ప‌న్ను బాధ్య‌త లేన‌ప్ప‌టికీ ఐటీఆర్ దాఖ‌లు చేయాలి 

మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించిన సందర్భంలో ఐటిఆర్ దాఖలు చేయాలి

Updated : 07 Aug 2021 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఐటీఆర్ ఫైలింగ్ గ‌డువు సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. కానీ అప్ప‌టివ‌ర‌కు వేచిచూడ‌కుండా వీలైనంత త్వ‌ర‌గా ఐటీఆర్ దాఖ‌లు చేయాలి. ఇంతకీ ఎవ‌రు ఐటీఆర్ దాఖ‌లు చేయాలి? ఎవ‌రు చేయ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.. 
ఒక వ్య‌క్తి వేతనం, వృత్తి, అద్దె లేదా వ్యాపారం ఏ విధంగానైనా ప్రాథ‌మిక మిన‌హాయింపు ప‌రిమితికి మించిన ఆదాయం ఉంటే ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు (ఐటీఆర్‌) దాఖ‌లు చేయాలి. చాలామంది త‌మకు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి కాబ‌ట్టి ఐటీఆర్ దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటారు. కానీ ప‌న్ను చెల్లించ‌డం, ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం రెండు వేర్వేరు చ‌ట్ట‌ప‌ర‌మైన బాధ్య‌త‌లు. త‌మ ఆదాయం ప‌న్ను మిన‌హాయింపు కింద‌కి వ‌స్తుంది కాబ‌ట్టి ఐటీఆర్ దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అనుకోకూడ‌దు.

ఐటీఆర్ ఎవ‌రు దాఖ‌లు చేయాలంటే..

ఒక వ్యక్తి తన మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించిన సందర్భంలో ఐటీఆర్ దాఖలు చేయాలి. వయస్సు ఆధారంగా వివిధ ప్రాథమిక మినహాయింపు పరిమితులు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.2.50 లక్షలు మించి ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 60 నుంచి 80 ఏళ్ల వ‌ర‌కు వ‌య‌సు ఉన్న‌వారి ఆదాయం రూ.3 ల‌క్ష‌ల‌కు మించితే ప‌న్ను చెల్లించాలి. ఇక‌ 80 ఏళ్లు దాటిన వారికి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.
ఈ ప‌రిమితులు దాటిన‌ప్ప‌టికీ ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని చాప‌ర్ట్ VIAలోని సెక్షన్ 80C, 80 CCD, 80D, 80G 80TTA, 80 TTB కింద ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. అదేవిధంగా సెక్షన్ 54, 54F, 54EC కింద క్లెయిమ్ చేసుకున్న మిన‌హాయింపు రెసిడెన్షియల్ హౌస్‌లో రీఇన్వెస్ట్‌మెంట్ కోసం ఉప‌యోగించిన‌ప్పుడులు లేదా క్యాపిట‌ల్ గెయిన్ బాండ్ల‌లో పెట్టిన‌ప్పుడు పన్ను నుంచి మినహాయింపు ల‌భించిన‌ప్ప‌టికీ, ఐటీఆర్ ఫైలింగ్ కోసం పరిమితిని నిర్ణయించడానికి మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి జోడించాలి.

ఉదాహరణకు, కొన్ని సందర్భాల్లో మీ స్థూల మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఉండవచ్చు, కానీ వివిధ తగ్గింపుల కారణంగా, పన్ను విధించదగిన ఆదాయం రూ. 2.50 లక్షల కంటే తక్కువకు రావచ్చు. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండ‌దు. కానీ ఇక్క‌డ ఐటీఆర్ దాఖ‌లు చేయాలి. అదేవిధంగా, సెక్షన్ 87A కింద అందుబాటులో ఉన్న రిబేటు కారణంగా మీ నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఐదు లక్షలకు మించకపోతే మీకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేక‌పోయినా, ఐటీఆర్‌ని దాఖ‌లు చేయాల్సి రావచ్చు.

ఐటీఆర్ దాఖ‌లు చేయాల్సిన రెండు ఆదాయేతర ప్రమాణాలు:

దేశంలో నివ‌సిస్తున్న ప‌న్ను బాధ్య‌త ఉన్న‌  వ్యక్తులకు మాత్రమే ఈ షరతులు వర్తిస్తాయి. అయితే విదేశాల్లో ఏదైనా ఆస్తిపై లాభాల‌ను పొందుతుంటే విదేశాల్లో ఏదైనా ఖాతాకు సంబంధించి మీకు సంతకం చేసే అధికారం ఉంటే మీ ఆదాయంతో సంబంధం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. ఇది విదేశీ కంపెనీ షేర్లు, బాండ్లు, స్టాక్ ఆప్ష‌న్లు, స్థిరాస్తి వంటి ఏదైనా ఆస్తులు ఉంటే ఇది వ‌ర్తిస్తుంది. దీనికి ఖాతాలోని విలువ లేదా బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ప‌రిగ‌ణించ‌రు. ఉదాహరణకు, మీరు విదేశాల్లో ఉన్నప్పుడు ఖాతా తెరిచారనుకుందాం. దాన్ని మూసివేయకుండానే తిరిగి వచ్చారు. అప్పుడు కూడా ఐటీఆర్ దాఖ‌ల చేయాలి. అదేవిధంగా మీకు ఒక విదేశీ కంపెనీ లేదా అనుబంధ సంస్థ  స్టాక్ ఆప్ష‌న్ల‌ను కేటాయిస్తే కూడా ఇక్క‌డ ఐటీఆర్ దాఖ‌లు చేయాలి. విదేశాల నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన ఎన్ఆర్‌ఐలకు ఇది భారంగా మారింది.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఒకటి లేదా అంత‌కంటే ఎక్కువ‌ బ్యాంకు ఖాతాల్లో ఒకే ఏడాదిలో కోటి రూపాయ‌ల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఐటీఆర్ దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. ఇది న‌గ‌దు రూపంలోనే కాకుండా ఏ విధంగానైనా క‌రెంట్ ఖాతాల్లో జ‌మ చేసిన కోటి రూపాయ‌ల కంటే ఎక్కువ మొత్తానికి వ‌ర్తిస్తుంది. అదేవిధంగా మీరు విదేశీ ప్ర‌యాణాల కోసం వ్య‌క్తిగ‌తంగా లేదా ఇత‌రు కోసం రూ.2 ల‌క్ష‌లు చెల్లిస్తే ఐటీఆర్ దాఖ‌లు చేయాలి. అయితే ప‌క్క‌నే ఉన్న దేశాల‌కు లేదా ఆధ్యాత్మిక ప్ర‌యోజ‌నాల కోసం వెళ్తే ఇది ఉండ‌దు. ఏడాదిలో క‌రెంట్ బిల్లులు ల‌క్ష రూపాయ‌ల‌కు మించితే అప్పుడు కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలి. సొంత ఇల్లు లేదా అద్దెకు తీసుకున్న కార్యాల‌యం అయిన‌ప్ప‌టికీ మీరు వినియోగించిన మొత్తం బిల్లు ఈ పరిమితి దాటితే ఐటీఆర్ అవ‌స‌రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని