‘కొవాగ్జిన్‌’ టీకా తయారీకి సిద్ధమవుతున్న ఐఐఎల్‌

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ‘కొవాగ్జిన్‌’ టీకా మందును తన యూనిట్లో తయారు చేసి అందించడానికి హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) సన్నద్ధమవుతోంది. ఇందుకోసం హైదరాబాద్‌ కరకపట్లలోని ఐఐఎల్‌ వ్యాక్సిన్‌ ప్లాంటును సిద్ధం చేస్తున్నారు.

Updated : 01 May 2021 08:31 IST

నెలన్నర వ్యవధిలో కరకపట్ల యూనిట్‌ నుంచి సరఫరా

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ‘కొవాగ్జిన్‌’ టీకా మందును తన యూనిట్లో తయారు చేసి అందించడానికి హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) సన్నద్ధమవుతోంది. ఇందుకోసం హైదరాబాద్‌ కరకపట్లలోని ఐఐఎల్‌ వ్యాక్సిన్‌ ప్లాంటును సిద్ధం చేస్తున్నారు. ఈ ప్లాంటులో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టారని, ఈ కసరత్తు అంతా నెలన్నర వ్యవధిలో పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే కొవాగ్జిన్‌ టీకా మందు తయారీ మొదలవుతుందని తెలుస్తోంది. హైదరాబాద్‌ శివారులో ఉన్న ఈ ప్లాంటులో ప్రస్తుతం రేబిస్‌ టీకా తయారవుతోంది. కొవిడ్‌ కొత్త కేసులు రోజూ 3 లక్షలకు పైగా నమోదవుతున్నందున, ‘కొవాగ్జిన్‌’ టీకా అవసరాలు బాగా పెరిగాయి. ఈ టీకా తయారీ పెంచేందుకు సహకరించడానికి ఐఐఎల్‌ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ‘కొవాగ్జిన్‌’ టీకా మందును భారత్‌ బయోటెక్‌ ప్రమాణాల ప్రకారం ఐఐఎల్‌ తయారు చేసి, ఆ మందును తిరిగి భారత్‌ బయోటెక్‌కు ఇస్తుంది. ఆ మందుతో భారత్‌ బయోటెక్‌ టీకా తయారీని పూర్తి చేసి (ఫిల్‌ అండ్‌ ఫినిష్‌ ప్రక్రియ),  ఆసుపత్రులకు సరఫరా చేస్తుంది. కొవాగ్జిన్‌ టీకా తయారీకి అత్యంత భద్రమైన బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలు గల యూనిట్‌ అవసరం. ఐఐఎల్‌ కూడా టీకాల తయారీలో నిమగ్నమై ఉన్నందున, తమ యూనిట్‌ను త్వరితంగా సిద్ధం చేయగలుగుతోందని తెలుస్తోంది. ఏటా 70 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారు చేయాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తున్న విషయం విదితమే. ఇందుకు తగ్గట్లుగా హైదరాబాద్‌, బెంగళూరుల్లోని తన యూనిట్లను సిద్ధం చేస్తోంది. దీనికి తోడు ఐఐఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరికొన్ని సంస్థలతోనూ ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయి. అయినప్పటికీ టీకా మందు తయారీకి ఐఐఎల్‌ ముందుగా సన్నద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని