గ్యాస్‌ సరఫరా చేయలేకపోతే కొనుగోలుదార్లకు నగదు చెల్లిస్తాం

తూర్పుతీరంలోని కేజీ-డీ6 బ్లాక్‌లో కనుగొన్న కొత్త క్షేత్రాల నుంచి వెలికితీసే సహజవాయువును...

Published : 04 Jan 2021 01:01 IST

రిలయన్స్‌, బీపీ పీఎల్‌సీ నిర్ణయం

దిల్లీ: తూర్పుతీరంలోని కేజీ-డీ6 బ్లాక్‌లో కనుగొన్న కొత్త క్షేత్రాల నుంచి వెలికితీసే సహజవాయువును అనుకున్న స్థాయిలో వినియోగదారులకు అందించలేకపోతే, పరిహారంగా నగదు చెల్లింపులు చేస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటన్‌ భాగస్వామి సంస్థ బీపీ పీఎల్‌సీ ప్రకటించాయి. కేజీ-డీ6 బ్లాక్‌లోని ఆర్‌-క్లస్టర్‌ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ కోసం ధర నిర్ణయించే బిడ్‌లతో పాటు గ్యాస్‌ విక్రయాలు, కొనుగోలు ఒప్పందం (జీఎస్‌పీఏ) ముసాయిదాను రిలయన్స్‌, బీపీ విడుదల చేశాయి. దీని ప్రకారం.. కొనుగోలుదారు తీసుకున్న గ్యాస్‌ పరిమాణాన్ని డెలివరీ చేయలేకపోతే..  అందుకు సమానమైన నగదును వారికి చెల్లిస్తారు. కొనుగోలుదారు అంగీకరించిన గ్యాస్‌ మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోయినా రిలయన్స్‌, బీపీలకు నగదు చెల్లించాల్సి వస్తుంది. నగదు చెల్లించి గ్యాస్‌ తీసుకోకపోతే.. తదుపరి త్రైమాసికాల్లో దాన్ని పొందొచ్చు.

ఎంఎంటీసీలో వీఆర్‌ఎస్‌!
ఆర్థిక శాఖను సాయం కోరిన వాణిజ్య మంత్రిత్వ శాఖ

దిల్లీ: ప్రభుత్వ రంగ ట్రేడింగ్‌ సంస్థ ఎంఎంటీసీ (మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకానికి ఆర్థిక మద్దతు కావాలని ఆర్థిక శాఖను వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎంఎంటీసీకి నోడల్‌ మంత్రిత్వ శాఖగా వ్యవహరించే వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో వీఆర్‌ఎస్‌ పథకాన్ని ఎంచుకునే ఉద్యోగులకు డబ్బులు చెల్లించేందుకు సంస్థ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున, ఆర్థిక శాఖ సాయం కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదిస్తుందన్న నమ్మకంతో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉందని సదరు వర్గాలు తెలిపాయి. గత ఏడాది జులైలో ఎంఎంటీసీ బోర్డు తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని