నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తే

భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగం తక్కువగానే ఉందని.. ఇటువంటి సమయంలో దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు...

Updated : 07 Apr 2021 09:56 IST

జీడీపీ 2% తగ్గుతుంది
బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ అంచనా

ముంబయి: భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగం తక్కువగానే ఉందని.. ఇటువంటి సమయంలో దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2 శాతం మేర తగ్గొచ్చని అమెరికా బ్రోకరేజీ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా(బీఓఎఫ్‌ఏ) సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ‘దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా లాక్‌డౌన్‌లు, రాత్రి కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఒక వేళ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అంటూ విధిస్తే అది వృద్ధి ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంద’ని  బీఓఎఫ్‌ఏ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘చాలా తక్కువ వేగంతో రికవరీ అవుతున్న ఆర్థిక వ్యవస్థపై, కరోనా కేసులు ప్రభావం చూపొచ్చని ఆందోళన చెందుతున్నాం. ఒక వేళ నెల రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధిస్తే వార్షిక జీడీపీలో 100-200 బేసిస్‌ పాయింట్ల మేర ప్రభావం పడొచ్చు. దీని వల్ల ద్రవ్య ఒత్తిళ్లు మరింత పెరుగుతాయని చెప్పనక్కర్లేద’ని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశం లాక్‌డౌన్‌ నీడలో ఉన్న కారణంగా జీడీపీ 7 శాతానికి పైగా క్షీణించిన సంగతి తెలిసిందే. గతేడాది క్షీణత దృష్ట్యా (తక్కువ ప్రాతిపదిక) 2021-22లో జీడీపీ వృద్ధి రెండంకెల మేర నమోదువుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కరోనా కేసుల వేగం మరింత పుంజుకుంటోందని ఆ బ్రోకరేజీ సంస్థ హెచ్చరిస్తోంది. ‘2020లో రోజువారీ 10,000 కేసులు జూన్‌ మధ్యకు కానీ నమోదు కాలేదు. సెప్టెంబరులో రోజుకు 90,000కి పైగా నమోదయ్యాయి. ఈ సారి కేవలం ఆరు వారాల వ్యవధిలోనే ఈ స్థాయికి చేరాయి. అయినా కూడా కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు భారీగా ఏమీ పెంచలేదు. కాబట్టి పరీక్షలు పెంచడం వల్ల కేసులు పెరిగాయనుకోవడం సరికాదు’ అని పేర్కొంది. కేంద్రం, రాష్ట్రాలు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తాయనే బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని