ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మ‌న్ విధులు-ప‌రిమితులు

బీమా కంపెనీ మీ క్లెయిమ్‌పై 30 రోజుల్లోగా స్పందించ‌క‌పోతే అంబుడ్స్‌మ‌న్‌ని సంప్ర‌దించాలి

Published : 22 Dec 2020 18:53 IST

ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మ‌న్ విధులు, ప‌రిమితులు, చిరునామా, ఫిర్యాదులు అంబుడ్స్‌మ‌న్ స్కీమ్ ఏంటి? ఇలాంటి చాలా సందేహాల‌ను నివృత్తి చేసుకునేందుకు ఈ క‌థ‌నం…

బీమా కంపెనీ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రించింద‌ని లేదా ఒక‌ బీమా కంపెనీ అత్య‌ధికంగా క్లెయిమ్‌ల‌ను ప‌రిష్క‌రించింద‌ని వినే ఉంటారు. పాల‌సీదారుడు త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన ఒక విష‌యం ఏంటంటే అస‌లు క్లెయిమ్ తిర‌స్క‌రించేందుకు కార‌ణాలేంటి? చ‌ట్టం ప్ర‌కారం ఉన్న నిబంధ‌న‌లు ఏంటి? అనేదానిపై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. దీనికి సంబంధించి అంబుడ్స్‌మ‌న్ స్కీమ్ చాలా ముఖ్య‌మైన‌ది

ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మ‌న్ చ‌ట్టం

ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మ‌న్‌ను ప‌బ్లిక్ గ్రీఎవ‌న్సెస్ రూల్స్, 1998 ప్ర‌కారం నియ‌మిస్తారు. పాల‌సీదారుల ఫిర్యాదులపై వేగ‌వంతమైన ప‌రిష్కారాల‌కు వీరు కృషి చేస్తారు. అంబుడ్స్ మ‌న్‌ని బీమా రంగం, సివిల్ సర్వీసెస్ లేదా న్యాయ రంగం నుంచి ఎంపిక చేస్తారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం అంబుడ్స్‌మ‌న్ మూడేళ్ల పాటు కొన‌సాగుతారు లేదా వారి వ‌య‌సు 65 సంవ‌త్సరాలు వ‌చ్చే వ‌ర‌కు ఏది మొద‌ట వ‌స్తే దానిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

అంబుడ్స్‌మ‌న్ ప‌రిమితులు

ఒక వ్యక్తి లేదా అతని చట్టపరమైన వారసులు దాఖలు చేసిన‌ వివాదాలను మాత్రమే ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మ‌న్ ప‌రిష్క‌రిస్తారు. క్లెయిమ్ పరిమితి రూ. 30 లక్షల వ‌ర‌కు మాత్ర‌మే అంబుడ్స్‌మ‌న్ ప‌రిధిలో ఉంటుంది.
ఫిర్యాదులు-ప‌రిష్కారాలు

  1. ఏదైనా క్లెయిమ్‌ కొంత లేదా మొత్తం నిరాకరణ

  2. పాల‌సీ ప్రీమియం కోసం చెల్లించిన లేదా చెల్లించాల్సిన‌ మొత్తం
    3.పాల‌సీ ప‌రిమితులు, నిబంధ‌న‌లు

  3. 30 రోజుల్లో కంపెనీ క్లెయిమ్ ప‌రిష్క‌రించ‌క‌పోతే

  4. ప్రీమియం చెల్లించిన త‌ర్వాత కూడా పాల‌సీ ఇవ్వ‌క‌పోతే
    ఇలాంటి స‌మ‌స్య‌లను ప‌రిష్కరించుకునేందుకు అంబుడ్స్‌మ‌న్‌ను సంప్ర‌దించాలి.

మొద‌ట పాల‌సీదారుడు బీమా కంపెనీని సంప్ర‌దించాలి. క్లెయిమ్‌లో కొంత ఏదైనా స‌మ‌స్య ఉన్నా, మొత్తం తిర‌స్క‌రించినా లేదా ఒక నెల‌లోపు సంస్థ నుంచి ఎలాంటి స‌మాదానం రాక‌పోతే పాల‌సీదారుడు లేదా చ‌ట్ట ప్ర‌కారం వార‌సుడు అంబుడ్స్‌మ‌న్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. క్లెయిమ్ చివ‌రి తిర‌స్కారం త‌ర్వాత ఏడాది లోపు అంబుడ్స్‌మ‌న్‌ను సంప్ర‌దించాలి. పాల‌సీకి సంబంధించిన అన్ని ప‌త్రాలు మీ వ‌ద్ద ఉండాలి.

అంబుడ్స్‌మ‌న్ విధులు

బీమా అంబుడ్స్‌మ‌న్ సంబంధిత స‌మాచారం అంత సేక‌రించి దానికి త‌గిన ప‌రిష్కారం చూపుతారు. అంబుడ్స్‌మ‌న్ క్లెయిమ్ ప‌రిష్క‌రించేందుకు క్ర‌మ‌మైన విధానం అంటూ ఏమి ఉండ‌దు. అంబుడ్స్‌మ‌న్ త‌గిన‌ ప‌ద్థ‌తిలో స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తారు. క్లెయిమ్‌కి సంబంధించిన వాద‌న‌ల‌ను విన్న త‌ర్వాత అంబుడ్స్‌మ‌న్ స‌రైన నిర్ణ‌యం తీసుకుంటారు. దాని ప్ర‌కారం కంపెనీతో పాటు పాల‌సీదారుడికి ఆదేశాల‌ను జారీ చేస్తారు . క్లెయిమ్ చేసిన వారు ఒక నెల‌లోపు ఆ మొత్తాన్ని అంగీక‌రిస్తారా లేదా అనేది తెలియ‌జేయాలి. 30 రోజుల్లోపు ఏ విష‌యం వెల్ల‌డించ‌క‌పోతే బీమా సంస్థలు దీనిని అమ‌లు చేయ‌వు. ఎక్స్‌గ్రేషియా ఆమోదం కాక‌పోతే వినియోగ‌దారుడి ఫోరం లేదా సివిల్ కోర్టుకి వెళ్ల‌వ‌చ్చు.

ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ఈ స్కీమ్ కింద‌కి వ‌స్తాయా?

అవును. అంబుడ్స్‌మ‌న్ స్కీమ్ ఎల్ఐసీతో పాటు అన్ని ప్ర‌వేటు కంపెనీల‌కు వ‌ర్తిస్తుంది. అన్ని సాధార‌ణ‌, ఆరోగ్య బీమా కంపెనీలకు సంబంధించిన పాల‌సీదారులు కూడా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కొర‌కు అంబుడ్స్‌మ‌న్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

అంబుడ్స్‌మ‌న్ ఎక్క‌డుంటారు?

దేశ‌వ్యాప్తంగా 17 అంబుడ్స్‌మ‌న్ కార్యాల‌యాలు ఉన్నాయి. ఫిర్యాదు ఏ ప్రాంతంలో న‌మోద‌యిందో దాని ప్ర‌కారం అక్క‌డ అధికారిక కార్యాల‌యాల్లో ఉన్న అంబుడ్స్‌మ‌న్ ప‌రిష్కారం చూపుతారు. అంబుడ్స్‌మ‌న్ నిర్ధిష్ట కార్యాల‌యంలో అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. ఆ ప్రాంతంలోని అధికారికి కార్యాల‌యాల్లో ఎక్క‌డైనా ఉండే అవ‌కాశం ఉంటుంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని