మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంటును అర్థం చేసుకోవ‌డం ఎలా?

క్రెడిట్ కార్డు ఉప‌యోగించి చేసే నెల‌స‌రి చెల్లింపుల మొత్తం వివ‌రాల‌ను, చెల్లింపు ప‌రిమితి పూర్త‌య్యే కాలానికి ఇచ్చే స‌మాచార‌మే క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌. మొత్తం కాల‌ప‌రిమితిలో ఎటువంటి లావాదేవీలు జ‌రుప‌కపోయినా స‌రే స్టేట్‌మెంటును ఇస్తారు. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంటు, వివిధ అంశాలు..

Updated : 02 Jan 2021 19:47 IST

క్రెడిట్ కార్డు ఉప‌యోగించి చేసే నెల‌స‌రి చెల్లింపుల మొత్తం వివ‌రాల‌ను, చెల్లింపు ప‌రిమితి పూర్త‌య్యే కాలానికి ఇచ్చే స‌మాచార‌మే క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌. మొత్తం కాల‌ప‌రిమితిలో ఎటువంటి లావాదేవీలు జ‌రుప‌కపోయినా స‌రే స్టేట్‌మెంటును ఇస్తారు.

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంటు, వివిధ అంశాలు:

స్టేట్‌మెంట్ కాల ప‌రిమితి:

బిల్లుకు పైన స్టేట్‌మెంటు కాల‌వ్య‌వ‌ధిని చూడొచ్చు. సాధార‌ణంగా ఒక నెల కాల వ్య‌వ‌ధి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి మీ స్టేట్‌మెంటు కాలం ఏప్రిల్ 12 నుంచి ప్రారంభ‌మైతే, మే 13 తో ముగుస్తుంది. ఈ కాలాన్ని మీ చెల్లంపులపై వ‌డ్డీ లేని కాలంగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. సాధార‌ణంగా బ్యాంకులు 55 రోజుల వ‌డ్డీ లేని రుణ వ్య‌వ‌ధిని అందిస్తాయి. ఖాతాలో ఎటువంటి నిల్వ‌లు లేకుండానే స్టేట్‌మెంటు పిరియ‌డ్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. వ‌డ్డీ లేని రుణ కాలం స్టేట్‌మెంటులో ఇచ్చిన తేదీ నుంచి ఆరంభం అవుతుంది. క్రెడిట్ కార్డును ఉప‌యోగించి కొనుగోలు చేసిన రోజు నుంచి వ‌డ్డీలేని రుణ కాలం లెక్కించరు. మీరు ఏప్రిల్ 12 తేదీన కొనుగోళ్లు చేస్తే జూన్ 6 వ‌ర‌కు అనగా 55 రోజుల వ‌డ్డీ లేని రుణ కాలం ల‌భిస్తుంది. ఒక‌వేళ మీరు మే 1న కొనుగోలు చేస్తే 37 రోజుల వ‌డ్డీ లేని రుణ కాలం మాత్ర‌మే ఉంటుంది,

గడువు తేదీ:

ఇది చెల్లింపు గడువు తేదీని స్టేట్ మెంట్ పై భాగంలో చూపిస్తుంది. క్రెడిట్ కార్డు చెల్లింపుల చివ‌రి తేదీని సూచిస్తుంది. ఈ తేదీ త‌రువాత చేసిన చెల్లింపుకు ఆల‌స్య రుసుము విధిస్తారు.

కనీస మొత్తం:

ఏదైనా కారాణం వ‌ల్ల గ‌డువు తేదీ నాటికి క్రెడిట్ కార్డు పూర్తి చెల్లింపులు చేయ‌ని యెడ‌ల క్రెడిట్ కార్డు స్టేట్‌మెంటులో సూచించిన క‌నీస మొత్తాన్ని చెల్లించాలి. ఒక‌వేళ క‌నీస మొత్తం కంటే త‌క్కువ చెల్లించిన‌ట్ల‌యితే ఆల‌స్య‌పు రుసుముతో పాటుగా ఫైనాన్స్ ఛార్జీలు చెల్లించాలి.

ఫైనాన్స్ ఛార్జీలు:

మీ స్టేట్‌మెంటు ఫైనాన్స్ చార్జీల‌ను కూడా చూపిస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణలపై వడ్డీని నెలవారీ ప్రాతిపదికన వసూలు చేస్తారు. లావాదేవీ చేసిన తేదీ నుంచి తీసుకున్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించేంత వరకు వడ్డీ విధిస్తారు. వినియోగ‌దారుడు చెల్లించ‌ని ఔట్‌ స్టాండింగ్ మొత్తం, ముందుగా తీసుకున్న న‌గ‌దు మొత్తం పూర్తిగా చెల్లించే వ‌ర‌కు కూడా ఫైనాన్స్ చార్జీల‌ను విధిస్తారు.

రివార్డ్స్:

చివరగా, మీ స్టేట్‌మెంటు రివార్డ్ పాయింట్ల‌ను కూడా సూచిస్తుంది. ప్ర‌స్తుత నెల సంపాదించిన రివార్డు పాయింట్ల‌ను, గ‌త స్టేట్‌మెంట్ పాయింట్ల మొత్తం వివ‌రాలు, రెడీమ్ చేసిన పాయింట్ల వివ‌రాల‌ను ప్ర‌స్తుత స్టేట్‌మెంటులో ఇస్తారు.

మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంటును అర్ధం చేసుకోవ‌డం క‌ష్ట‌త‌రం కాదు. కానీ జాబితాలోని స‌మాచారాన్ని అర్ధంచేసుకుని త‌గిన విధంగా స్పందించ‌డం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ బిల్లును విశ్లేషించ‌డం మంచి అల‌వాటు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని