అమెజాన్‌కు ఇండియానే రెండో అతి పెద్ద టెక్నాలజీ హబ్‌

అమెజాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా రెండో అతి పెద్ద టెక్నాలజీ హబ్‌ భారతేనని అమెజాన్‌ గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కంట్రీ హెడ్‌ ఇండియా అమిత్‌ అగర్వాల్‌ వెల్లడించారు. మా బృందాలు దేశంలోని వినియోగదార్ల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా

Updated : 17 Sep 2021 01:31 IST

కంట్రీ హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌

దిల్లీ: అమెజాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా రెండో అతి పెద్ద టెక్నాలజీ హబ్‌ భారతేనని అమెజాన్‌ గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కంట్రీ హెడ్‌ ఇండియా అమిత్‌ అగర్వాల్‌ వెల్లడించారు. మా బృందాలు దేశంలోని వినియోగదార్ల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరణలకు శక్తినిస్తున్నాయని పేర్కొన్నారు. అమెజాన్‌ ఇండియా కెరీర్‌ డే సందర్భంగా అమిత్‌ మాట్లాడారు. ‘భారత్‌లో ఇంజినీరింగ్‌, సరఫరా చైన్‌, కంటెంట్‌ సృష్టి, మార్కెటింగ్‌, వీడియో తదితర విభాగాల్లో కంపెనీ సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. మంచి ప్రతిభ కలిగిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, ప్రోడక్ట్‌ మేనేజర్లు, మెషీన్‌ అభ్యాస శాస్త్రవేత్తలు, పరిశోధనా శాస్త్రవేత్తలు మా బృందంలో ఉన్నారు. వీరంతా ఇక్కడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలకు శక్తి ఇస్తున్నారు. అమెజాన్‌లో వినియోగదారు ప్రయాణాన్ని ప్రతి అంశంలో ప్రాక్టికల్‌గా స్పృశిస్తూ సేవలను అందిస్తున్నార’ని పేర్కొన్నారు. బెంగళూరులోని అమెజాన్‌ బృందం నిర్మించిన క్లౌడ్‌ ఆధారిత వేర్‌హౌసింగ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను దీనికి ఉదాహరణగా వివరించారు.


తల్లులకు 6 నెలల పాటు ఇంటి నుంచే పని: స్నాప్‌డీల్‌

దిల్లీ: కొత్తగా తల్లులైన వారు ఆరు నెలల పాటు ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేసే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ వెల్లడించింది. ఆరు నెలల మాతృత్వ సెలవుకు ఇది అదనమని తెలిపింది. ‘పేరెంటింగ్‌ పార్ట్‌నర్స్‌ ప్రోగ్రామ్‌’లో భాగంగా కొత్తగా తల్లిదండ్రులైన వారికి పలు ప్రయోజనాలను కంపెనీ ప్రకటించింది. రెండు వారాల పితృత్వ సెలవు, దత్తత తీసుకునే వారికి 12 వారాల పాటు సెలవు వంటివి ఇందులో ఉన్నాయి. ‘పిల్లల పెంపకం సులభం కాదని మాకు తెలుసు. కొన్ని సార్లు ఇల్లు, ఉద్యోగానికి సమప్రాధాన్యం ఇవ్వలేక మహిళలు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో ఇప్పుడిప్పుడే కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. దీంతో కొత్తగా తల్లి అయ్యే వారికి 6 నెలల పాటు ఇంటి నుంచే పని సౌలభ్యాన్ని ఇస్తున్నాం’ అని స్నాప్‌డీల్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.


హిందుస్థాన్‌ కాపర్‌ ఓఎఫ్‌ఎస్‌కు అధిక స్పందన

దిల్లీ: హిందుస్థాన్‌ కాపర్‌లో ప్రభుత్వ వాటా విక్రయానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)కు సంస్థాగత మదుపర్లు రూ.700 కోట్లకు పైగా బిడ్‌లు దాఖలు చేశారు. ఎన్‌ఎస్‌ఈ వద్ద లభించిన సమాచారం ప్రకారం.. ఆఫర్‌లో 4.35 కోట్లకు పైగా షేర్లను ఉంచగా, 6.14 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. మొత్తం ఆఫర్‌ పరిమాణానికి ఇది 1.41 రెట్లకు సమానం. ఒక్కో షేరు రూ.116.12 చొప్పున.. బిడ్లు విలువ రూ.710 కోట్లకు పైగా ఉంది. ప్రభుత్వం హిందుస్థాన్‌ కాపర్‌లో 10 శాతం వాటా విక్రయిస్తోంది. ఇందులో గ్రీన్‌ షూ ఆప్షన్‌ కింద 5 శాతం ఉంది. వాటా విక్రయం విజయవంతమైతే.. ప్రభుత్వ ఖజనాకు రూ.1100 కోట్లు సమకూరుతాయి. శుక్రవారం రిటైల్‌ మదుపర్లు బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎమ్‌డీసీ, హడ్కో ఓఎఫ్‌ఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సూటీలలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.8,368 కోట్లు సమీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని