ఐటీ రిట‌ర్నులు: గ‌డువులోపు చేయాల్సిన ప‌నులివే!

ఐటీ రిట‌ర్ను గ‌డువు స‌మీపించే కొద్దీ హ‌డావిడి ప‌డ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకొని, ప‌రిశీలించాల్సిన అంశాలేమిటో చూద్దాం.

Published : 16 Dec 2020 14:32 IST

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసే గ‌డువు తేదీ ఎంతో దూరంలో లేదు. రిట‌ర్నులు ఫైలింగ్ చేసే ముందు కొన్ని అంశాల‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది. ఐటీ రిట‌ర్నులు ఫైలింగ్ స‌కాలంలో ఫైల్ చేయడంలో భాగంగా కొన్ని ముఖ్య‌మైన ప‌నులపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

ప‌న్ను క్రెడిట్ పోల్చిచూసుకోండి

ఇన్‌కం ట్యాక్స్ రిట‌ర్నులు దాఖ‌లుచేసేట‌ప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేసేందుకు అవ‌కాశం ఉండ‌దు. మూలం వ‌ద్ద ప‌న్ను కోత (టీడీఎస్‌), ముంద‌స్తు ప‌న్ను (అడ్వాన్స్ ట్యాక్స్‌) చెల్లింపుల‌కు క్రెడిట్‌ల‌ను ఇస్తారు. వీటికి సంబంధించిన ప్ర‌ధాన స‌మాచారమంతా ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచే వ‌స్తుంది. ఇలాంటి స‌మాచారాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ త‌మ వ‌ద్ద నిక్షిప్తం చేసుకొని ప‌న్ను చెల్లింపుదార్లు చూసుకునేందుకు అనువుగా ఉంచుతుంది. ఇందుకోసం ఫారం నెం. 26ASను వినియోగించాల్సి ఉంటుంది.
టీడీఎస్‌, అడ్వాన్స్ ట్యాక్స్ వివ‌రాల‌ను ప‌న్ను చెల్లింపుదారు లేదా బ్యాంకులు రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు వెల్ల‌డించాల్సి ఉంటుంది. బ్యాంకు లేదా ప‌న్ను చెల్లింపుదారు వ‌ల్ల ఏదైనా పొర‌పాటు జరిగితే స‌రైన క్రెడిట్ 26AS ఫారంలో ప్ర‌తిఫ‌లించ‌దు.

ఫారం 26AS

  • వ్య‌క్తిగ‌త‌ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వ‌డం ద్వారా ఫారం 26ASను చూసుకునే అవ‌కాశం ఉంటుంది.

E-FILING.jpg

  • ప‌న్ను మిన‌హాయింపు, లేదా ప‌న్ను ఆదాయం, చెల్లింపు వివ‌రాల‌న్నీ ఫారంలో స‌రిపోలుతున్నాయో లేదో చూసుకోవాలి. మ‌ళ్లీ వీటినే అడ్వాన్స్ ట్యాక్స్ చ‌లాన్ వివ‌రాల‌తో స‌రిచూసుకోవాలి లేదా ఫారం 16, ఫారం 16Aల స‌హాయంతో స‌రిచూసుకోవాలి.
  • ఇలా స‌రిపోల్చేట‌ప్పుడు ఏమైనా చిన్న తేడాలు గ‌మ‌నించినా స‌రే వెంట‌నే సంబంధిత ప‌న్ను మిన‌హాయించే వ్య‌క్తిని లేదా బ్యాంకును సంప్ర‌దించాలి. ఇలా జ‌రిగిన పొర‌పాట్ల‌ను వారి దృష్టికి తీసుకెళ్లి స‌వ‌రించాల్సిందిగా కోరాలి.
  • ఫారం 26ASలో ప్ర‌తిబింబించేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సూచించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రిట‌ర్నులు ప్రాసెస్ చేసేట‌ప్పుడు చెల్లించిన ప‌న్నుల‌కు స‌రైన‌ క్రెడిట్ ల‌భిస్తుంది

ఫారం నెం. 16/16A

  • టీడీఎస్‌కు సంబంధించి ఫారం 16 లేదా ఫారం 16Aల‌ను ఈ పాటికే అందుకొని ఉంటారు. కంపెనీ య‌జ‌మాని జారీచేసే ఫారం 16లో పాన్ వివ‌రాలు స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
  • పన్ను మిన‌హాయింపుల‌ను అందించే అల‌వెన్సులైన హెచ్ఆర్ఏ, మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్‌, ఎల్‌టీఏ లాంటివాటిని మిన‌హాయింపుల కింద‌ చేర్చారో లేదో ఫారంలో గమనించాలి. చివ‌రి నిమిషంలో వీటికి సంబంధించిన ప‌త్రాలు సమ‌ర్పించ‌డంలో ఫారం 16లో పొర‌పాట్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది.
  • ఎల్.ఐ.సీ, ఆరోగ్య బీమా ప్రీమియంలు, గృహ‌రుణ చెల్లింపు, విద్యారుణంపై వ‌డ్డీ, పిల్ల‌ల పాఠ‌శాల ఫీజుల లాంటివాటిపై ఎంత మిన‌హాయింపులున్నాయో ఫారం 16లో అవి స‌రిగా న‌మోద‌య్యాయో లేదో గ‌మ‌నించాలి. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైలింగ్ చేసేట‌ప్పుడు ఈ ఫారం 16లోని అంకెల‌నే చార్ట‌ర్డ్ అకౌంటెంట్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.
  • ఫారం 16లో ఏమైనా పొర‌పాట్లు గ‌మ‌నిస్తే యాజ‌మానిని సంప్ర‌దించి వెంట‌నే స‌వ‌ర‌ణ చేయాల్సిందిగా అభ్య‌ర్థించాలి.
  • అదే విధంగా బ్యాంకుల నుంచి ఫారం 16A అందుకొని, పాన్ వివ‌రాలు స‌రిచూసుకోవాలి. దీంతోపాటు ఆదాయం ఎంతుంది అందుకు వ‌ర్తించిన టీడీఎస్‌ను స‌రిపోలుతున్నాయో లేదో చూసుకోవాలి.

మూల‌ధ‌న లాభాల ఖాతాను ప్రారంభించండి

గ‌డువు తేదీలోపు ఆదాయ‌పు రిట‌ర్నులు దాఖ‌లు చేసే ముందు చేయాల్సిన ప‌నులు కొన్ని ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు స్థిరాస్తి విక్ర‌యం ద్వారా ల‌భించే దీర్ఘ‌కాల మూల‌ధ‌న లాభాల‌పై సెక్ష‌న్ 54 లేదా 54F కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అలాంటి లాభాల‌తో మ‌రో ఇంటి కొనుగోలుకు వెచ్చించ‌డ‌మో లేదా మూల‌ధ‌న లాభాల ఖాతాను ప్రారంభించి అందులో జ‌మ‌చేస్తేనే ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాన్ని అందుకోగ‌లం. రిట‌ర్ను దాఖ‌లు చేసే గ‌డువు తేదీలోపు ఈ ఖాతా ప్రారంభ‌మ‌య్యేలా చూసుకోవాలి.
మూల‌ధ‌న లాభాలు అందుకున్నాక … ఐటీ రిట‌ర్నుల గ‌డువు తేదీలోపు మూల‌ధ‌న‌ ఖాతా అందుబాటులో లేక‌పోతే అప్ప‌టికి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కోల్పోతాం. జులై 31లోగా మూల‌ధ‌న లాభాల‌న్నీ ఈ ఖాతాలోకి జ‌మ‌చేసుకునేలా జాగ్ర‌త్త‌ప‌డండి.

ఇప్ప‌టిదాకా వివ‌రించిన‌ అంశాల‌న్నీ ఐటీ రిట‌ర్నులు దాఖలు చేసేట‌ప్పుడు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాం.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని