Covid effect: ఏప్రిల్‌లో ఇంధన అమ్మకాలు డౌన్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తున్న వేళ పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. దీంతో దేశంలో ఇంధన వినియోగం తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌ నెలలో........

Published : 12 May 2021 18:42 IST

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తున్న వేళ పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. దీంతో దేశంలో ఇంధన వినియోగం తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌ నెలలో 9.4 శాతం మేర అమ్మకాలు తగ్గినట్లు కేంద్ర పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (పీపీఏసీ) సంబంధిత గణాంకాలను బుధవారం వెలువరించింది. మార్చిలో దేశంలో 18.77 మిలియన్‌ టన్నులుగా ఉన్న ఇంధన వినియోగం 17.01 మిలియన్‌ టన్నులకు తగ్గినట్లు తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో దేశమంతా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో ఇంధన విక్రయాలు భారీగా పడిపోయాయి. అప్పటితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 81.5 శాతం మేర పెరగడం గమనార్హం.

ఏప్రిల్‌ నెలలో పెట్రోల్‌ అమ్మకాలు 2.38 మిలియన్‌ టన్నులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు తర్వాత ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం. మార్చితో పోలిస్తే 13 శాతం మేర అమ్మకాలు క్షీణించాయి. గతేడాది ఏప్రిల్‌లో పెట్రోల్‌ అమ్మకాలు కేవలం 9.72 లక్షల టన్నులు మాత్రమే కావడం గమనార్హం. ఎక్కువగా వినియోగించే డీజిల్‌ విక్రయాలు సైతం 6.67 మిలియన్‌ టన్నులు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చితో పోలిస్తే 9 శాతం మేర అమ్మకాలు తగ్గాయి.

ఎయిర్‌లైన్స్‌లో వినియోగించే జెట్‌ ఇంధన (ఏటీఎఫ్‌) వినియోగం గత నెలతో పోలిస్తే 14 శాతం క్షీణించి 4,09,000 టన్నులకు పరిమితమైంది. ఎల్పీజీ వినియోగం సైతం 11.6 శాతం తగ్గింది. తారు వినియోగం సైతం పడిపోయింది. అయితే ఏప్రిల్‌ నెలలో పెద్దగా ఆంక్షలు లేకపోవడం, పైగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడంతో వినియోగం పెద్దగా తగ్గలేదని తెలుస్తోంది. మే నెలలో మాత్రం దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా కేసుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుడడంతో అమ్మకాలు భారీగా క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి. 

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని