Cyber Insurance: సైబర్‌ బీమా ప్రాధాన్యం పెరిగింది

‘కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో కార్పొరేట్‌ బీమా రంగం కీలకంగా మారింది. ముఖ్యంగా సైబర్‌ సెక్యూరిటీ,

Updated : 29 Aug 2021 10:45 IST

ఈనాడు ఇంటర్వ్యూ 
ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలోక్‌ అగర్వాల్‌
ఇంటి నుంచి పనిలో సమాచార రక్షణ కీలకం
‘బాధ్యత’ పాలసీలకూ గిరాకీ

ఈనాడు - హైదరాబాద్‌ ‘కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో కార్పొరేట్‌ బీమా రంగం కీలకంగా మారింది. ముఖ్యంగా సైబర్‌ సెక్యూరిటీ, బృంద ఆరోగ్య బీమా విభాగాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఇంటి నుంచి పని నుంచి ఆఫీసు నుంచి పనికి క్రమంగా మారుతున్న నేపథ్యంలో సంస్థలు అందుకు తగ్గట్టుగా సిద్ధం అవుతున్నాయి’ అని అంటున్నారు ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలోక్‌ అగర్వాల్‌. కార్పొరేట్‌ బీమా విభాగంలో వస్తున్న తాజా మార్పుల గురించి ఆయన ‘ఈనాడు’కు ఇచ్చినఇంటర్వ్యూలో వివరించారు.. ఆ విశేషాలు..

Q:‘కరోనా’ కొంత తగ్గుముఖం పట్టినందున మళ్లీ వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వివిధ సంస్థల ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ సంస్థలకు ఎటువంటి సవాళ్లు కనిపిస్తున్నాయి.
ఉద్యోగులకు సురక్షితమైన పని పరిస్థితులు కల్పించటం ఇప్పుడు ఎంతో అవసరం. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ పద్ధతిని ఎన్నో సంస్థలు తమకు అనువుగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘హైబ్రిడ్‌ మోడల్‌’ రూపుదిద్దుకుంది. కొంత పని ఇంటి నుంచి మరికొంత ఆఫీసుకు వచ్చి చేసే అవకాశం ఏర్పడింది. మా సంస్థలో మేం ఈ పద్ధతినే అనుసరిస్తున్నాం. ఒకవేళ ఆఫీసుకు వస్తానంటే, కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకొని ఉండాలని నిబంధన అమలు చేస్తున్నాం.

Q:‘కార్పొరేట్‌ ఇన్సూరెన్స్‌’ విభాగం ఎలా ఉంది. ఏమేరకు వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి

ఈ విభాగంలో కొత్త పాలసీలు ఎంతో అధికంగా విక్రయించగలుగుతున్నాం. ప్రీమియం వసూళ్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా యాజమాన్యాలు తమ ఉద్యోగులకు అందించే బృంద ఆరోగ్య బీమా విభాగం నుంచి వృద్ధి ఎక్కువగా ఉంది. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ సంస్థలు, రిటైల్‌ వినియోగదార్ల బాధ్యతకు సంబంధించిన రిస్క్‌ పాలసీలకు గిరాకీ కనిపిస్తోంది.

Q:రెండో దశ కరోనా ముప్పు తీవ్రత తగ్గినా మళ్లీ మూడో దశ ముప్పు రాబోతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్‌ సంస్థల అవసరాలు ఏవిధంగా మారుతున్నాయి? 

సురక్షితంగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించటానికి అవసరమైన సలహాలు, సూచనల కోసం కార్పొరేట్‌ సంస్థలు ఎదురు చూస్తున్నాయి. తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాలనేది ఆయా సంస్థలు ఆలోచన. అజాగ్రత్తగా ఉండే సమయం కాదిది..., అనే విషయాన్ని అన్ని సంస్థలు గుర్తించాలి. 

Q:డేటా ప్రొటెక్షన్‌ కవర్‌... వంటి అవసరాలకు ఎందుకు పెరుగుతున్నాయి

ఎన్నో కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇళ్ల నుంచే ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనివల్ల సైబర్‌ హ్యాకింగ్‌ పెరుగుతోంది. సులువుగా తమకు దొరికిపోయే వారిపై హ్యాకర్లు దాడి చేస్తున్నారు. గతంలో ఆఫీసుల్లో కంప్యూటర్‌ నెట్‌వర్క్, సిస్టమ్స్‌ అత్యంత భద్రంగా ఉండేది. కాబట్టి హ్యాకింగ్‌ రిస్క్‌ తక్కువ. కానీ ఇళ్లలోని కంప్యూటర్లు అంత భద్రమైనవి కాకపోవచ్చు. తగినంత భద్రత లేని వై-ఫై నెట్‌వర్క్‌ల నుంచి ఉద్యోగులు తమ ఆఫీసు సిస్టమ్స్‌లోకి లాగిన్‌ అవుతారు. దీనివల్ల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. ర్యాన్సమ్‌వేర్, ఫిషింగ్, స్పీయరింగ్, స్కిమ్మింగ్‌ వంటి పలు రకాలైన సైబర్‌ దాడులు పెరుగుతున్నాయి. అందువల్ల డేటా ప్రొటెక్షన్‌ కవర్‌ అవసరమవుతోంది. 

Q:‘కరోనా’ పర్యవసానంగా కొత్త రకమైన పాలసీల కోసం కార్పొరేట్‌ సంస్థలు అడుగుతున్నాయా?

ఆరోగ్య బీమా పాలసీలకు విలువ జోడింపు (వాల్యూ యాడెడ్‌ కవర్‌) కోరటం అధికంగా కనిపిస్తోంది. బాధ్యత నెరవేర్చాల్సిన రిస్క్‌ పెరిగిపోయినందున, అందుకు అనువైన పాలసీల కోసం కార్పొరేట్‌ సంస్థలు అడుగుతున్నాయి. 
Q:‘ఆరోగ్య ప్రయోజనాల’ పేరుతో  ఉద్యోగులకు వివిధ సంస్థలు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి?

ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షంగా కలవటం ప్రమాదకరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు బీమా సంస్థల సహకారంతో టెలీసర్వీసెస్, వీడియో కాలింగ్‌... వంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. తద్వారా నిపుణుల సలహాలు అందేవిధంగా చొరవ చూపుతున్నాయి. 

Q:డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కు చెందిన ‘శ్వాస్‌ వెల్‌నెస్‌’,   ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ మధ్య ఒప్పందం ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది 

ఇది ఎంతో వినూత్నమైన ఒప్పందం. వైద్యులను సంప్రదించటం, ల్యాబ్‌ పరీక్షలు, ఫార్మసీ సేవలను ఐఎల్‌టేక్‌కేర్‌ యాప్‌ ద్వారా విస్తృత స్థాయిలో అందించే అవకాశం దీనివల్ల కలుగుతోంది. తొలిదశలో ఈ సేవలను హైదరాబాద్, విశాఖపట్టణంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. 
 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని