Updated : 29 Oct 2021 17:17 IST

IRCTC: ప్రభుత్వ నిర్ణయంతో పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేరు

ముంబయి: ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఐఆర్‌సీటీసీ షేర్లు శుక్రవారం భారీ స్థాయిలో పతనమయ్యాయి. దీంతో వ్యాపార వర్గాలు, మార్కెట్‌ నిపుణులు సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత్యంతరం లేక వెనక్కి తగ్గిన సర్కార్‌.. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుంది. దీంతో షేర్లు మళ్లీ  పుంజుకున్నాయి.

రైల్వేలో క్యాటరింగ్‌, టికెట్‌ బుకింగ్‌, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌.. వంటి సేవల్ని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. ఈ రంగంలో ఐఆర్‌సీటీసీదే గుత్తాధిపత్యం. టికెట్‌ బుకింగ్‌లో 73 శాతం, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌లో 45 శాతం వాటా ఈ సంస్థదే. దీంతో ఈ సంస్థలో వాటాలున్న సర్కార్‌.. టికెట్‌ బుకింగ్‌ ద్వారా వస్తోన్న కన్వీనియెన్స్‌ రుసుము ఆదాయంలో 50 శాతం తమకు ఇవ్వాలంటూ గురువారం ఐఆర్‌సీటీసీకి రైల్వేశాఖ లేఖ రాసింది.

కరోనాకి ముందు కన్వీనియెన్స్‌ ఫీజు ద్వారా ఐఆర్‌సీటీసీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.349.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక కరోనా విజృంభించిన 2020-21లోనూ రూ.299.13 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు కరోనా నేపథ్యంలో క్యాటరింగ్‌ సహా ఇతర సేవల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో 2020-21లో కన్వీనియెన్స్‌ ద్వారా వచ్చిన ఆదాయమే అత్యధికం. దీంతో ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ప్రధాన ఆదాయ వనరు నుంచి ప్రభుత్వం వాటా అడగడంతో మదుపర్లు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. అమ్మకాలకు దిగారు. దీంతో కంపెనీ షేర్లు ఓ దశలో 29 శాతం కుంగి 650 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేశాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై మార్కెట్‌ నిపుణులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మదుపర్లకు మంచి లాభాల్ని తెచ్చిపెడుతున్న కంపెనీలో సర్కార్‌ జోక్యం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. కంపెనీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని విశ్లేషించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన రైల్వేశాఖ.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో కంపెనీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠాలను ఏకంగా 39 శాతం ఎగబాకడం విశేషం. మధ్యాహ్నం 12:05 గంటల సమయంలో బీఎస్‌ఈలో ఐఆర్‌సీటీసీ ఒక్కో షేరు 5.39 శాతం నష్టంతో 864.70 వద్ద ట్రేడవుతోంది.

ఇటీవలి మార్కెట్‌ ర్యాలీలో భారీగా లాభపడ్డ ఐఆర్‌సీటీసీ.. బీఎస్‌ఈలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీల జాబితాలో చేరింది. ఆరు నెలల్లో ఏకంగా 239 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది. దీంతో సామాన్యులకు ధర అందుబాటులో లేకుండా పోవడంతో ఇటీవలే స్టాక్‌ స్ప్లిట్‌ చేశారు. పైగా షేరు విలువ అత్యధిక స్థాయికి చేరడంతో గత కొన్ని రోజులుగా ఈ స్టాక్‌ స్థిరీకరణ దిశగా సాగుతోంది.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని