Published : 26 Dec 2020 17:28 IST

వాట్సాప్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఎలా?

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ సరికొత్త సేవలను తమ ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాట్సాప్‌ ద్వారానే బిల్లులు చెల్లించేలా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకునేలా వీలు కల్పించింది. బ్యాంకింగ్ రంగంలో వాట్సాప్‌ ద్వారా ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఐసీఐసీఐ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలను ఇది వరకే అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారుల నుంచి మంచి స్పందన రావడంతో తాజాగా మరికొన్ని జత చేసింది. అవేంటో తెలుసుకుందామా?

తాజాగా అందుబాటులోకి వచ్చిన సేవలతో రిటైల్‌ వినియోగదారులు వాట్సాప్‌ ద్వారానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలను తెరుచుకోవచ్చు. అంతేకాకుండా కరెంటు బిల్లు, గ్యాస్‌, మొబైల్‌ బిల్లులను చిన్న క్లిక్‌తో చెల్లించవచ్చు. త్వరలో మొబైల్‌ ప్రీపెయిడ్‌ బిల్లులు చెల్లించే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. గతంలో ఐసీఐసీఐ అందుబాటులోకి తెచ్చిన సేవల ప్రకారం కేవలం ఖాతాదారుడు అకౌంట్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం, క్రెడిట్ కార్డు లిమిట్‌, ప్రీ అప్రూడ్‌ లోన్‌ వివరాలు, క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డులను బ్లాక్/అన్ బ్లాక్‌ చేయడం తదితర సేవలు పొందే వీలుంది. తాజా సేవలతో కలిపి ఐసీఐసీఐ వాట్సాప్‌ ద్వారా 25 రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.

అనతి కాలంలోనే విశేష ఆదరణ

గత ఏప్రిల్‌ 4న తొలిసారిగా ఐసీఐసీఐ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆదరణ విశేషంగా పెరిగింది. ఆరు నెలల వ్యవధిలోనే 20 లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ డిజిటల్‌ ఛానల్స్‌ అత్యున్నత అధికారి బిజిత్‌ భాస్కర్‌ చెబుతున్నారు.  రిటైల్‌, ఎన్‌ఆర్‌ఐ, కార్పోరేట్‌, ఎంఎస్‌ఎమ్‌ఈ వినియోగదారులకు కూడా ప్రస్తుతం వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

ఈ సేవల వినియోగం ఎలా?

వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు పూర్తి రక్షణ కల్పించేలా ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం ఉంది. ఈ సేవలను వినియోగించుకునేందు తొలుత ఐసీఐసీఐ వాట్సాప్‌ నంబర్‌ 8640086400ను వినియోగదారులు మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి. అంతేకాకుండా కస్టమర్‌ వాట్సాప్‌ నంబర్‌ బ్యాంకు అకౌంట్‌తో జత చేసి ఉండాలి. ఖాతాదారుడు HI అని మెసేజ్‌ చేస్తే అందుబాటులో ఉన్న బ్యాంకు సేవల వివరాలన్నీ వస్తాయి. అందులో మీకు కావాల్సిన సేవలకు సంబంధించిన కీవర్డ్‌ను టైప్‌ చేస్తే సదరు సేవలకు సంబంధించిన సమాచారం వస్తుంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్

తాజాగా అందుబాటులోకి వచ్చిన సేవల ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా తెరవాలనుకోండి. అక్కడ Create A Fixed Deposit అని టైప్‌ చేయాలి. ఆ తర్వాత రూ.10,000 నుంచి రూ.1 కోటి లోపు ఎంత మొత్తం డిపాజిట్‌ చేయదలచుకున్నారో ఎంచుకోవాలి. వాటిపై వివిధ కాల పరిమితులకు ఎంత వడ్డీ రేటు ఇస్తారో మీకు మెసేజ్‌ వస్తుంది. మీకు ఆమోదయోగ్యమైతే ముందుకు వెళ్లవచ్చు.

బిల్లుల చెల్లింపు

వాట్సాప్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు చేపట్టేటప్పుడు సంబంధిత బిల్లు నెంబర్‌ను పొందుపర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు విద్యుత్‌ బిల్లులు చెల్లించాలనుకుంటే ఎలక్ట్రిసిటీ బోర్డు, వినియోగదారుడి కనెక్షన్‌ నెంబర్‌ పేర్కొనాలి. అదే పోస్టుపెయిడ్‌ మొబైల్‌ బిల్లు చెల్లిస్తున్నట్లయితే ఫోన్‌ నెంబర్‌, నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ పేరును కన్ఫర్మ్‌ చేయాలి. అలాగే గ్యాస్‌ బిల్లు చెల్లించడానికి గ్యాస్‌ ప్రొవైడర్‌, కస్టమర్‌ ఐడీ టైప్‌ చేయాలి. అంతేకాకుండా క్రెడిట్‌ లిమిట్‌ తెలుకునేందుకు, కార్డు వ్యాలిడిటీ తెలుసుకునేందుకు సంబంధిత కీవర్డ్స్‌ను టైప్‌ చేయాల్సి ఉంటుంది.

అకౌంట్‌ లేకపోయినా సేవలు పొందొచ్చా?

ఐసీఐసీఐతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొన్ని సేవలను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. మీ దగ్గర్లో ఎక్కడైనా ఐసీఐసీఐ శాఖగానీ, ఏటీఎం కానీ ఉందా? లేదా? అన్నది తెలుసుకునే వీలుంది. దీని కోసం ఐసీఐసీఐ కస్టమర్లు కావాల్సిన అవసరం లేదు. కేవలం ఇంగ్లీషులో మాత్రమే కాకుండా హిందీలోనూ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవచ్చు. దీనికోసం వినియోగదారులు తమ మొబైల్‌లో 9324953010 నంబర్‌ సేవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

(గమనిక: ఐసీఐసీఐ బ్యాంకు అందించే ఈ సేవలు కేవలం మీకు అవగాహన కోసమే. పూర్తి వివరాలు, నిబంధనలు, షరతులు తెలుసుకునేందుకు దగ్గరిలోని ఐసీఐసీఐ బ్యాంకు శాఖను కానీ, ఆ బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించండి)

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని