వివాదాలు సరిహద్దుల్లోనే.. వాణిజ్యంలో కాదు!

భారత్‌ నుంచి చైనాకు ముడి ఖనిజాలు, ఇనుము, అల్యూమినియం, రాగి ఎగుమతులు 2020లో గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యాలయం వెల్లడించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో మొత్తం ఎగుమతుల్లో 16.15 శాతం వృద్ధి నమోదైంది.........

Published : 24 Feb 2021 22:35 IST

చైనాకు పెరిగిన భారత ఎగుమతులు

దిల్లీ: భారత్‌ నుంచి చైనాకు ముడి ఖనిజాలు, ఇనుము, అల్యూమినియం, రాగి ఎగుమతులు 2020లో గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యాలయం వెల్లడించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో మొత్తం ఎగుమతుల్లో 16.15 శాతం వృద్ధి నమోదైంది. 2019లో 17.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎగుమతుల విలువ 2020లో 20.87 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో చైనాతో ఉన్న వాణిజ్య లోటు 19.39 శాతం తగ్గింది. ఇదే సమయంలో చైనా నుంచి భారత్‌కు వస్తున్న దిగుమతుల్లో 10.87 శాతం తగ్గుదల కనిపించింది. 74.92 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దిగుమతులు 2020లో 66.78 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి.

చక్కెర, సోయాబీన్‌ నూనె, కూరగాయల నుంచి తీసే కొవ్వులు-నూనెల వంటి వ్యవసాయ సంబంధిత ఎగుమతులు వృద్ధి చెందినట్లు వాణిజ్య శాఖ సమాచారం ద్వారా తెలుస్తోంది. మరోవైపు మామిడి, చేప నూనె, టీ పొడి, తాజా ద్రాక్ష ఎగుమతులు క్షీణించాయి. దీనిపై ‘భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య’ (ఎఫ్‌ఐఈవో) అధ్యక్షుడు ఎస్‌.కె.సరఫ్‌ స్పందిస్తూ.. చైనాకు భారత ఎగమతులు పెరగడం శుభసూచకమన్నారు. దేశీయ సరకుకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. ఎలక్ట్రికల్‌ యంత్రాలు-వాటి భాగాలు, బాయిలర్లు, ఇతర యంత్రాలు, యంత్ర పరికరాలు, ప్లాస్టిక్‌ సంబంధిత వస్తువులు, ఇనుము, ఉక్కు సంబంధిత వస్తువులు, ఫర్నిచర్‌, కృత్రిమ ఎరువులు, వాహన విడి భాగాలు, ఆట బొమ్మలు, ఆట వస్తువులు, కర్బన రహిత రసాయనాలు, సిరమిక్‌ ఉత్పత్తుల దిగుమతుల్లో క్షీణత కనిపించింది.

గత కొన్ని నెలలుగా చైనాతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్తలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే గత ఏడాది భారత్‌ చైనాకు చెందిన దాదాపు 200 యాప్‌లను నిషేధించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, అవేవీ వాణిజ్య బంధంపై ప్రభావం చూపకపోవడం గమనార్హం. మరోవైపు అన్ని రంగాల్లో భారత్‌ స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ తయారీ రంగం స్పందిస్తోంది. ఆట వస్తువులు, టెలికాం పరికరాలు, మొబైల్ తయారీ వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఆయా వస్తువుల దిగుమతి క్రమంగా పడిపోతోంది. ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా మరిన్ని ప్రోత్సహాకాలు ప్రకటిస్తే చైనా ఉత్పత్తుల దిగుమతి మరింత గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. అలాగే దేశీయ సరకుల నాణ్యత పెరిగి ఎగుమతులు సైతం ఊపందుకునే అవకాశం ఉంది. 

ఇవీ చదవండి...

చైనాకు అమెరికా చెక్‌.. వయా భారత్‌!

వేతనాలు 7.7% పెరుగుతాయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని