ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఇవి గుర్తించుకోండి..

పాలసీ తీసుకునేప్పుడు మీకు సంబంధించిన వివరాలన్నీ తెలియజేయడంతోపాటు, అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి

Published : 10 Apr 2021 14:19 IST

పిల్లల చదువులు… సొంతిల్లు… పదవీ విరమణ… ఇలా మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. ఈ దశలో కొన్ని కీలకమైన అంశాలను మర్చిపోతుంటాం. దీనివల్ల మొత్తం ఆర్థిక పరిస్థితే తలకిందులయ్యే ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినవి. వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీ లేకపోతే మన ఆర్థికారోగ్యం దెబ్బతింటుంది. ఆర్థిక ప్రణాళికలో ప్రథమంగా చేయాల్సిన పని వైద్య ఖర్చులకు తగిన ఏర్పాటు చేసుకోవడమే. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్య బీమా తీసుకోవడం ప్రతి కుటుంబానికీ ఎంతో అవసరం.  ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఆరోగ్య‌ బీమాకు ఉన్న ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేస్తున్నాయి.  ప్ర‌జ‌ల‌లో కూడా అవ‌గాహ‌న పెరిగింది. చాలా మంది ఆరోగ్య బీమాను తీసుకునేందుకు ఆశ‌క్తి చూపుతున్నారు. దీంతో బీమా రక్షణకు తోడు… ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80డీలో భాగంగా పన్ను మినహాయింపు కూడా లభిస్తుండటం అదనపు ఆకర్షణ. అయితే, ఏదో ఒక పాలసీ తీసుకోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత పాలసీ తీసుకోవాలి? ఏ బీమా సంస్థ నుంచి తీసుకోవాలనేవి ప్రాథమికమైన అంశాలే. పాలసీ తీసుకునేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటన్నదే అన్నింటికన్నా ముఖ్యం.

పాలసీని ఎంచుకునేప్పుడు, ప్రతిపాదిత పత్రాన్ని పూర్తి చేసేప్పుడు మీరు కొంత సమయం వెచ్చించకపోతే… తర్వాత అవసరం అయినప్పుడు బీమా సంస్థ వేసే అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే, పాలసీని తీసుకునేప్పుడు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీకు ఏ మాత్రం సరిపోని పథకాన్ని ఎంచుకొని ఇబ్బందిపడాల్సి రావచ్చు.

బృంద బీమా స‌రిపోదు?

ప్రస్తుతం దాదాపు అన్ని సంస్థ‌లు తమ ఉద్యోగుల సంక్షేమం కోసం బృంద ఆరోగ్య బీమా సౌకార్యాన్ని అందిస్తున్నాయి. ఇందులో తల్లిదండ్రులకూ బీమా రక్షణ ఉండటం కలిసొచ్చే అంశమే. అయితే, వీటిలో కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని పాలసీలకు సంస్థ‌లే ప్రీమియం చెల్లిస్తాయి. మరికొన్నింటికి ఉద్యోగులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం ఎవరు చెల్లించినా… ముందుగా చూడాల్సింది ఈ బీమా మీ కుటుంబానికి సరిపోతుందా లేదా అనేది. చాలా పాలసీల్లో బీమా మొత్తం తక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం వదిలేసిన మరుక్షణమే ఈ బీమా రక్షణ కూడా దూరం అవుతుంది. అందుకే, బృంద బీమా ఉన్నా… వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఎల్లప్పుడూ మీ పాలసీ మీకు తోడుగా ఉంటుంది.

రహస్యాలు దాచకండి..

వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు మన ఆరోగ్యానికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా దాచిపెట్టకూడదు అంటారు. ఆరోగ్య బీమా పాలసీకీ ఇది వర్తిస్తుంది. మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలనూ ప్రతిపాదిత పత్రంలో పేర్కొనడం ఎప్పుడూ మంచిది. చాలామంది చేసే పొరపాటేమిటంటే… ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలూ చెబితే పాలసీ రాదేమో అని అపోహ పడుతుంటారు. బీమా సంస్థకు అన్ని వివరాలూ తెలియజేయాల్సిన నైతిక బాధ్యత పాలసీదారులదే. తెలియజేయకపోతే మోసపూరితంగా పాలసీ పొందినట్లు అవుతుంది. ఇలా చేయడం వల్ల పాలసీకి క్లెయిం ఇవ్వకుండా నిరాకరించే అవకాశం లేకపోలేదు. ఎలాంటి వైద్య పరీక్షలు అక్కర్లేకుండానే పాలసీ ఇస్తామని చెబుతుంటాయి కొన్ని బీమా సంస్థలు. ఇలాంటి వాటిపట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. పాలసీ తీసుకునేప్పుడు మీకు సంబంధించిన వివరాలన్నీ తెలియజేయడంతోపాటు, అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. అప్పుడే మున్ముందు వచ్చే ఇబ్బందులను తప్పించుకోవచ్చు.

తక్కువ ప్రీమియంతో తీసుకుంటే..

భవిష్యత్తులో మనకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు వస్తాయో ఇప్పుడే ఊహించడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడూ ఉంటాయని తక్కువ మొత్తానికి, తక్కువ ప్రీమియంతో పాలసీ తీసుకుంటారు చాలామంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉండే పాలసీల్లో అనేక పరిమితులు ఉంటాయి. ఫలితంగా పాలసీ ఉండీ… సొంతంగా వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ప్రీమియం ఎక్కువగా ఉండే పాలసీలే మంచివి అని చెప్పడం ఇక్కడ లక్ష్యం కాదు. మన అవసరాలకు తగిన పాలసీ ఏది? దానికి ఎంత ప్రీమియం చెల్లించవచ్చు? అని తెలుసుకున్నాకే పాలసీని ఎంచుకోవడం మంచిదని గుర్తించాలి.

మీపై భారం పడకుండా..

పాలసీని తీసుకునేప్పుడు ప్రీమియం ఒక్కటే కొలమానం కాదు. క్లెయిం చేసుకునే సందర్భంలో సహ చెల్లింపు ఏమైనా ఉందా?అనేది చూడాలి. ఇందులో వైద్య ఖర్చుల్లో కొంత మొత్తాన్ని మనం భరించాల్సి ఉంటుంది. ఇలాంటి పాలసీకి సహజంగానే ప్రీమియం కాస్త తక్కువగా ఉంటుంది. అయితే, కాస్త అధిక ప్రీమియం ఉన్నప్పటికీ పూర్తి పరిహారాన్ని ఇచ్చే పాలసీని తీసుకోవడమే ఎప్పుడూ ఉత్తమం. మరో అంశం… ఉప పరిమితులు. ప్రస్తుతం ఆసుపత్రుల గదుల అద్దెలు భారీగా ఉంటున్నాయి. ఇతర ఖర్చులూ అధికమే. ఇలాంటప్పుడు ఉప పరిమితులు ఉన్న పాలసీ తీసుకుంటే… మన జేబులో నుంచి డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఎలాంటి పరిమితులూ లేకుండా వైద్య ఖర్చులు చెల్లించే పాలసీలే ఎప్పుడూ ఉత్తమం. పాలసీ ఎంపిక చేసుకునేప్పుడు ఈ విషయాలను తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.

క్లెయిం చేసుకోకపోతే..

ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయింలూ లేకపోతే… పునరుద్ధరణ సమయంలో బీమా సంస్థలు నో క్లెయిం బోనస్‌ ఇస్తాయి. ఫలితంగా పాలసీ మొత్తం 5 శాతం నుంచి 10శాతం వరకూ పెరుగుతుంది. పాలసీ తీసుకునేప్పుడు అధికంగా నో క్లెయిం బోనస్‌ ఇచ్చే పాలసీలను పరిశీలించాలి. పెరుగుతున్న వైద్య ఖర్చులను తట్టుకునేందుకు ఇది మంచి అవకాశం. ప్రీమియంలో తగ్గింపుకన్నా… పాలసీ మొత్తాన్ని పెంచే పాలసీలే ఎప్పుడూ ఉత్తమం.

వేచి ఉండే సమయం..

పాలసీ తీసుకునే ముందే ఉన్న వ్యాధుల చికిత్సకు నిర్ణీత వ్యవధి తర్వాతే బీమా వర్తిస్తుంది. గరిష్ఠంగా ఇది నాలుగేళ్ల వరకూ ఉంటోంది. అంటే, ఈ వ్యవధి ముగిసేవరకూ వీటి చికిత్స ఖర్చులను మీరే భరించాలన్నమాట.దీంతోపాటు కొన్ని వ్యాధులకు కొంతకాలం వేచి ఉండే సమయం ఉంటుంది. ఉదాహరణకు కంటి శుక్లాలకు శస్త్రచికిత్స, హెర్నియాలాంటి వాటికి పాలసీ తీసుకున్న ఏడాది… రెండేళ్ల తర్వాతే చికిత్సకు పరిహారం ఇస్తారు. కాబట్టి, వీలైనంత తక్కువ వేచి ఉండే కాలం ఉన్న పాలసీలను తీసుకునేందుకు ప్రయత్నించాలి.

వ్యాధులను బట్టీ..

కొన్నిసార్లు పాలసీలో ఉండే చిన్న నిబంధనే మనల్ని పెద్ద ఇబ్బంది పెడుతుంది. కొన్ని పాలసీల్లో వ్యాధుల చికిత్సకు సంబంధించి పరిహారం ఇచ్చేందుకు పరిమితి విధిస్తుంటాయి. ఈ నిబంధనలు ఏయే వ్యాధులకు వర్తిస్తాయో తెలుసుకోవాలి. అవగాహన లేకుండా పాలసీ తీసుకుంటే తర్వాత చిక్కుల్లోపడతాం.

చరిత్ర చూడాలి..

ఒక పాలసీని ఎంచుకోవాలనుకున్నప్పుడు అంతర్గతంగా ఉన్న అనేక నిబంధనలను పరిశీలించడంతోపాటు… చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం… క్లెయిం చెల్లింపుల చరిత్ర. చూడ్డానికి ఎంత మంచి పాలసీ అయినా… క్లెయింల విషయంలో లేనిపోని ఇబ్బందులు పెడితే అంతిమంగా వచ్చే ఫలితం ఏమీ ఉండదు. పైగా మానసిక ఆందోళన పెరుగుతుంది కూడా. చిన్న చిన్న కారణాలతో క్లెయింలను నిరాకరించే సంస్థలు అందించే పాలసీలకు దూరంగా ఉండటమే మంచిది. అయితే, కేవలం చెల్లింపుల చరిత్ర ఒక్కటి బాగానే ఉన్నంత మాత్రాన పని పూర్తి కాదు. మీకు సరిపోయే పాలసీని, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థ నుంచి తీసుకున్నప్పుడే ఆపదలో అది మిమ్మల్ని ఆదుకుంటుంది.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకోగానే ఇక పూర్తిగా బీమా సంస్థదే భారం అన్నట్లు భావించకూడదు. వాస్తవంలో పరిస్థితి వేరుగా ఉంటుందని మర్చిపోకూడదు. ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్య ఖర్చులతో పాటు అనేక ఇతర ఖర్చులూ ఉంటాయి. ఆసుపత్రికి రానుపోను ఖర్చులూ, సహాయకుడిగా ఉన్న వ్యక్తికి అయ్యే వ్యయంలాంటివన్నమాట. అందుకే, కొంతమొత్తాన్ని ఆరోగ్య నిధిగా ఉంచుకోవడం తప్పనిసరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని