వీడియోకాన్‌ కేసులో ఎన్‌సీఎల్‌ఏటీ విచారణ వాయిదా

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ను అనిల్‌ అగర్వాల్‌కు చెందిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ టేకోవర్‌ చేయడానికి అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వచ్చిన పలు పిటిషన్లపై విచారణను

Published : 08 Sep 2021 01:25 IST

20 వరకు కొనసాగనున్న స్టే

దిల్లీ: వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ను అనిల్‌ అగర్వాల్‌కు చెందిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ టేకోవర్‌ చేయడానికి అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వచ్చిన పలు పిటిషన్లపై విచారణను సెప్టెంబరు 20 వరకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) వాయిదా వేసింది. 13 వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలను రూ.2962.02 కోట్లతో టేకోవర్‌ చేసే పరిష్కార ప్రణాళిక అమలుపై స్టే ఇస్తూ జులై 19న ఎన్‌సీఎల్‌ఏటీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దివాలా స్మృతి(ఐబీసీ) కింద  ఈ ప్రణాళికకు ఆమోదం లభించిన సంగతి విదితమే. తదుపరి విచారణ తేదీ అంటే సెప్టెంబరు 20 వరకు ఆ తాత్కాలిక ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే జైన్‌, జస్టిస్‌ ఏకే మిశ్రాలతో కూడిన ద్విసభ్య ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ఎన్‌సీఎల్‌ఏటీకి పిటిషన్లు దాఖలు చేసిన వారిలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఐఎఫ్‌సీఐ, సిడ్బి, ఎలక్ట్రోలక్స్‌ హోమ్‌ ప్రోడక్ట్స్‌లు ఉన్నాయి.


అయిదేళ్ల పాటు చైనా విటమిన్‌-సి దిగుమతులపై యాంటీ డంపింగ్‌ సుంకం

వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు

దిల్లీ: చైనా నుంచి విటమిన్‌-సి దిగుమతులపై యాంటీ- డంపింగ్‌ సుంకం విధింపునకు వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు విభాగం డీజీటీఆర్‌ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌) సిఫారసు చేసింది. దేశీయ తయారీదార్ల ప్రయోజనాలను పరిరక్షించడమే ఈ సిఫారసు వెనక ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. మందుల తయారీలో ఔషధ సంస్థలు విటమిన్‌-సిని ఉపయోగిస్తుంటాయి. విక్రయ ధరే కాదు.. తయారీ వ్యయం కంటే తక్కువకే దేశీయ విపణిలోకి చైనా నుంచి విటమిన్‌-సి దిగుమతి అవుతోందని డీజీటీఆర్‌ తన దర్యాప్తులో తెలుసుకుంది. దీని వల్ల దేశీయ పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం పడుతోందని డీజీటీఆర్‌ తెలిపింది. అందువల్ల చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు యాంటీ డంపింగ్‌ సుంకం విధింపునకు సిఫారసు చేసినట్లు పేర్కొంది. దీనిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని