Tesla: టెస్లాకు రాయితీలిస్తాం.. కానీ షరతులు వర్తిస్తాయ్‌?

కేంద్రం ప్రభుత్వం టెస్లా ముందు ఓ ఆఫర్‌ను ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది......

Updated : 21 Jan 2022 12:22 IST

కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా భారత ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కొన్ని రాయితీలివ్వాలంటూ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కోరుతున్నారు. ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌ మరోసారి ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీంతో కేంద్రం ప్రభుత్వం టెస్లా ముందు ఓ ఆఫర్‌ను ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

టెస్లా ఏం కోరుతోంది?

భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీ)పై దిగుమతిపై సుంకం భారీగా ఉందని గతేడాది టెస్లా ఆరోపించింది. ప్రపంచంలో ఇంత సుంకం మరెక్కడా లేదని వాదిస్తోంది. దీన్ని తగ్గించాల్సిందిగా కోరింది. ఆ తర్వాత భారత్‌లో కొంతకాలం పాటు దిగుమతి చేసిన కార్లను విక్రయిస్తామని.. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్‌ తెలిపారు. అంతకంటే ముందు టెస్లా కార్లు, బ్యాటరీల తయారీ కోసం భారత్‌ నుంచి సేకరిస్తున్న ముడిపదార్థాల కొనుగోళ్లను భారీగా పెంచుతామని ఆఫర్‌ ఇచ్చారు. దీనిపై అప్పట్లో కేంద్రం ప్రభుత్వం స్పందిస్తూ.. ఇతర ఏ కంపెనీలకు ఇవ్వని ప్రయోజనాలను టెస్లాకు కల్పిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని స్పష్టం చేసింది. తొలుత భారత్‌లో తయారీని ప్రారంభించాలని.. తర్వాత రాయితీల గురించి ఆలోచిస్తామని అప్పట్లో చెప్పింది.

ప్రభుత్వ షరతులివేనా?

ప్రభుత్వ ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమానికి అనుగుణంగా భారత్‌లో తప్పనిసరిగా తయారీ చేపట్టాలని కేంద్రం టెస్లాను డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. అలాగే పన్ను ప్రయోజనాలను కల్పించే ముందు భారత్‌లో కంపెనీ భవిష్యత్తు పెట్టుబడుల ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు తయారీ కేంద్రం ఏర్పాటు కంటే ముందు ముడిపదార్థాల కొనుగోలును పెంచుతామన్న టెస్లా ఆఫర్‌పై సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై టెస్లా ఆశలు పెట్టుకున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటార్స్‌.. సంస్థ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

దిగుమతి సుంకాలు ఇలా ఉన్నాయ్‌...

* 40,000 డాలర్లు (దాదాపు 29.75 లక్షలు) లేదా అంతకంటే తక్కువ విలువ ఉన్న విద్యుత్తు వాహనాలపై ప్రభుత్వం 60 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది.

* 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న విద్యుత్తు వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉంది.

* అమెరికాలో రూ.34 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లన్నీ భారత్‌లో రెట్టింపు ధరకు అందుబాటులో ఉంటాయి.

* విదేశాల్లో తయారైన ఈవీలను భారత్‌లోకి అనమతిస్తే.. దేశీయ తయారీ సంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నది కేంద్ర ప్రభుత్వం వాదన. అయితే, దేశీయంగా ఏ కంపెనీ 40,000 డాలర్లు విలువ చేసే కార్లను తయారు చేయడం లేదని.. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదని టెస్లా వాదిస్తోంది.

రాష్ట్రాల రెడ్‌ కార్పెట్‌...

భారత్‌లోకి ప్రవేశించాలనుకుంటున్న తమ కంపెనీ ప్రణాళికలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఇటీవల మస్క్‌ ట్వీట్‌ చేశారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. సోషల్‌ మీడియా ద్వారా మస్క్‌.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మా రాష్ట్రంలో ప్లాంటు నెలకొల్పాలంటూ ఇప్పటికే తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, కర్ణాటక టెస్లాకు ఆహ్వానం పలికాయి. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఏకంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. విద్యుత్తు వాహనాల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరారు. టెస్లా, రివియాన్‌, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలకు నిర్ణీత కాలం పాటు రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కల్పించలేని ప్రయోజనాలను రాష్ట్రం తరఫున తాము కల్పిస్తామని మరికొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని