Free credit report: ఫ్రీగా క్రెడిట్‌ రిపోర్ట్‌ కావాలా..? గడువు దగ్గర పడుతోంది!

భవిష్యత్‌లో మనం రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. అంటే ప్రస్తుతం మన స్కోరు తెలిస్తే భవిష్యత్‌లో రుణం తీసుకునే నాటికి క్రెడిట్‌ స్కోరును మెరుగు పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఫ్రీగా క్రెడిట్‌ రిపోర్ట్‌ (Free credit report) తెలుసుకోవడం ఎలా?

Published : 25 Dec 2021 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనకు ఏదైనా బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేస్తే ఆ బ్యాంక్‌ చూసేది మన క్రెడిట్‌ స్కోర్‌నే (Credit score). స్కోరు బాగుంటే తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఆఫర్‌ చేస్తాయి. అదే స్కోరు తక్కువగా ఉంటే రుణం ఇచ్చేందుకు వెనుకాడతాయి. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ మొత్తంలో వడ్డీ (Intrest) చెల్లించాల్సి రావొచ్చు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాల విషయంలో క్రెడిట్‌ స్కోరు (Credit score) అంత కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, భవిష్యత్‌లో మనం రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. అంటే ప్రస్తుతం మన స్కోరు తెలిస్తే భవిష్యత్‌లో రుణం తీసుకునే నాటికి క్రెడిట్‌ స్కోరును మెరుగు పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఫ్రీగా క్రెడిట్‌ రిపోర్ట్‌ (Free credit report) తెలుసుకోవడం ఎలా?

క్రెడిట్‌ స్కోరు లేదా క్రెడిట్‌ రిపోర్టును తెలుసుకోవాలంటే ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, క్రిఫ్‌ హై మార్క్‌ వంటి క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ అందించే అందించే కంపెనీలు ఉన్నాయి. క్రెడిట్‌ స్కోరు తెలుసుకోవాలనుకునే వారికి ఏడాదికోసారి ఉచితంగా రిపోర్ట్‌ అందించాలని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. పలు ఫిన్‌టెక్‌ కంపెనీలు (పేటీఎం, అమెజాన్‌ పే, క్రెడ్‌, etc..) ఆయా కంపెనీలతో టై-అప్‌ అయ్యి ఉచితంగా క్రెడిట్‌ స్కోరును అందజేస్తున్నాయి. ఆ లెక్కన జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య మీరు క్రెడిట్‌ రిపోర్టును ఉచితంగా పొందే వీలుంటుంది. ఒకవేళ మీరు ఈ ఏడాది ఒక్కసారి కూడా క్రెడిట్‌ రిపోర్ట్‌ తీసుకోకుండా ఉంటే.. డిసెంబర్‌ 31లోగా మీ రిపోర్ట్‌ను ఉచితంగా పొందండి. రిపోర్ట్‌ను పొందేందుకు మీ పుట్టిన తేదీ, చిరునామా, పాన్‌/ ఆధార్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్‌లో 300 నుంచి 900 మధ్య మీ క్రెడిట్‌  స్కోరు ఎంతుందనేది తెలుస్తుంది. అలాగే, మీ పేరు మీద ఇదివరకే ఉన్న రుణాలు, ఈఎంఐల వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ రిపోర్ట్‌లో తప్పులు కనిపించినా సదరు క్రెడిట్‌ బ్యూరోను గానీ, రుణ విక్రేతను గానీ మీరు సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందనిపిస్తే ఇప్పటి నుంచే పెంచుకునే మార్గాలను అనుసరించండి.

క్రెడిట్‌ స్కోరు పెంచుకోవాలంటే..?

* మీ ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపుల తీరును క్రెడిట్‌ బ్యూరోలు నిత్యం పరిశీలిస్తూ ఉంటాయి. ఇందులో ఆలస్యం జరిగితే వెంటనే ఆ వివరాలను నమోదు చేస్తుంటాయి. తరచూ ఆలస్యం జరుగుతుంటే స్కోరు దెబ్బతింటుంది. కాబట్టి, వీలైనంత వరకూ బిల్లులను సకాలంలో చెల్లించేందుకు ప్రయత్నించాలి.

* క్రెడిట్‌ కార్డులను ఎక్కువగా వాడుతుంటే ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికంగా క్రెడిట్‌ కార్డులు వాడితే స్కోరు మీద దాని ప్రభావం ఉంటుంది.

* అవసరం ఉన్నా లేకున్నా పదే పదే రుణాలు, క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేయడం ఎప్పుడూ పొరపాటే. దీనివల్ల అప్పుల కోసం అధికంగా ప్రయత్నిస్తున్నారనే భావన వస్తుంది. ఇదీ మీ క్రెడిట్‌ స్కోరును దెబ్బతీసే అంశమే. నిజంగా రుణం కావాలనుకున్నప్పుడు.. అదీ ఒకటి, రెండు సంస్థలనే సంప్రదించండి.

* క్రెడిట్‌ కార్డులను వినియోగించడంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. మొత్తం పరిమితిని ఉపయోగిస్తే క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గరిష్ఠ పరిమితిలో 30-40 శాతంలోపే వినియోగించాలి. ఒకవేళ నెలనెలా అధిక మొత్తంలో కార్డును ఉపయోగించాల్సి వస్తే.. అధిక రుణ పరిమితి ఉన్న క్రెడిట్‌ కార్డును తీసుకోండి.

* రెండు మూడు అప్పులు, క్రెడిట్‌ కార్డు బాకీలు ఉన్నప్పుడు వాటన్నింటినీ ఒకే చోటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకూ చిన్న మొత్తాలతో ఉన్న అప్పులను తీర్చే ప్రయత్నం చేయండి. ఇలా సాధ్యం కాకపోతే.. ఈ అప్పులన్నీ తీర్చేందుకు ఒక పెద్ద రుణం తీసుకోవడం మంచిది. దీనివల్ల అధిక వడ్డీ ఉన్న రుణాల నుంచి మీకు విముక్తి దొరుకుతుంది. అప్పుల సంఖ్య పెరిగితే మీ క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది.

* ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉండాలి. అదే విధంగా అప్పులూ అందుకు అనుగుణంగానే ఉండాలి. విలువ పెరిగే ఆస్తుల కొనుగోలుకు చేసే అప్పుతో ముప్పు ఉండదు. కానీ, అనవసర ఆర్భాటాల కోసం చేసే వ్యక్తిగత రుణాల్లాంటివి సరికాదు. మీ మొత్తం ఆదాయంలో ఈఎంఐలకు చెల్లించే మొత్తం 40శాతం మించి ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మీ క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని