యూకేలో భారత్‌ భారీ పెట్టుబడులు!

భారత్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ) యూకేలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఓ విక్రయ కార్యాలయం ఏర్పాటుతో.........

Updated : 19 Dec 2022 12:07 IST

ఒక్క సీరం నుంచే 240 మిలియన్ పౌండ్లు

లండన్‌: భారత్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ) యూకేలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఓ విక్రయ కార్యాలయం ఏర్పాటుతో పాటు సంస్థ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందకు 240 మిలియన్‌ పౌండ్లు యూకేలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో కుదిరిన బిలియన్‌ డాలర్లు విలువ చేసే వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాల్లో భాగంగానే సీరం యూకేలో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వర్చువల్‌ సమావేశానికి ముందు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వెలువడడం గమనార్హం.

తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్లో భాగంగా భారత కంపెనీలు యూకేలో పెట్టే పెట్టుబడులతో 6,500 ఉద్యోగాల సృష్టి జరగనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. హెల్త్‌కేర్‌, బయోటెక్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోని వివిధ కంపెనీలు యూకేలో పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు ముక్కుద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను యూకేలో ప్రారంభించినట్లు సీరం ప్రకటించింది.

ఇక సీరం ఏర్పాటు చేయనున్న కొత్త విక్రయ కార్యాలయంతో దాదాపు బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. తాజా పెట్టుబడులతో వ్యాక్సిన్లకు సంబంధించిన  క్లినికల్‌ ట్రయల్స్‌, పరిశోధన, అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపింది. దీంతో కరోనా సహా ఇతర ప్రాణాంతక వ్యాధులను నివారించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది.

సీరంతో పాటు ‘గ్లోబల్‌ జీన్‌ కార్ప్‌’ అనే హెల్త్‌కేర్‌ సంస్థ రానున్న ఐదేళ్లలో యూకేలో 59 మిలియన్‌ పౌండ్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో కేంబ్రిడ్డిలోని వెల్‌కమ్‌ జీనోమ్‌ క్యాంపస్‌లో ఉన్న పరిశోధనా కేంద్రంలో 110 అత్యున్నత నైపుణ్యాలు గల ఉద్యోగాల సృష్టి జరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు క్యూ-రిచ్‌ క్రియేషన్‌ 54 మిలియన్‌ పౌండ్లు, విప్రో 16 మిలియన్‌ పౌండ్లు, ఐ2 ఆగ్రో 30 మిలియన్‌ పౌండ్లు, స్టెరిలైట్‌ టెక్‌ 15 మిలియన్‌ పౌండ్లు సహా మరికొన్ని సంస్థలు యూకేలో పెట్టుబడి పెట్టే భారత కంపెనీల జాబితాలో ఉన్నాయి.

తాజాగా ఖరారైన ఇరు దేశాల మధ్య విస్తృత వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాలపై త్వరలో జరగబోయే వర్చవల్ సమావేశంలో ఉభయ దేశాధినేతలు సంతకాలు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని