IT Sector: ఐటీ బూమ్‌ రాబోతోంది!

కొవిడ్‌ మహమ్మారి నేర్పిన పాఠాలతో అంతర్జాతీయ కంపెనీలన్నీ డిజిటల్‌ బాట పట్టాయి. అందుకే రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలకు మంచి గిరాకీ ఉండబోతోంది. నిన్న మొన్నటి వరకు దేశంలో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్లను....

Published : 27 Jun 2021 16:42 IST

గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు 150-200 అంతర్జాతీయ సంస్థల ముందడుగు
వచ్చే మూడేళ్లలో 3 లక్షల మందికి ఉపాధి

కొవిడ్‌ మహమ్మారి నేర్పిన పాఠాలతో అంతర్జాతీయ కంపెనీలన్నీ డిజిటల్‌ బాట పట్టాయి. అందుకే రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలకు మంచి గిరాకీ ఉండబోతోంది. నిన్న మొన్నటి వరకు దేశంలో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్లను (జీసీసీలు) విక్రయించిన కంపెనీలు కూడా తాజాగా తమ కార్యకలాపాలను వేగంగా విస్తరించడానికి పావులు కదుపుతున్నాయి. గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ సెంటర్లను (జీఐసీ) ఏర్పాటు చేస్తున్నాయి.
టెక్నాలజీ హబ్‌లు వేగంగా వృద్ధి చెందుతుండటం దేశంలోని టెక్నాలజీ నిపుణులకు గొప్ప శుభవార్తే. వచ్చే మూడేళ్లలో 3 లక్షలకు పైగా టెక్నాలజీ ఉద్యోగాలను భారత్‌లో కల్పించేందుకు అంతర్జాతీయ కంపెనీలు సిద్ధమవుతున్నాయని అంచనా. ఇవి టెకీలకు అనేక ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా వేతనాలు భారీగా పెరిగేందుకు కూడా దోహదం చేస్తాయి. అయితే వీటి వల్ల ఐటీ సేవల కంపెనీలకు మాత్రం ఇబ్బందులు ఎదురు కావొచ్చనే అంచనాలున్నాయి. ఎక్కువ మంది క్లయింట్లు పొరుగు సేవల కంటే (అవుట్‌ సోర్సింగ్‌) ఇన్‌-సోర్స్‌కు మారుతుండటంతో ఆ కంపెనీల ఆదాయంపై ప్రభావం పడొచ్చు.

డిజిటల్‌ ప్రతిభ ఇక్కడే ఎక్కువ..

2019లో భారత్‌లో 7 లక్షల మంది నిపుణులు డిజిటల్‌ టెక్నాలజీల్లో నైపుణ్యం సాధించారు. తరవాత ఏటా 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వృద్ధి ఈ విభాగంలో నమోదవుతోంది. కంపెనీలు తమ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించడం కూడా ఇందుకు దోహదపడుతోంది. ఇంత పెద్ద స్థాయిలో మరే దేశంలోనూ డిజిటల్‌ ప్రతిభ లేదని కాగ్నిజెంట్‌ ఇండియా మాజీ ఛైర్మన్, క్రియా విశ్వవిద్యాలయం రామ్‌కుమార్‌ రామమూర్తి వెల్లడించారు. 
దేశంలో గత దశాబ్ద కాలంలో ఎత్తుపల్లాలు చూసిన క్యాప్టివ్‌లు ఇప్పుడు విస్తరణ బాట పట్టాయి. తమ డిజిటల్‌ ఉత్పత్తులు, సొల్యూషన్లను భారత్‌లో అభివృద్ధి చేసుకునేందుకు 30,000-40,000 మంది ఉద్యోగుల్ని నియమించుకునేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌ ఐటీ ఎగుమతుల ఆదాయంలో 25 శాతానికి పైగా తమ వాటా ఉండేలా గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నాయి.

పెద్ద బ్యాంకులు సైతం..

అంతర్జాతీయ బ్యాంకులు జేపీ మోర్గాన్, సిటీ, హెచ్‌ఎస్‌బీసీ, ఆర్‌బీఎస్, ఎస్‌అండ్‌పీలకు గత కొన్నేళ్లుగా భారత్‌లో కేంద్రాలున్నా.. ఇప్పుడు వేల సంఖ్యలో నియామకాలు చేపట్టి విస్తరించాలనుకుంటున్నాయి. అలాగే దేశంలో వచ్చే 3 ఏళ్లలో కనీసం 150-200 కంపెనీలు జీసీసీలను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. తద్వారా అదనంగా 3,00,000-3,50,000 మేర ఉద్యోగావకాశాలు లభించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

థర్డ్‌-పార్టీ సర్వీస్‌ ప్రొవైడర్ల సేవలను వినియోగించుకోవడం మానేసి, అంతర్గత (ఇన్‌-హౌస్‌ సామర్థ్యాలను) పెంచుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో ఐటీ సేవలు అందిస్తున్న థర్డ్‌ పార్టీ కంపెనీలకు ఇబ్బందులు ఎదురైనా డిజిటల్, ఐటీ ప్రతిభ ఉన్న వారికి గిరాకీ బాగా పెరుగుతుందని, వారి వేతనాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2020లో జీసీసీల ఏర్పాటులో కంపెనీలు కొంచెం తడబడినా, ఈ ఏడాది మాత్రం కొత్తగా 40 జీసీసీలు వివిధ దశల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల దేశంలో టెక్నాలజీ హబ్‌లు ఏర్పాటు చేసిన కంపెనీల్లో జెయింట్‌ ఈగల్, హెచ్‌అండ్‌ఎం, ఐకియా, జీఎస్‌కే ఫార్మా, 7-ఎలెవన్, ఫియట్‌ క్రిస్లర్, లూలూలెమన్, కార్డినాల్‌ హెల్త్‌ ఉన్నాయి. యూఎస్, తూర్పు ఐరోపా, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యంలోని అనేక కంపెనీలు భారత్‌లో గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని