
భారత్‌కు కావాల్సిన సహకారం అందిస్తాం: బైడెన్
వాషింగ్టన్: కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు.. కావాల్సిన సహకారం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హామీ ఇచ్చారు. కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్‌కు పంపనున్నామని తెలిపారు.
మొదటి దశ విజృంభణ సమయంలో అమెరికా ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. భారత్ తమకు అండగా నిలబడిందని బైడెన్ గుర్తుచేసుకున్నారు. అదే రీతిలో ఇప్పుడు ఆపదలో ఉన్న భారత్‌కు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ చేసిన ప్రకటనను బైడెన్ తన ట్వీట్‌కు జత చేశారు.
మరోవైపు భారత్‌లో కొవిడ్-19 విజృంభణ ఆందోళకరంగా ఉందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ఈ నేపథ్యంలో కావాల్సిన సాయం అందించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సాయం అందిస్తూనే.. హెల్త్‌కేర్ వర్కర్లతో పాటు భారత ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు.
భారత్‌లో కొవిడ్ రెండో దశ విజృంభణపై ఇరువురు నేతలు స్పందించడం ఇదే తొలిసారి. అంతకుముందు భారత్‌కు అండగా నిలవకపోవడంపై సొంత పార్టీలోని భారత సంతతికి చెందిన నేతల నుంచి బైడెన్ పాలకవర్గం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మిగులు టీకాలతో పాటు అవసరమైన వైద్య పరికరాలు పంపాలని వారు ఒత్తిడి తెచ్చారు. గతంలో భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి ఔషధాల్ని అమెరికాకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం స్పందించడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.