Galwan Valley: చైనా సరుకుపై గల్వాన్‌ ఎఫెక్ట్‌..!

చైనాతో గల్వాన్‌ లోయలో ఘర్షణ తర్వాత భారతీయ వినియోగదారుల తీరులో మార్పువస్తోంది. చాలా మంది చైనా తయారీ వస్తువులకు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.

Updated : 15 Jun 2021 10:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాతో గల్వాన్‌ లోయలో ఘర్షణ తర్వాత భారతీయ వినియోగదారుల తీరులో మార్పు వస్తోంది. చాలా మంది చైనా తయారీ వస్తువులకు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో చైనా వస్తువులు విరివిగా కొనుగోలు చేసిన వారు కూడా ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఒక కమ్యూనిటీ సోషల్‌ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది.

‘లోకల్‌ సర్కిల్‌’ అనే కమ్యూనిటీ సోషల్‌ మీడియా సంస్థ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. గత 12 నెలల్లో చైనా వస్తువుల కొనుగోళ్ల విషయంలో భారతీయులు అనాసక్తిగా ఉన్నట్లు దానిలో తేలింది. ఈ సర్వేలో 43శాతం మంది భారతీయులు చైనాలో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయలేదని వెల్లడించారు. గతంలో ఆ వస్తువులు ఎక్కువగా కొన్నవారు కూడా ఇటీవల బాగా తగ్గించినట్లు తెలిపారు. ముఖ్యంగా గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌లో ‘బాయ్‌కాట్‌ చైనా’ నినాదం ఊపందుకుంది. ఈ ప్రభావంతోనే విక్రయాలు తగ్గినట్లు భావిస్తున్నారు. అంతేకాదు.. భారత ప్రభుత్వం కూడా ‘టిక్‌టాక్‌’, ‘అలీఎక్స్‌ప్రెస్‌’ వంటి 200 చైనా యాప్స్‌ను నిషేధించడం దీనికి ఆజ్యం పోసింది.

గత నవంబర్‌లో పండగ సీజన్‌లో 71శాతం మంది ప్రజలు చైనా వస్తువులను కొనుగోలు చేయలేదని ‘లోకల్‌ సర్కిల్‌’ సర్వే పేర్కొంది.  ధర తక్కువగా ఉండటం, ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొనుగోలు చేసినట్లు మిగిలిన వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 281 జిల్లాల్లో 18,000 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించారు. 2020లో లద్దాఖ్‌లో జరిగిన ఘర్షణలు.. చైనా వస్తువులపై అయిష్టతను పెంచినట్లు సర్వే వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు