ప్ర‌కృతి విప‌త్తుల వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌కు.. బీమా ర‌క్ష‌ణ‌

గృహ బీమా తీసుకునే ముందు పాల‌సీలో ఉన్న మిన‌హాయింపులు, క‌వ‌ర్ అయ్యే, క‌వ‌ర్‌కానీ అంశాల జాబితాను ప‌రిశీలించాలి.

Updated : 22 May 2021 14:33 IST

తౌక్టే తుఫాను వివిధ రాష్ట్రాలలో భారీ నష్టాన్ని కలిగించింది. ముంబై వంటి నగరాల్లో, ఆపి ఉంచిన కార్ల‌పై చెట్లు ప‌డి పూర్తిగా ద్వంస‌మైన చిత్రాల‌ను సామాజిక మాధ్యమాల ద్వారా చూశాం. గుజరాత్‌లో ఈ తుఫాను దాటికి 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ఆస్తి న‌ష్టం ఏర్ప‌డింది.

ప్రతీ సంవత్సరం, ప్రకృతి వైపరీత్యాలు దేశవ్యాప్తంగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టాలు క‌లిగిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రకృతి విప‌త్తు సంభ‌వించిన‌ప్పుడు, న‌ష్టాల‌ను ప‌రిష్క‌రించేందుకు స‌మ‌గ్ర గృహ‌, మోటారు బీమా పాల‌సీలు ఉప‌యోగప‌డ‌తాయి.  

గృహ బీమా..
బీమా నియంత్ర‌ణ ప్రాదికార సంస్థ  ఇప్పుడు గృహ బీమాను ప్రామాణీకరించింది.  ఏ బీమా సంస్థ నుంచైనా.. ఒకే విధ‌మైన నిబంధనలు, షరతులతో  స్టాండ‌ర్డ్ ఫైర్ అండ్ స్పెష‌ల్ పెరిల్స్(ఎస్ఎఫ్ఎస్‌పీ) బీమాను తీసుకోవ‌చ్చు. దీనికి అద‌నంగా తీసుకోవాల‌నుకునే వారు స‌మ‌గ్ర గృహ బీమాను ఎంచుకోవ‌చ్చు.

ప్రామాణిక బీమా పాల‌సీ.. అగ్ని ప్ర‌మాదాలు, మెరుపుల వ‌ల్ల‌, వరదల కార‌ణంగా ఏర్ప‌డే న‌ష్టాన్ని కవ‌ర్ చేస్తుంది. ఒక స‌మ‌గ్ర బీమా పాల‌సీ ప్ర‌కృత్తి విప‌త్తుల‌తో పాటు నిర్మాణంలోని ఇత‌ర అంశాల‌ను క‌వ‌ర్‌చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు, దోపిడి, దొంగ‌త‌నం, విద్యుత్తు ప‌రికరాల విచ్చిన్నం వంటి వాటిని కూడా క‌వ‌ర్ చేస్తుంది. దీనికి అద‌నంగా వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా వంటి యాడ్‌-ఆన్‌ల‌ను తీసుకోవ‌చ్చు. 

గృహ బీమా తీసుకునే ముందు పాల‌సీలో ఉన్న మిన‌హాయింపులు, క‌వ‌ర్ అయ్యే, క‌వ‌ర్‌కానీ అంశాల జాబితాను ప‌రిశీలించ‌డం అవ‌సరం. 

మోటార్ ఇన్సురెన్స్‌..
ప్రకృతి వైపరీత్యాల వ‌ల్ల వాహ‌నాలకు పూర్తిగా గానీ పాక్షికంగా గానీ న‌ష్టం క‌ల‌గ‌వ‌చ్చు. కార్ల‌ బ‌య‌టి భాగం లేదా లోప‌లి భాగం, లేదా రెండూ పూర్తిగా పాడైపోవ‌చ్చు. 

బీమా సంస్థ చెల్లించే క్లెయిమ్ మొత్తం కారు వ‌య‌సుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక్క‌డ కారు డిప్రియేష‌న్ విలువ‌ను(త‌రుగుద‌ల‌) సంస్థ‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాయి.  ప్లాస్టిక్‌, ర‌బ్బ‌రు భాగాల‌కు న‌ష్టం వాటిల్లితే స‌మ‌గ్ర బీమా ఉన్న‌ప్ప‌టికీ, కొంత భాగాన్ని క్లెయిమ్ చేసుకోగ‌లుగుతారు. పూర్తిగా నష్ట‌పోతే ఇన్సురెన్స్ డిక్లేర్ విలువ‌(ఐడీవీ)వ‌ర‌కు చెల్లిస్తాయి బీమా సంస్థ‌లు.

ఐడీవీ అంటే..
ఐడీవీ అనేది ప్రస్తుత మీ వాహన మార్కెట్ విలువ. బీమా సంస్థ వాహన ఇన్సూరెన్సు పాలసీకి చెల్లించే అత్యధిక మొత్తాన్ని ఐడీవీ అంటారు. ఒకవేళ పాలసీ సమయంలో మీ వాహనానికి పూర్తి నష్టం వాటిల్లినా, చోరీకి గురైనా, మరమ్మత్తుల వ్యయం పాలసీలో పేర్కొన్న సొమ్ము కంటే ఎక్కువ అయినా సరే మీరు పాలసీలో పేర్కొన్న మొత్తాన్నే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

మీ కారు మూడు-నాలుగు సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ‌ పాత‌దైతే కొన్ని యాడ్‌ల‌ను కొనుగోలు చేయ‌డం మంచింది. ఇవి ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణంగా క‌లిగే న‌ష్టాల‌ను క‌వ‌ర్ చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు, ఇంజ‌న్ ప్రొట‌క్ష‌న్ క‌వ‌ర్‌.. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇంజ‌ను పాడైపోతే ఇది కవ‌ర్ చేస్తుంది. రిటర్న్‌టు ఇన్‌వాయిస్ యాడ్-ఆన్ క‌వ‌ర్‌ను కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది కారు మొత్తం డ్యామేజ్ అయిన‌ప్పుడు కారు కొనుగోలు ధ‌ర‌ను చెల్లిస్తుంది. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని