Foreign Trip: ‘కరోనా తగ్గిందిగా.. అలా వెళ్లొద్దాం’.. విదేశీ టూర్లపై భారతీయుల చూపు

‘కరోనా’ ముప్పు, ఆంక్షలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఇన్నాళ్లు ఇళ్లల్లో కూర్చుని విసిగిపోయిన ప్రజలు

Published : 23 Sep 2021 11:01 IST

అంతర్జాతీయ విమానాలు, హోటల్‌ గదుల కోసం అన్వేషణ 

 ‘మేక్‌మై ట్రిప్‌’ సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: ‘కరోనా’ ముప్పు, ఆంక్షలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఇన్నాళ్లు ఇళ్లల్లో కూర్చుని విసిగిపోయిన ప్రజలు నెమ్మదిగా విదేశీ ప్రయాణాలకు సిద్ధపడుతున్నారు. రవాణా ఆంక్షలు అంతగా లేని దేశాలను ఎంచుకుని, కాస్త సరదాగా గడిపి వద్దాం అనుకుంటూ బయలుదేరుతున్నారు. దేశీయ పర్యాటకుల్లో దాదాపు 85 శాతం మంది సమీప భవిష్యత్తులో ఏదో ఒక దేశానికి వెళ్లి రావాలనుకుంటున్నట్లు ‘మేక్‌మై ట్రిప్‌’ అనే పర్యాటక సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆగస్టు 15 నుంచి ఈ నెల 15 మధ్య  ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. దీని ప్రకారం.. 30- 35 ఏళ్ల వారు 2-3 నెలల్లోనే తాము ప్రయాణాలు పెట్టుకున్నట్లు వివరిస్తున్నారు. మనదేశం నుంచి ఎంతో మంది విదేశీ ప్రయాణాలు చేసేందుకు అనువుగా ఉన్న విమాన సర్వీసులు, హోటల్‌ గదులు వెతుక్కుంటున్నారు. ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న నగరాల్లో దుబాయ్, మాల్దీవులు, స్విట్జర్లాండ్‌ ఉన్నాయి. థాయ్‌ల్యాండ్, యూకే, అమెరికా దేశాలు ఇంకా పూర్తిస్థాయిలో భారతీయులను తమ దేశాలకు అనుమతించడం లేదు.

ఒకవేళ ఈ దేశాలు ఆంక్షలు తొలగిస్తే ఎక్కువ మంది మనదేశం నుంచి ఈ దేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. మధ్యధరా సముద్రాన్ని చుట్టి వద్దామని మరికొంత మంది భావిస్తున్నారు. ఈ సముద్రానికి అటూ ఇటు ఉన్న గ్రీస్, ఇటలీ, ఈజిప్టు, టర్కీ దేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇంకొంతమంది పారిస్, లండన్‌ చూడాలని ఆశపడుతున్నట్లు తేలింది. క్వారంటైన్‌ ఆంక్షలు లేని, కరోనా కేసులు తక్కువగా ఉన్న, తక్కువ ఖర్చు అయ్యే దేశాలను ప్రయాణికులు ఎంచుకుంటున్నట్లు తేలింది. ఒక్కసారిగా ప్రజలు పర్యటనలకు సిద్ధపడుతున్నందునే అంతర్జాతీయ విమాన సర్వీసులకు డిమాండ్‌ బాగా పెరిగిందని మేక్‌మై ట్రిప్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ విపుల్‌ ప్రకాష్‌ వివరించారు. పండుగల సీజన్‌ కావడం దీనికి కలిసి వచ్చినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని