Published : 04 Jan 2021 16:15 IST

పొగరాయుళ్లకు క్షమాపణలు చెప్పిన ఇందిరమ్మ..!

ఆర్థిక మంత్రిగా 1970-71 బడ్జెట్‌ విశేషాలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థిక మంత్రిగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా నిర్మలా సీతారామన్‌కు ఘనత ఉంది. కానీ.. సీతారామన్‌ కంటే ముందే ఓ మహిళ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె భారత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. 1970-71 బడ్జెట్‌ను ఇందిరాగాంధీనే ప్రవేశపెట్టారు. 1967-69 వరకు మొరార్జీ దేశాయ్‌ ఆర్థిక శాఖను చూసేవారు. దీంతోపాటు ఆమె మంత్రివర్గంలో డిప్యూటీ ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ, మొరార్జీ దేశాయ్‌ ఆమెను మూగబొమ్మగా(గూంగీ గుడియా)గా అభివర్ణించారు. దీంతో 1969 జులై16 ఆయన నుంచి ఆర్థికశాఖ బాధ్యతలను ప్రధాని ఇందిరాగాంధీ తీసుకొన్నారు. దీంతో ఆయన  కేబినెట్‌ నుంచే వైదొలగారు. ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో 1970-71 కేంద్ర బడ్జెట్‌ రూపుదిద్దుకొంది. కానీ, ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థకు మైలురాళ్ల వంటి కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. 
* ఈ బడ్జెట్‌లోనే వృద్ధి, సామాజిక న్యాయం సాధించేందుకు ఇందిరమ్మ చర్యలు చేపట్టింది. 14 పెద్ద బ్యాంకులను జాతీయం చేసింది. దీంతోపాటు మోనోపోలిస్‌ యాక్ట్‌కు జీవం పోశారు.
* కేంద్ర ప్రాయోజిత పథకాలకు భారీగా కేటాయింపులు చేశారు. సామాజిక వర్గాలకు వీటి ఫలాలు అందేట్లు చర్యలు తీసుకొన్నారు. దీంతోపాటు సామాజిక సంక్షేమ పథకాల ఖర్చు అభివృధ్దికి కూడా ఉపయోగపడే జాగ్రత్త వహించారు.
* ఈ బడ్జెట్‌లో ఆదాయం పెంచుకోవడానికి పన్నునే ప్రధాన మార్గంగా ఇందిరా ఎంచుకొన్నారు. దీంతోపాటు కొన్ని రకాల వస్తువుల వినియోగంపై ఆంక్షలు విధించారు. రూ.రెండు లక్షల కంటే ఆదాయం మించితే ఆదాయపు పన్ను రేటు 93.5శాతంగా నిర్ణయించారు. ఎయిర్‌ కండీషనర్లపై ఎక్సైజ్‌ డ్యూటీని 40శాతం నుంచి ఏకంగా 53.75శాతానికి పెంచారు. 
* ఈ బడ్జెట్‌లో సిగరెట్లపై ఇందిరాగాంధీ సుంకాన్ని భారీగా పెంచేశారు. దీనిని ప్రకటిస్తూ ఆమె పొగరాయుళ్లకు క్షమాపణలు చెప్పారు. ‘‘నన్ను క్షమించండి. మరోసారి పొగరాయుళ్లపై భారం వేయాల్సి వచ్చింది. సిగరెట్లపై సుంకాన్ని 3శాతం నుంచి 22శాతానికి పెంచుతున్నాను. ఈ ప్రకటన భారం సిగరెట్ల ధరలను బట్టి ఉంటుంది. 10సిగరెట్ల చౌక రకం ప్యాకెట్‌ ధర 2పైసల్‌ నుంచి 10 పైసల్‌ మాత్రమే పెరుగుతుంది’’ అని ఆమె వెల్లడించారు. అంతేకాదు పొగరాయుళ్లపై ఆమె ఛలోక్తులు కూడా విసిరారు. ‘‘పొగరాయుళ్లు అదే నిబద్ధతతో స్మోకింగ్‌ కొనసాగిస్తే.. ఈ తాజా నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి అదనంగా రూ.13.50 కోట్లు ఆదాయం లభిస్తుంది’’ అని అన్నారు.
*నిల్వచేసిన, ప్యాకేజింగ్‌ ఆహారాలపై కూడా ఆమె పన్ను భారం మోపారు. ‘‘విద్యుత్తు వాడుకొని తయారు చేసే బిస్కెట్స్‌, బటర్‌, చీజ్‌ వంటి వాటిపై పన్ను భారం మోపుతున్నాం. అదే సమయంలో పిల్లలకు వాడే ఆహారం, దేశీయ నెయ్యికి పూర్తిగా పన్ను మినహాయించాను. నేను నా స్వార్థం చూసుకొన్నానని ఈ ప్రతిపాదనలు చూసి నా సహచరులు విమర్శించరు. ఈ ప్రతిపాదనలతో ప్రభుత్వానికి అదనంగా రూ.8.68 కోట్ల ఆదాయం లభిస్తుంది’’ అని చెప్పారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని