ఇండో-పసిఫిక్‌కు భారత్‌ ఓ భరోసా!

‘‘టీకా తయారీలో భారత్‌కున్న శక్తిసామర్థ్యాలకు అంతర్జాతీయ సమాజంలో తగిన గుర్తింపు లభించింది.’’ క్వాడ్‌ అగ్రనేతల సమావేశం తర్వాత విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా చేసిన వ్యాఖ్యలివి.

Updated : 13 Mar 2021 14:12 IST

మన దేశ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌

‘‘టీకా తయారీలో భారత్‌కున్న శక్తిసామర్థ్యాలకు అంతర్జాతీయ సమాజంలో తగిన గుర్తింపు లభించింది.’’ క్వాడ్‌ అగ్రనేతల సమావేశం తర్వాత విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా చేసిన వ్యాఖ్యలివి. కొవిడ్‌ మహమ్మారిని అంతమొందించేందుకు యావత్తు ప్రపంచం చేస్తున్న యజ్ఞంలో భారత్‌ పాత్ర ఎంత కీలకమైందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఔషధ తయారీకి కేంద్రంగా ఉన్న భారత్‌ ఇప్పుడు తన శక్తిని ప్రపంచ శ్రేయస్సు కోసం వినియోగించబోతోంది. తద్వారా కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడి అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రతిష్ఠ, పరపతిని మరింత ఇనుమడింపజేసుకోనుంది.  

మోదీ హామీ

తొలిసారి జరిగిన క్వాడ్‌ భాగస్వామ్య దేశాల అగ్రనేతల భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకమైన అంశం.. ఇండో-పసిఫిక్‌ ప్రాంత దేశాలకు అవసరమైన కరోనా టీకాలను భారత్‌లో ఉత్పత్తి చేయించాలని నిర్ణయించడం. ఇందుకు అవసరమైన ఆర్థిక, రవాణా సదుపాయాలను అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు సమకూర్చాలని నిర్ణయించారు. 2022 చివరికి 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ తయారీని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌ తరఫున ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. క్వాడ్‌లోని ఇతర దేశాలకు టీకా తయారీ విషయంలో భరోసా కల్పించారు. సభ్యదేశాల సహకారంతో టీకా తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలకు అండగా ఉంటామని చెప్పారు. తద్వారా ఈ ప్రాంతంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన ఆర్థిక సహకారం అమెరికా, జపాన్‌ నుంచి లభించనున్నట్లు హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. ఇక టీకాలను క్షేత్రస్థాయికి చేర్చేందుకు కావాల్సిన రవాణా సదుపాయాలను ఆస్ట్రేలియా సమకూర్చనుంది.

హైదరాబాద్‌ కంపెనీతో అమెరికా ఒప్పందం

క్వాడ్‌ భేటీలో అగ్రనేతలు నిర్ణయించిన మేరకు భారత్‌లో టీకా తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకు వచ్చింది. ఈ మేరకు ‘డెవలప్‌మెంట్‌ ఫినాన్స్‌ కోఆపరేషన్‌’(డీఎఫ్‌సీ) ద్వారా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టీకా తయారీ సంస్థ బయోలాజికల్‌-ఈకి ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించింది. 2022 నాటికి బిలియన్‌ డోసుల తయారీని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థకు తోడుగా ఉంటామని ప్రకటించింది. జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజేన్సీ(జేఐసీఏ), జపాన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌(జేబీఐసీ) కూడా రాయితీతో కూడిన రుణాలను ఇచ్చేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి కావాల్సిన సహకారాన్ని అందిస్తామని తెలిపింది. ఈ మేరకు 41 మిలియన్‌ డాలర్లు విలువ చేసే గ్రాంట్‌ను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా అత్యవసర వినియోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతించిన టీకాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ప్రధానంగా ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారించిన ఆస్ట్రేలియా టీకా రవాణా, పంపిణీ కోసం 77 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారానికి ఇప్పటికే అంగీకరించింది.

దేశీయ అవసరాలకు ఢోకా లేదు

అయితే, క్వాడ్‌ దేశాల నిర్ణయం మేరకు ప్రారంభించబోయే టీకా తయారీ వల్ల దేశీయ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. క్వాడ్‌ ప్రయత్నాలన్నీ సామర్థ్యాన్ని పెంచడం కోసమేనని తెలిపారు. ఇప్పటికే ఉన్న సామర్థ్యంతో దేశీయ అవసరాలకు కావాల్సిన టీకాలు అందుతాయని వెల్లడించారు.

చైనాకు కుట్రలకు చెక్‌

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పట్టు సాధించేందుకు గతకొంతకాలంగా చైనా కుయుక్తులు పన్నుతోంది. ఇప్పటికే పలు దేశాలను రుణ ఊబిలోకి దింపిన డ్రాగన్‌ వాటిని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా రావడంతో దీన్నీ అవకాశంగా మలచుకునేందుకు కుట్ర చేస్తోంది. టీకా దౌత్యాన్ని ప్రదర్శించి ఆయా దేశాలను తమవైపు తిప్పుకునేందుకు చూస్తోంది. అయితే, చైనా టీకా భద్రత, సామర్థ్యంపై తొలినాళ్లలో అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ, సమయం గడుస్తున్న కొద్దీ అవి చల్లబడ్డాయి. దీంతో డ్రాగన్‌ టీకా ఎగుమతి కోసం ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీన్ని పసిగట్టిన క్వాడ్‌.. చైనాకు చెక్‌ పెట్టగల సామర్థ్యం భారత్‌కు ఉందని గుర్తించింది. ఇండియా టీకా సామర్థ్యాన్ని విస్తరించి భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వల్ల ఇతర దేశాలను చైనా వేస్తున్న వల నుంచి రక్షించవచ్చని భావిస్తోంది.

ఇవీ చదవండి..

ఇండో-పసిఫిక్‌ ప్రాంతం.. అందరిదీ

బైడెన్‌ నిర్ణయం.. ప్రవాసీయులకు ఊరట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని