మన మిలియనీర్లు ఇష్టపడుతున్న బ్రాండ్‌లివే!

భారత్‌లో 4.12 లక్షల డాలర్-మిలియనీర్ కుటుంబాలు ఉన్నట్లు హురుణ్‌ ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌-2020 వెల్లడించింది. ముంబయిలో అత్యధిక మంది మిలియనీర్లు ఉండగా.. తర్వాతి స్థానంలో దిల్లీ ఉన్నట్లు తెలిపింది......

Updated : 17 Mar 2021 09:38 IST

దిల్లీ: మిలియన్‌ డాలర్ల సంపద కలిగిన 4.12 లక్షల కుటుంబాలు భారత్‌లో ఉన్నట్లు హురుణ్‌ ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌-2020 వెల్లడించింది. ముంబయిలో అత్యధిక మంది మిలియనీర్లు ఉండగా.. తర్వాతి స్థానంలో దిల్లీ ఉన్నట్లు తెలిపింది. వీరిలో చాలా మంది స్టాక్‌ మార్కెట్, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. మొత్తం 449 మంది మిలియనీర్లపై హురుణ్‌ సర్వే నిర్వహించింది. వీరిలో 62 మంది సూపర్‌ రిచ్‌(రూ.100 కోట్లకు పైగా సంపద ఉన్నవారు) వర్గానికి చెందినవారు. వీరు ఏ బ్రాండ్‌లు ఇష్టపడుతున్నారు..?ప్రయాణానికి ఏ విమానయాన సంస్థల్ని ఎంచుకుంటున్నారు..? వంటి ఆసక్తికరమైన వివరాలతో కూడిన నివేదికను హురుణ్‌ మంగళవారం విడుదల చేసింది.


తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడంటే..

మిలియన్‌ డాలర్ల సంపద ఉన్నవారిని డాలర్‌ మిలియనీర్లు అంటారు. భారత కరెన్సీలో చెప్పాలంటే కనీసం రూ.7 కోట్ల సంపద ఉన్న వ్యక్తులను లేదా కుటుంబాలను మిలియనీర్లుగా పరిగణిస్తారు. భారత్‌లో అటువంటి కుటుంబాలు 4.12లక్షలు ఉన్నట్లు హురుణ్‌ నివేదిక తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా రూ.1,000 కోట్ల సంపద ఉన్న కుటుంబాలు 3,000 వరకు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 56,000 మంది మిలియనీర్లు ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ 36,000, తమిళనాడు 35,000, కర్ణాటక 33,000, గుజరాత్‌ 29,000 మంది మిలియనీర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 20,000 మంది మిలియనీర్లతో ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో ఉండగా.. తెలంగాణ 18,000 మంది మిలియనీర్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లోనే 70.3 శాతం మిలియనీర్‌ కుటుంబాలు ఉండడం గమనార్హం.


ఆర్థిక రాజధానిదే హవా

ఇక నగరాలవారీగా చూస్తే దేశ జీడీపీకి 6.16 శాతం ఆదాయం సమకూరుస్తున్న ముంబయిలో 16,933 మంది మిలియనీర్లు ఉన్నారు. జీడీపీలో 4.94 శాతం వాటా కలిగి ఉన్న దేశ రాజధాని దిల్లీలో 16,000 మంది మిలియనీర్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది. కోల్‌కతాలో 10,000 మంది, బెంగళూరులో 7,582, చెన్నైలో 4,685 మంది మిలియనీర్లు ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందాలంటే దేశ తలసరి జీడీపీ ప్రస్తుతం ఉన్న 1,876 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు పెరగాల్సిన అవసరం ఉందని హురుణ్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు.


టాప్‌ బ్రాండ్‌లకే ప్రాధాన్యం

దేశంలో అత్యధిక మంది మిలియనీర్లు విలాసవంతమైన మెర్సిడెస్‌ బ్రాండ్‌ కార్లనే ఎంపిక చేసుకుంటున్నట్లు మరో ప్రత్యేక నివేదికలో హురుణ్‌ ఇండియా తెలిపింది. బీఎండబ్ల్యూ, జాగ్వార్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక లగ్జరీ, స్పోర్ట్స్‌ విభాగంలో లాంబోర్గినీ, పోర్షే, ఆస్టిన్‌ మార్టిన్‌ కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాచీల్లో రోలెక్స్‌, ఆభరణాల్లో తనిష్క్‌ని ఇష్టపడుతున్నారు. విలాసవంతమైన విడిది కోసం తాజ్‌ను తర్వాత మారియట్‌ హోటళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. విమాన ప్రయాణానికి ఎమిరేట్స్‌ను తర్వాత సింగపూర్ ఎయిర్‌, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌.. మద్యంలో జానీ వాకర్‌, డోమ్‌ పెరిగ్నన్‌ షాంపెయిన్‌ను ఎన్నుకుంటున్నారు.


సంతోషం తగ్గింది

భారత్‌ మిలియనీర్లు ఎంత మేర సంతోషంగా ఉంటున్నారో తెలిపే హ్యాపినెస్‌ ఇండెక్స్‌ 2020లో 7.2/10గా ఉంది. క్రితం ఏడాది ఇది 8.5గా నమోదైంది. చాలా మంది యూకేకి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. స్విట్జర్లాండ్‌, అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పిల్లల చదువుల కోసం అమెరికానే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇక పెట్టుబడులకు అగ్రరాజ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండగా.. సింగపూర్‌, యూఏఈ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని