హైదరాబాద్‌, ముంబయి, దిల్లీలే వృద్ధిలో కీలకం: ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌

తమ తదుపరి దశ వృద్ధిలో హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ విపణులే కీలక పాత్ర పోషిస్తాయని ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ అంచనా వేసింది. రానున్న సంవత్సరాల్లో ఈ విపణుల్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నామని పేర్కొంది.

Published : 07 Sep 2021 02:03 IST

దిల్లీ: తమ తదుపరి దశ వృద్ధిలో హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ విపణులే కీలక పాత్ర పోషిస్తాయని ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ అంచనా వేసింది. రానున్న సంవత్సరాల్లో ఈ విపణుల్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నామని పేర్కొంది. ఈ సంస్థకు బెంగళూరే ప్రధాన విపణిగా ఉన్నా, అధిక వృద్ధి అవకాశాలున్న ఈ విపణుల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. మధ్యకాలానికి నివాస విభాగం నుంచి రూ.8000 కోట్లు,  వాణిజ్య విభాగం నుంచి రూ.2800 కోట్ల వార్షిక ఆదాయాన్ని అంచనా వేస్తోంది. 2020-21లో కంపెనీ అమ్మకాలు 20 శాతం పెరిగి రూ.5460 కోట్లుగా నమోదయ్యాయి.


 రష్యా వోస్టాక్‌ చమురు ప్రాజెక్ట్‌లో వాటాకు ఓఎన్‌జీసీ చర్చలు

దిల్లీ/మాస్కో: రష్యాలోని వోస్టాక్‌ చమురు ప్రాజెక్ట్‌తో పాటు ప్రతిపాదిత లిక్విఫైడ్‌ గ్యాస్‌ ప్రాజెక్ట్‌ ఆర్కిటిక్‌ ఎల్‌ఎన్‌జీ-2ల్లో వాటా పొందేందుకు ఓఎన్‌జీసీ విదేశీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌ (ఓవీఎల్‌) సహా భారత అగ్రగామి ఇంధన కంపెనీలు పోటీపడుతున్నాయని చమురు మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. వోస్టాక్‌ చమురు ప్రాజెక్ట్‌లో మైనారిటీ వాటా కొనుగోలు చేయడానికి ఓవీఎల్‌ చర్చలు జరుపుతోంది. 6 బిలియన్‌ టన్నులకు పైగా (దాదాపు 44 బిలియన్‌ బ్యారెళ్ల) ప్రీమియం ముడిచమురు ఆ ప్రాజెక్టులో ఉంది. నోవాటెక్‌ నుంచి 9.9 శాతం వాటా కొనుగోలుకు పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ చూస్తోంది. రష్యాలోని వ్లాదివోస్టాక్‌లో జరిగిన ఈస్ట్రన్‌ ఎకనామిక్‌ ఫోరంకు పురి హాజరయ్యారు. వోస్టాక్‌ ఆయిల్‌, ఎల్‌ఎన్‌జీ-2ల్లో కొత్త పెట్టుబడులకు చర్చలు జరిగాయని పురి తెలిపారు. భారత చమురు- గ్యాస్‌ కంపెనీలతో కొత్త ప్రాజెక్టుల అభివృద్ధికి రాస్‌నెఫ్ట్‌, గాజ్‌ప్రోమ్‌ నెఫ్ట్‌, నోవాటెక్‌లతో పాటు అన్ని ప్రధాన కంపెనీలు ఆసక్తి కనబరిచాయని రష్యా ఇంధన మంత్రి నికోలాయ్‌ షల్‌గినోవ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని