Picking a Stock : ఎలాంటి కంపెనీల షేర్లు కొనాలో తెలుసుకోవడం ఎలా?

ఎలాంటి కంపెనీల షేర్లు కొనాలో తెలుసుకోవడానికి కొన్ని ప్రామాణిక నిష్పత్తులు ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే కంపెనీపై ఓ అవగాహన వస్తుంది...

Updated : 27 Sep 2021 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సెన్సెక్స్‌ 60,000 పాయింట్లు అధిగమిస్తే, నిఫ్టీ 18,000 పాయింట్లపై కన్నేసింది. షేర్ల ధరలు పైపైకి పోతున్నాయి. దేశీయ, విదేశీ పెట్టుబడి సంస్థలతో పాటు చిన్న మదుపరులు పోటీపడి పెట్టుబడులు పెడుతున్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సానుకూల పరిణామాలు సూచీల పరుగుకు దోహదం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న మదుపరులు స్టాక్‌మార్కెట్‌ వైపు ఆకర్షితులు కావడం మరొక ముఖ్యమైన అంశం. స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులపై తగినంత అనుభవం, రిస్కుపై అవగాహన లేకపోయినా.. సొమ్ము కుమ్మరిస్తున్నారు. అయితే, ఎలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్న దానిపై కనీస అవగాహన లేకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అందుకోసం ఆ సంస్థ ‘ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌’, క్యాష్‌ ఫ్లో స్టేట్‌మెంట్లను క్షుణ్నంగా పరిశీలించాలి. అయితే, చాలా మందికి వీటిపై పెద్దగా అవగాహన ఉండదు. మరి నాణ్యమైన స్టాక్స్‌ని ఎంపిక చేసుకోవడం ఎలా? దీనికి కొన్ని ప్రామాణిక నిష్పత్తులు ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే కంపెనీపై ఓ అవగాహన వస్తుంది. మరి ఆ నిష్పత్తులు ఏంటో చూద్దాం!

పీ/ఈ రేషియో..

‘ప్రైస్‌ టు ఎర్నింగ్స్‌’ లేదా పీ/ఈ రేషియో.. ఒక రూపాయి ఆర్జనపై మదుపర్లు ఎంత చెల్లిస్తున్నారో ఇది తెలియజేస్తుంది. అలాగే స్టాక్ వాస్తవిక విలువ కంటే ఎక్కువ ధరకు ట్రేడవుతుందా లేక తక్కువకు ట్రేడవుతుందా తెలుసుకోచ్చు. ప్రస్తుత స్టాక్ ధరను.. ఒక్కో షేరుపై ఆ కంపెనీ ఆర్జిస్తున్న మొత్తంతో భాగిస్తే పీ/ఈ రేషియో తెలుస్తుంది. ఉదాహరణకు ఈ నిష్పత్తి 10గా ఉందంటే.. కంపెనీ ఒక్కరూపాయి ఆర్జనను పొందడానికి రూ.10 చెల్లిస్తున్నారన్నమాట! మరి ఇన్వెస్ట్‌ చేయడానికి ఒక కంపెనీ పీ/ఈ ఎంత ఉండాలి? ఇది రంగాన్ని బట్టి ఉంటుంది. ఒక రంగంలోని కంపెనీ పీ/ఈని ఇంకో రంగంలోని సంస్థ పీ/ఈతో సరిపోల్చలేం.

రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌ఓఈ)...

పెట్టుబడి ప్రథమ లక్ష్యం లాభం. కంపెనీకి వచ్చే లాభాల్లో వాటాదారులకు వచ్చే ప్రతిఫలాన్ని తెలియజేసేదే ఆర్‌ఓఈ. అంటే మదుపర్లు పెట్టుబడులతో కంపెనీ ఎంత లాభాన్ని ఆర్జిస్తుందో ఆర్‌ఓఈ తెలియజేస్తుంది. నికర ఆదాయాన్ని మొత్తం వాటాదారుల ఈక్విటీతో భాగిస్తే ఆర్‌ఓఈ వస్తుంది. ఉదాహరణకు మీరు ఓ కంపెనీ ప్రమోటర్‌ అనుకుందాం. రూ.100 పెట్టుబడిగా పెట్టారు. ఈ మొత్తంతో 20 ఆదాయాన్ని ఆర్జిస్తే ఆర్‌ఓఈ 20శాతం. ఎక్కువ ఆర్‌ఓఈ ఉంటే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనదని అర్థం! అయితే, మదుపు చేయడానికి ఆర్‌ఓఈ ఒక్కదాన్నే ఆధారంగా తీసుకోవద్దు. ఇది రంగాలను బట్టి మారుతూ ఉంటుంది. లేదా కంపెనీ అధిక మొత్తంలో అప్పులు తీసుకొచ్చి పెట్టుబడిగా పెట్టినా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అప్పులు పెరుగుతున్నాయంటే జాగ్రత్త పడాల్సిందే మరి!

ప్రైస్‌ టు బుక్‌ వాల్యూ (పీబీవీ) రేషియో...

కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను బుక్‌ వాల్యూతో పోల్చేదే పీబీవీ రేషియో. ప్రస్తుత స్టాక్‌ ధరను దాని పుస్తక విలువతో భాగిస్తే పీబీవీ రేషియో వస్తుంది. మరి పుస్తక విలువ అంటే ఏంటి?సులభంగా చెప్పాలంటే.. ఒక కంపెనీ వ్యాపారాన్ని మూసేసి, ఆస్తుల్ని అమ్మేస్తే వచ్చే డబ్బుతో ఉన్న అప్పులన్నీ తీర్చిన తర్వాత మిగిలేదే ఆ కంపెనీ పుస్తక విలువ. ఉదాహరణకు ఒక కంపెనీని విక్రయిస్తే రూ.1000 వచ్చాయనుకుందాం. అందులో రూ.400 అప్పుల కింద చెల్లించారు. కంపెనీ పేరిట ఉన్న ఆస్తుల్ని విక్రయిస్తే మరో రూ.200 వచ్చాయి. అప్పుడు ఆ కంపెనీ పుస్తక విలువ రూ.800 (1000-400+200). కంపెనీలో మొత్తం 100 షేర్లు ఉన్నాయనుకుంటే.. ఒక్కో షేరు పుస్తక విలువ రూ.8. ఒకవేళ ఆ షేరు మార్కెట్‌లో రూ.80 వద్ద ట్రేడ్‌ అవుతోందనుకుందాం. అప్పుడు పీబీవీ రేషియో (80/8)=10. ఏదైనా కంపెనీ స్టాక్ అమాంతం అలా పెరిగిందో.. లేదో.. దీని ఆధారంగా తెలుసుకోవచ్చు.

డివిడెండ్‌ ఈల్డ్‌ లేదా డివిడెండ్‌-ప్రైస్‌ రేషియో...

ఒక ఏడాదిలో వాటాదారులకు కంపెనీ ఇచ్చే డివిడెండ్‌ని ఆ కంపెనీ స్టాక్ ధరతో భాగిస్తే వచ్చేదే డివిడెండ్‌-ప్రైస్‌ రేషియో. మనం పెట్టే పెట్టుబడిపై ఎంత రాబడి వస్తుందో దీన్ని బట్టి అంచనా వేయొచ్చు. కొన్ని కంపెనీల స్టాక్‌ ధర పెద్దగా పెరగదు. కానీ, ఆ కంపెనీ ఆకర్షణీయ డివిడెండ్లు చెల్లిస్తుంటుంది. ఎక్కువ డివిడెండ్‌ ఈల్డ్‌ ఉందంటే.. మనం పెట్టే పెట్టుబడిపై డివిడెండ్‌ రూపంలో ఎక్కువ మొత్తం ఆర్జించొచ్చని అర్థం.

డెట్‌ టు ఈక్విటీ (డీ/ఈ) రేషియో...

ఒక కంపెనీ పెట్టుబడులు, అప్పులపై ఈ రేషియో ఓ అవగాహన కల్పిస్తుంది. సంస్థ మొత్తం అప్పుల్ని... వాటాదారుల ఈక్విటీతో భాగిస్తే వచ్చేదే డీ/ఈ రేషియో. ఈ రేషియో ఎక్కువ ఉందంటే.. కంపెనీకి అప్పులు ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఎక్కువ రుణాలు/అప్పులు ఉంటే.. ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. చివరకు ఇది నికర లాభాలపై ప్రభావం చూపుతుంది. అయితే, అప్పులు ఎక్కువ ఉన్నంత మాత్రం ఆ కంపెనీ ఇబ్బందుల్లో ఉందని కాదు. బాగా వృద్ధి ఉన్న కంపెనీలు ఎక్కువ మొత్తంలో అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెడుతుంటాయి. తర్వాత రాబోయే లాభాలతో వాటిని చెల్లిస్తుంటాయి. అయితే, తెచ్చిన రుణాన్ని ఎందుకోసం ఉపయోగిస్తున్నాయి? వాటి వడ్డీ సకాలంలో చెల్లిస్తున్నాయా.. లేదా.. చూడాలి.

అయితే, ఓ కంపెనీ స్టాక్‌ని కొనడానికి పై రేషియోలు ఎలా ఉండాలో చూద్దాం..

* పీ/ఈ రేషియో.. ఆ రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ ఉండాలి.

* పీబీవీ రేషియో.. ఆ రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ ఉండాలి.

* రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ.. 20 శాతం కంటే ఎక్కువ ఉండాలి.

* డెట్‌ టు ఈక్విటీ రేషియో.. ఒకటి కంటే తక్కువ ఉండాలి.

* డివిడెంట్‌ ఈల్డ్‌.. పెరుగుతూ ఉంటే ఉత్తమం. కనీసం స్థిరంగానైనా ఉండాలి

(** ఇవి ఒక అంచనాకు రావడానికి మాత్రమే. ప్రామాణికం కాదు)

ఈ కొన్ని నిష్పత్తులు ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన ఆయా కంపెనీల స్టాక్‌లను కొనాలని నిర్ణయించుకోవడం సరికాదు. కంపెనీ పూర్వాపరాలను నిశితంగా పరిశీలించాల్సిందే. ఈ రేషియోలు మీరు ఒక అంచనాకు రావడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఒక కంపెనీని అధ్యయనం చేయడంపై పెద్దగా అవగాహన లేకపోతే ఆర్థిక నిపుణులు సలహాలు పాటించడం మంచిది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని