భారత్‌ అద్భుతంగా పుంజుకుంది: ప్రపంచ బ్యాంక్‌

కరోనా కల్లోలం, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ అద్భుతంగా పుంజుకుందని ప్రపంచ బ్యాంక్‌ స్పష్టం చేసింది. అయితే, ఇంకా పూర్తిగా బయటపడలేదని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం......

Published : 31 Mar 2021 15:34 IST

వాషింగ్టన్‌: కరోనా కల్లోలం, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ అద్భుతంగా పుంజుకుందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. అయితే, ఇంకా పూర్తిగా బయటపడలేదని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.5-12.5 మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. వ్యాక్సినేషన్‌ వేగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, మరోసారి ఆంక్షల వంటి అంశాలే భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించనున్నాయని ఓ నివేదికలో పేర్కొంది.

కరోనా మరోసారి పుంజుకుంటుండడం, ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించడం ప్రస్తుతం భారత్‌ ముందున్న అతిపెద్ద సవాళ్లని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగంలో ప్రధాన ఆర్థికవేత్త హన్స్‌ టిమ్మర్‌ తెలిపారు. అలాగే స్థూలంగా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ.. ఇంకా కొన్ని గణాంకాల్లో అస్థిరత నెలకొందని పేర్కొన్నారు. బహుశా రెండేళ్లుగా ఎలాంటి వృద్ధి లేకపోవడమే అందుకు కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశ తలసరి ఆదాయం పడిపోయిందని తెలిపారు. 

ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్న కొద్దీ.. కరెంటు ఖాతా లోటు తిరిగి పూర్వస్థితికి చేరుకుంటందని నివేదిక అంచనా వేసింది. ద్రవ్య విధానంలో సరైన మార్పులు, అంతర్జాతీయంగా ద్రవ్య లభ్యత వంటి అంశాలు పెట్టుబడులకు మార్గం సుగమం చేయనున్నాయని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఆర్థిక లోటు జీడీపీలో 10 శాతం వరకు ఉంటుందని తెలిపింది. ఇక వృద్ధి పుంజుకుంటున్న కొద్దీ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపింది. తద్వారా పేదరికం సైతం గాడిలోకి వస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని