

బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు లేదా పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు ఖాతా మార్చుకోవాల‌నుకున్న‌ప్పుడు ఈ కింది విధంగా చేయాల్సి ఉంటుంది.

  1. మీ పీపీఎఫ్ పాస్‌బుక్‌తో ప్ర‌స్తుతం మీకు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసును ద‌ర్శించండి.
  2. మీరు బ‌దిలీ కోరుకుంటున్న బ్యాంకు లేదా పోస్టాఫీసు శాఖ వివ‌రాలతో కూడిన ద‌ర‌ఖాస్తున్న ప్ర‌స్తుతం మీకు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసులో స‌మ‌ర్పించండి.
  3. మీ ద‌ర‌ఖాస్తు అందిన వెంట‌నే, ప్ర‌స్తుతం మీకు ఖాతా ఉన్నశాఖ అధికారులు బ‌దిలీ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తారు. మీ ద‌ర‌ఖాస్తుకి సంబంధించిన ర‌శీదును తీసుకోండి. ప్ర‌స్తుతం మీకు ఖాతా ఉన్న శాఖ అధికారులు ఈ కింద వివ‌రించిన ప‌త్రాల‌ను మీరు బ‌దిలీ కోరుకుంటున్న శాఖ‌కు పంపుతారు.
  • ఖాతాకు సంబంధించిన స‌ర్టిఫైడ్ కాపీ
  • ఖాతా తెర‌వ‌డానికి అవ‌స‌ర‌మైన అస‌లు ద‌ర‌ఖాస్తు ప‌త్రం
  • నామినేష‌న్ ఫారం
  • మీ సంత‌కాలతో కూడిన న‌మూనా
  • మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌కు సంబంధించిన చెక్ లేదా డీడీ
  • ప్ర‌స్తుత‌మున్న పీపీఎఫ్ పాస్‌బుక్‌
  1. మీకు సంబంధించిన ప‌త్రాలు కొత్త శాఖకు వ‌చ్చిన వెంటనే, సంబంధిత బ్యాంకు శాఖ వారు మీకు దాని గురించి స‌మాచారం పంపుతారు.

  2. కొత్త శాఖ‌లో మీరు మ‌ళ్లీ కొత్త‌గా ఖాతా ప్రారంభించేందుకు ద‌ర‌ఖాస్తు ఫారం స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. నామినేష‌న్‌లో మార్పు కోసం, ఒరిజిన‌ల్ పాస్‌బుక్ కోసం కూడా ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

  3. మీ వినియోగ‌దారుని గురించి తెలుస‌కో(కేవైసీ) ప్ర‌క్రియ‌లో భాగంగా మీ ఫొటోగ్రాఫ్‌లు, పాన్ కార్డు, ఆధార్‌, ఓట‌ర్ కార్డు వంటి చిరునామా గుర్తింపు ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ పూర్తి కావ‌డానికి నెల రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు:

ఖాతాను బ‌దిలీ చేసుకునే సంద‌ర్భాల్లోనూ మీరు మ‌రోసారి కైవైసీ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ ఖాతాను కొన‌సాగించే ఖాతాగా ప‌రిగ‌ణిస్తారు. ఇందువ‌ల్ల మెచ్యూరిటీ తీర‌క‌ముందే న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ, రుణం పొందే వెసులుబాటు ల‌భిస్తాయి.

ఖాతా బ‌దిలీ త‌ర్వాత మీకు కొత్త పాసుబుక్ ఇస్తారు. దీంతోపాటు పాత పాసుబుక్‌కి సంబంధించి ఫొటో కాపీ తీసుకోవ‌డం మరిచి పోవ‌ద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని