ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు ఐసీఐసీఐ లాంబార్డ్‌ బీమా

వినియోగదారులకు గ్రూప్‌ బీమా పాలసీ ‘గ్రూప్‌ సేఫ్‌గార్డ్‌’ను అందించేందుకు ఐసీఐసీఐ లాంబార్డ్‌తో ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Updated : 18 Feb 2021 07:37 IST

బెంగళూరు: వినియోగదారులకు గ్రూప్‌ బీమా పాలసీ ‘గ్రూప్‌ సేఫ్‌గార్డ్‌’ను అందించేందుకు ఐసీఐసీఐ లాంబార్డ్‌తో ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్రూప్‌ సేఫ్‌గార్డ్‌ పాలసీతో వినియోగదారులు ఆసుపత్రిలో చేరితే, రూ.500 నుంచి ఎక్కువ మొత్తాలను హాస్పిక్యాష్‌గా పొందే వీలుంది. నిర్ణయించిన రోజువారీ మొత్తంతో వినియోగదారులకు వైద్య, అత్యవసర వ్యయాలకు చెల్లింపులు చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ వెల్లడించాయి. ఈ బీమా పాలసీ చాలా అందుబాటు ధరలో తెచ్చామని, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరినా లేదా శస్త్రచికిత్స/ఇతర చికిత్సలకు ఉపయోగపడుతుందని వివరించాయి.


సన్నిహితులతో సరదాగా
2021లో తప్పనిసరిగా పర్యటిస్తామంటున్న 57 శాతం మంది

ముంబయి: కొవిడ్‌ పరిణామాలతో గతేడాది పర్యటనలకు దూరమైనవారు ఎందరో. ఈ ఏడాదిలో మాత్రం కుటుంబం, ఇతర సన్నిహితులను కలిసేందుకు వ్యక్తిగత పర్యటనలు చేస్తామనే 57 శాతం మంది వెల్లడించినట్లు మార్కెట్‌ పరిశోధనా సంస్థ యుగవ్‌ ఫర్‌ ఎయిర్‌బీఎన్‌బీ తెలిపింది. ఈనెల 2-10 తేదీల మధ్య 1040 మంది నుంచి ఆన్‌లైన్‌లో సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది.
* స్నేహితులు, కుటుంబసభ్యులతో విహార యాత్రలకు వెళ్తామని 50 శాతం యువత పేర్కొంది. 85 శాతం మంది ప్రత్యేక విడిది కేంద్రాల్లో బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చారిత్రక నివాసాలు, వ్యవసాయ క్షేత్రాలు, విల్లాల్లో సేదతీరాలని భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని స్నేహితుల సహకారంతో సరికొత్త పర్యాటక క్షేత్రాలను సందర్శించాలని అభిలషిస్తున్నారు. ఈ ఏడాదిలో తప్పనిసరిగా పర్యటనకు వెళ్తామని 39 శాతం శాతం యువత స్పష్టం చేశారు.
* ఆరోగ్య, సామాజిక భద్రతకు ప్రాధాన్యమిస్తామని 59 శాతం మంది పేర్కొన్నారు. సన్నిహితులతో నాణ్యమైన సమయం గడిపేందుకు ఈ పర్యటనలు దోహద పడతాయని అధికులు అభిప్రాయ పడుతున్నారు.





కనీస పబ్లిక్‌ ఆఫర్‌ నిబంధనల సడలింపు
* ఆమోదించిన సెబీ బోర్డు

దిల్లీ: సెక్యూరిటీల మార్కెట్‌లో సులభతర వ్యాపార నిర్వహణను మెరుగుపర్చడం కోసం సెబీ నిరంతరంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన సెబీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కనీస పబ్లిక్‌ ఆఫర్‌ నిబంధనల్ని సడలించడంతో పాటు పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు నిబంధనలు సవరించడం వంటి చర్యలకు దిగింది. దీంతో పాటు సెబీ (అండర్‌రైటర్స్‌) రెగ్యులేషన్స్‌ 1993, సెబీ (మర్చంట్‌ బ్యాంకర్స్‌) రెగ్యులేషన్స్‌ 1992 సవరణలు, సెబీ (స్టాక్‌ బ్రోకర్లు) రెగ్యులేషన్స్‌ 1992లను రద్దు చేసింది. సెబీ (స్టాక్‌ ఎక్స్ఛేంజీలపై రెగ్యులేటరీ ఫీజు) రెగ్యులేషన్స్‌ 2006, సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌ (రెగ్యులేషన్‌) (స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు) రెగ్యులేషన్స్‌ 2018లను విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది.
* పెద్ద పరిమాణంలో వచ్చే (లార్జ్‌ ఇష్యూయర్లు) పబ్లిక్‌ ఆఫర్‌లకు కనీస నిబంధనలు సవరించింది. గతంలో రూ.4,000 కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ (ఇష్యూ తరవాత) ఉన్న ఇష్యూయర్లు కనీసం 10 శాతం పబ్లిక్‌కు ఆఫర్‌ చేయాల్సి ఉండేది. అలాంటి ఇష్యూయర్లు కనీస ప్రజా వాటాను లిస్టింగ్‌ అయిన మూడేళ్లలోపు 25 శాతానికి పెంచాల్సి ఉండేది. ఈ నిబంధనల్లోనే ప్రస్తుతం సెబీ మార్పులు చేసింది.
* రూ.1 లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్‌ క్యాపిటల్‌తో (ఇష్యూ తరవాత) వచ్చే ఇష్యూయర్లకు కనీస పబ్లిక్‌ ఆఫర్‌ను తగ్గించింది. ఇలాంటి ఇష్యూయర్లు రెండేళ్లలోపు 10 శాతం వాటాను, 5 ఏళ్లలోపు 25 శాతం వాటాను ప్రజలకు ఆఫర్‌కు చేయాల్సి ఉంటుంది.
* పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, పెట్టుబడుల సలహాదార్లు, రీసెర్చ్‌ అనలిస్టులకు నిబంధనల్ని సవరిస్తూ సెబీ ఆమోదం తెలిపింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ (ఎన్‌ఐఎస్‌ఎమ్‌), అందిస్తున్న ఏడాది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ను వారికి అర్హతగా నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని