Syndicate bank: వ‌చ్చే నెల నుంచి ఇవి చెల్లవ్‌

సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు, చెక్‌బుక్‌లు వ‌చ్చే నెల నుంచి చెల్లుబాటు కావని కెన‌రా బ్యాంక్ పేర్కొంది. సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను జూన్ 30లోగా అప్‌డేట్ చేసుకోవాల్స......

Updated : 28 Jun 2021 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు, చెక్‌బుక్‌లు వ‌చ్చే నెల నుంచి చెల్లుబాటు కావని కెన‌రా బ్యాంక్ పేర్కొంది. సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను జూన్ 30లోగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెఫ్ట్‌/ఆర్టీజీఎస్‌/ఐఎంపీఎస్‌ మార్గాల ద్వారా నగదు లావాదేవీలకు ఇకపై కెనరా బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా సిండికేట్‌ బ్యాంక్‌.. కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. దీంతో కెనరా బ్యాంక్‌ నాలుగో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది.

పాత ఎమ్ఐసీఆర్‌, ఐఎఫ్ఎస్‌సీలతో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ ఇ-సిండికేట్ బ్యాంక్ చెక్ బుక్‌లు కూడా జూన్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అందువ‌ల్ల థ‌ర్డ్ పార్టీకి జారీ చేసిన ఇ-సిండికేట్ చెక్‌బుక్ లేదా చెక్‌లు జూన్‌ 30 తర్వాత చెల్ల‌వు. కాబ‌ట్టి వాటి స్థానంలో కొత్త వాటిని జారీ చేయాల‌ని కెన‌రా బ్యాంక్ వినియోగ‌దారులను కోరింది. 

కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు..
కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు ‘సీఎన్ఆర్‌బి’తో ప్రారంభ‌వుతాయి. ‘ఎస్‌వైఎన్‌బీ’తో ప్రారంభ‌మ‌య్యే కోడ్‌లు ఇక‌పై ప‌నిచేయ‌వు. పాత కోడ్ స్థానంలో వ‌చ్చిన మీ బ్యాంక్ బ్రాంచ్‌ కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివ‌రాల‌ను కెన‌రా బ్యాంక్ అందుబాటులో తీసుకొచ్చిన లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా తెలుసుకోవ‌చ్చు. ‘ఎస్‌వైఎన్‌బీ’తో ప్రారంభ‌మ‌య్యే మీ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంట‌ర్ చేసి క్లిక్ హియ‌ర్ టు గెట్ న్యూ ఐఎఫ్ఎస్‌సీపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ బ్రాంచ్‌కి సంబంధించిన కొత్త కోడ్ అక్క‌డ చూపిస్తుంది. ఏదైనా కెన‌రా బ్యాంక్ బ్రాంచ్‌ను సంద‌ర్శించ‌డం ద్వారా కూడా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. లేదా కెన‌రా బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ కేర్ నంబర్‌ 1800 425 0018ను సంప్ర‌దించి కూడా వివ‌రాలు పొందొచ్చు.

స్విఫ్ట్‌ కోడ్..

సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు విదేశీ మారక లావాదేవీల కోసం ఉపయోగిస్తున్న ప్రస్తుత స్విఫ్ట్ (SWIFT) కోడ్‌ను నిలిపివేస్తున్నట్లు కెనరా బ్యాంక్ ప్రకటించింది. విదేశీ మారక లావాదేవీల కోసం స్విఫ్ట్‌ సందేశాలను పంపడం లేదా స్వీకరించడం కోసం గ‌తంలో ఉప‌యోగించిన‌ సిండికేట్ బ్యాంక్ (SYNBINBBXXX) స్విఫ్ట్ కోడ్ జులై 1, 2021 నుంచి నిలిచిపోనుంది. విదేశీ ఎక్స్‌ఛేంజ్ అవ‌స‌రాల కోసం ఆ స్థానంలో (CNRBINBBFD) ను ఉపయోగించొచ్చు. 

ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అంటే..?

ఐఎఫ్ఎస్‌సీ (ది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) అనేది ఒక ప్రత్యేకమైన 11 అంకెల ఆల్ఫాన్యూమరిక్ (ఆంగ్ల అక్ష‌రాలు అంకెల‌తో మిళిత‌మైన‌) కోడ్. ఇది నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎమ్‌పీఎస్ ద్వారా జరిగే ఆన్‌లైన్ ఫండ్ బదిలీ లావాదేవీలకు ఉపయోగిస్తారు.

కోడ్‌లు ఎందుకు మారుతున్నాయి?
మెగా విలీన ప్ర‌క్రియ‌లో భాగంగా 10 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్న‌ట్లు 2019లో కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క్రియ ఇప్ప‌టికే పూర్తయ్యింది. అయితే ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఐఎఫ్ఎస్‌సీ, ఎమ్ఐసీఆర్ కోడ్‌లను కూడా బ్యాంకులు అప్‌డేట్ చేయ‌డం ప్రారంభించాయి. దీనిలో భాగంగా ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేష‌న్ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారుతున్నాయ‌ని, కొత్త కోడ్‌ల‌ను అప్‌డేట్ చేసుకోవాల‌ని యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. విలీనం అయిన మిగిలిన బ్యాంకుల కోడ్‌లు కూడా త్వరలోనే మారుతాయి. అయితే బ్యాంకులు ప్ర‌క‌టించేవ‌ర‌కు పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌నే వినియోగ‌దారులు ఉప‌యోగించుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని