IT: 2022లో ఐటీ రంగం చేయబోయే ఖర్చు 101బిలియన్‌ డాలర్లు!

ప్రపంచమంతా డిజిటల్‌గా మారుతోన్న నేపథ్యంలో ఐటీ రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఐటీ సంస్థలు వారి సాంకేతికతను, పరికరాలను ఆధునీకరించడం తప్పనిసరైంది. పైగా కరోనా సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇచ్చాయి. అలాగే, కరోనా సవాళ్లను అధిగమించడం

Updated : 02 Dec 2021 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచమంతా డిజిటల్‌గా మారుతోన్న నేపథ్యంలో ఐటీ రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఐటీ సంస్థలు వారి సాంకేతికతను, పరికరాలను ఆధునీకరించడం తప్పనిసరైంది. పైగా కరోనా సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇచ్చాయి. అలాగే, కరోనా సవాళ్లను అధిగమించడం కోసం ఎప్పటికప్పుడు వినూత్న సాంకేతిక ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సైబర్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్‌ డివైజ్‌ల కోసం ఐటీ రంగం పెద్దమొత్తంలో వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో 2022లో భారత ఐటీ రంగం చేసే ఖర్చు 101 బిలియన్‌ డాలర్లు(రూ. 7.63లక్షల కోట్లు) ఉంటుందని గ్లోబల్‌ మార్కెట్‌ పరిశోధన సంస్థ గార్ట్‌నర్‌ అంచనా వేసింది. ఇది ఈ ఏడాది కంటే 7శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది.

సాఫ్ట్‌వేర్‌ కోసం భారత ఐటీ రంగం 2022లో 10.5 బిలియన్‌ డాలర్లు(రూ.78.6వేల కోట్లు) వెచ్చించనుందని, ఇది 2021 కంటే 14.4శాతం అధికంగా ఉంటుందని గార్ట్‌నర్‌ వెల్లడించింది. కరోనాకుముందు ఐటీ రంగం చేసిన ఖర్చు కంటే ఇది దాదాపు రెట్టింపు. ఇక కరోనా వల్ల ఉద్యోగం చేసే విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తుండగా.. మరికొందరు కార్యాలయానికి వెళ్తున్నారు. ఇంకొందరు రెండు విధాలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆన్‌లైన్‌ సంభాషణలు పెరిగాయి. వీటి కోసం ప్రత్యేకించి డివైజ్‌లు అవసరమవుతున్నాయి. దీంతో కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల కొనుగోలు, ఆధునీకరణ కోసం ఐటీ సంస్థలు 44 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు గార్ట్‌నర్‌ తెలిపింది.

‘ఈ ఏడాది కరోనా రెండో దశలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న దేశాల్లో భారత్‌ ఒకటి. అయినా.. అత్యంత వేగంగా భారత్‌ కోలుకుంది. ఐటీ రంగంలోనూ వృద్ధి సాధించింది. 2022లో ఐటీ రంగం చేయబోయే ఖర్చులో 43శాతం ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లపైనే ఉంటుంది’’అని గార్ట్‌నర్‌ పరిశోధన విభాగం ఉపాధ్యక్షుడు అరూప్‌ రాయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని