వీలునామా ఎలా రాయాలి? రాయకపోతే ఎలాంటి సమస్యలొస్తాయి?

భవిష్యత్తులో ఎలాంటి  వివాదాలకు తావివ్వకుండా విల్లును సబ్-రిజిస్టార్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాలి.  

Updated : 11 Nov 2021 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్‌ను మనం ఊహించలేం. ప్లాన్ మాత్రమే చేసుకోగలం. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. కరోనా మహమ్మారి చిన్న వయసులో ఉన్నవారిని సైతం ప్రమాదం అంచులకు తీసుకెళ్లింది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవడం అవసరం. కుటుంబ పెద్ద.. తన మరణానంతరం స్థిర, చరాస్తుల విషయంలో వారసుల నడుమ గొడవలు జరగకూడదని కోరుకుంటారు. ఇందుకు చక్కని పరిష్కారం.. వీలునామా. స్వార్జితాన్ని వారసులకు చెందేలా చట్టబద్ధత కల్పిస్తూ రాసే దస్త్రం. అయితే దీని గురించి చాలా మందికి అవగాహన ఉండదు. దీన్ని ఎప్పుడైనా రాయొచ్చు... ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. వీలునామా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వీలునామా ఎందుకు రాయాలి?
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే వారసత్వ చట్టాలు (హిందూ, షరియత్ చట్టాలు మొదలైనవి) అమల్లోకి వస్తాయి. వారసత్వ చట్ట ప్రకారం ఆస్తి పంపిణీ జరుగుతుంది. కోర్టు ద్వారా జరిగే పంపకాలు చనిపోయిన వ్యక్తి అభీష్టం మేరకు జరగకపోవచ్చు. అంతేకాకుండా వారసత్వపు సర్టిఫికెట్లు, కోర్టు, లాయర్‌ ఫీజులంటూ చాలా ఖర్చవుతుంది. ప్రాసెసింగ్ పూర్తయ్యి, ఆస్తి రావడానికి చాలా సమయం పడుతుంది. ఆస్తి పంపకాల విషయంలో సొంత కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామితో పాటు, పిల్లలకు ఎంత నిష్పత్తిలో వాటా ఇవ్వాలి? తల్లిదండ్రులకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలనుకుంటున్నారో స్పష్టమైన సూచనలతో వీలునామా రాయడం మంచిది. నామినీని ఏర్పాటు చేస్తే సరిపోతుంది అనుకోవద్దు. పైగా స్థిరాస్తులకు నామినీలను నియమించలేరు. కారణం.. నామినీ కేవలం ఆస్తి సంరక్షకుడు మాత్రమే.. చట్టబద్ధమైన వారసుడు కాకపోవచ్చు.

ఎలా రాయాలి?

చట్టపరంగా వీలునామాను సిద్ధంచేసేందుకు న్యాయవాదిని సంప్రదించొచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా వీలునామా సిద్ధం చేసుకునే సదుపాయం ఉంది. అనేక బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చట్టపరమైన సంస్థలతో టై-అప్ చేసుకుని ఆన్‌లైన్‌లో వీలునామా తయారు చేయడంలో సహాయపడుతున్నాయి. డిజిటల్ పద్ధతిలో వీలునామా సిద్ధం చేయించడం చాలా సులభం. ముందుగా మీరు ఏ సంస్థ సేవలను ఎంచుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత మీ పేరు, ఇతర వివరాలతో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్‌లో ఏదో ఒక విధానాన్ని ఉపయోగించుకుని నిర్ణీత మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన మరిన్ని వివరాలను అడుగుతారు. ఇందులో మీ వయసు,  నివాస చిరునామా, భారతదేశంలో నివసిస్తున్నారా? లేదా విదేశాల్లో  నివసిస్తున్నారా?, మీ వృత్తి తదితర వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, మీకున్న ఆస్తుల వివరాలు తెలియజేయాలి. తర్వాత వాటిని ఏవిధంగా పంచాలనుకుంటున్నారు.. వంటి సమాచారాన్ని పూరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారమంతా సేకరించిన తర్వాత మీకు సేవలందించే సంస్థ వీలునామా కాపీని తయారుచేసి పంపిస్తుంది. ఈ డ్రాఫ్ట్‌ను పూర్తిగా చదివి నిర్ధారణ చేస్తే ఫైనల్ కాపీని మెయిల్ చేస్తారు. ఈ వీలునామాను రిజిస్టర్ చేయించుకోవడం మంచిది. ఇందుకోసం ఎగ్జిక్యూటర్‌ను కూడా సంస్థలు నియమిస్తాయి.

ఏం ఉండొచ్చు..? ఏం ఉండకూడదు..?

సొంతంగా సంపాదించుకున్న స్థిర, చరాస్తులకు సంబంధించి ఏవైనా వీలునామాలో ప్రస్తావించవచ్చు. ఏదైనా ఆస్తి నేరుగా తండ్రి, తాత, ముత్తాతల నుంచి సంక్రమిస్తే దాన్ని సొంతంగా సంపాదించిన దాంతో సమానంగా చూస్తారు. కాబట్టి దీనిని వీలునామాలో జతచేయొచ్చు. అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తులు, వీలునామాలో చేర్చే ముందు జాగ్రత్త వహించాలి. వాటిపై మీకు చట్టబద్ధమైన స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే చేర్చాలి. ఉదాహరణకు: హిందూ అవిభాజ్య కుటుంబంలోని వాటాను వీలునామాలో ప్రస్తావించకూడదు.

వివాదాలు రాకుండా..

భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా వీలునామాను సబ్-రిజిస్టార్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇందుకోసం ఇద్దరు సాక్షులు, రిజిస్ట్రేషన్ సమయంలో మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించే వైద్యుడి సర్టిఫికెట్‌ ఉండాలి. వీలునామాపై సంతకం చేసే సమయంలో వీడియో రికార్డింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు ఏర్పడితే ఒరిజినల్ వీలునామాతో పాటు, వీలునామా రాసిన వారు సంతకం చేసినట్లు సాక్ష్యం ఉంటుంది. ఒకవేళ కుటుంబలోని ఒకరిద్దరు సభ్యులకు ఆస్తిలో వాటా ఇవ్వకపోయినప్పటికీ, వారి పేర్లను వీలునామాలో తప్పనిసరిగా పేర్కొనాలి. అంతేకాకుండా వారి పేర్లపై ఎలాంటి ఆస్తిని రాయడం లేదని స్పష్టంగా చెప్పాలి. ఇందుకోసం ఒక కార్యనిర్వహణ అధికారిని నియమించడం మంచిది.

రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పన్నులు..
రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానప్పటికీ.. వీలునామా రిజిస్టర్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. దాదాపు రూ.1,000 వరకు ఉండచ్చు. మీరు వీలునామా ద్వారా ఆస్తిని వారసత్వంగా పొందినట్లయితే, దానిపై పన్ను ఉండదు. ఒకవేళ మీ కుమారుడు వీలునామా ద్వారా ఆస్తిని స్వీకరించినట్లయితే (రిజిస్టర్ అయినా లేదా కాకపోయినా) అప్పుడు కూడా అతడిపై పన్ను భారం ఉండదు. అలాగే, చట్టబద్ధమైన వారసుడు కాకుండా వేరే వ్యక్తికి వీలునామా ద్వారా ఆస్తి లభించినప్పుడు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

గమనిక: వీలునామా లాంటి న్యాయపరమైన విషయాల్లో సందేహాలు ఉంటే నిపుణుల్ని సంప్రదించడం మంచిది. ఆ తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని