ఎన్ఆర్ఐలకు పది సులువైన మనీ మేనేజ్మెంట్ టిప్స్!

ఎన్ఆర్ఐలు డ‌బ్బుని ఎలా పొదుపు చేయాలి, ఎందులో పెట్టుబ‌డులు పెట్టాలి

Published : 15 Dec 2020 19:16 IST

ఒక్క‌సారి దేశం దాటి విదేశాల్లో అడుగుపెట్టాక డ‌బ్బు పొదుపు, ఖ‌ర్చు చేసే ప‌ద్ధ‌తి మారుతుంది. ఈ విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. బ్యాంకు ఖాతాలు, పెట్టుబ‌డులు, ఆస్తులు, ప‌న్నుల గురించి అవ‌గాహ‌న‌ క‌లిగి ఉండాలి. దేశానికి తిరిగి రావాల‌నుకుంటే ఇక్క‌డ ఉన్న ఆర్థిక ప‌రిస్థితుల గురించి, మార్కెట్ల గురించి తెలుసుకోవాలి.

ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ ఖాతా

మీరు ఎన్ఆర్ఐ అయి ఉండి ఇంకా సొంత ప్రాంతం నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చే ఆస్తులు, ఇంటి అద్దె వంటివి రావ‌ల‌సి ఉంటే భార‌త్‌లో ఎన్ఆర్ఓ ఖాతా ప్రారంభించి విదేశీ క‌రెన్సీని ఇక్క‌డ రూపాయ‌ల్లో మార్చి ఖాతాలో జ‌మ‌చేసుకోవ‌చ్చు. దీనికి శ్లాబు రేటు ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తిస్తుంది. అదేవిధంగా మీరు ఎన్ఆర్ఈ ఖాతాను కూడా ప్రారంభించాలి. దీనికి ప‌న్ను ఉండ‌దు.

ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ

మీ ఆస్తులు కొన్ని ఇక్క‌డ ఉన్న‌ట్ల‌యితే వేరే వాళ్ల‌కి అప్ప‌గించాలి. అది మీ బందువులు, కుటుంబ స‌భ్యులు, లేదా స్నేహితులు ఎవ‌రైనా కావొచ్చు. వారి పేరున ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి ఇక్క‌డ కార్య‌క‌లాపాల‌ను వారికి అప్ప‌గించాలి. ఆస్తుల లావాదేవీల‌ను చేసుకునేందుకు కూడా వారికి అవ‌కాశం ఉంటుంది.

పెట్టుబ‌డులు ఎక్క‌డ చేయాలి?

జీడీపీ వేగ‌వంతంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భార‌త్ ముందు స్థానంలో యుంది. ఇక్క‌డ‌ పెట్టుబ‌డుల‌కు చాలా మార్గాలు ఉన్నాయి. స్థిరాస్తి, స్టాక్ మార్కెట్, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ఎన్‌సీడీలు, ఎన్‌పీఎస్‌, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి ఎంచుకోవ‌చ్చు. అయితే మీరు అమెరికా, కెనడాలో నివ‌సిస్తూ మ్యూచువ‌ల్ పండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే ఇక్క‌డ ఉన్న నిబంధ‌న‌ల గురించి తెలుసుకోవాలి. కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు మాత్ర‌మే ఈ దేశాల నుంచి పెట్టుబ‌డుల‌ను అంగీక‌రిస్తాయి.

బ్యాంకుల్లో పెట్టుబ‌డులు

మీరు భార‌త‌ బ్యాంకుల్లో పొదుపు చేయాల‌నుకుంటే ఏ బ్యాంకు శాఖ మీరు నివ‌సిస్తున్న ప్రాంతానికి ద‌గ్గ‌ర‌గా ఉందన్న‌ది తెలుసుకోవాలి. మీరు ఇండియ‌న్ బ్యాంకులో పొదుపు చేస్తే విదేశాల నుంచి తాత్కాలికంగా లేదా శాశ్వ‌తంగా భార‌త్‌కి వ‌చ్చినా న‌గ‌దు కార్య‌క‌లాపాలు సాఫీగా కొన‌సాగేందుకు వీలుంటుంది.

క‌రెన్సీ హెచ్చు త‌గ్గులు

క‌రెన్సీ విలువ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటుండాలి. ఇక్క‌డ రుణం తీసుకున్నా
లేదా పెట్టుబ‌డులు పెడుతున్నా రూపాయికి ఇత‌ర క‌రెన్సీ విలువ‌ల‌ను గ‌మ‌నిస్తుండాలి. విలువ కొంత త‌గ్గిన‌ప్ప‌టికీ మీ రాబ‌డిలో పెద్ద‌మొత్తంలో తేడాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

రుణం తీసుకునే ముందు

ఎన్ఆర్ఐల‌కు భారత్ లేదా విదేశీ బ్యాంకుల్లో రుణాలు పొందడం సుల‌భం. అయితే రుణం తీసుకునే ముందు వ‌డ్డీ రేట్లు, భ‌విష్య‌త్తు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని దృష్టిలో పెట్టుకొని, క‌రెన్సీ విలువ‌, ఛార్జీలు వంటివి జాగ్ర‌త్త‌గా తెలుసుకొని తీసుకోవ‌డం మంచిది.

ప‌న్నుల నిర్వ‌హ‌ణ‌

ఎన్ఆర్ఐగా మీరు సొంత దేశం, మీరు నివ‌సిస్తున్న దేశాలలో ప‌న్నుల గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇక్క‌డ నివసిస్తున్న వారికి, ఎన్ఆర్ఐల‌కు ప‌న్ను విధానంలో తేడాలేంటో ప‌రిశీలించాలి. ఇంకా కావాలంటే ప‌న్ను అధికారుల స‌ల‌హాల‌ను తీసుకుంటే మంచిది.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ గురించి తెలుసుకోండి

మీకు భార‌త్‌లో ఆస్తులు పెట్టుబ‌డులు వంటివి ఉంటే ఖ‌చ్చితంగా మీరు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ తీరును గురించి ఎప్ప‌టిక‌ప్పుడు పరిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. ప‌న్ను రేట్ల‌లో మార్పులు, ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు, వాటి ప్ర‌భావం మీ పెట్టుబ‌డుల‌పై ఏ మేర‌కు ఉంటుందో గ‌మనించాలి.

ఆరోగ్య బీమా పాల‌సి త‌ప్ప‌నిస‌రి

ఎన్ఆర్ఐలు ఏదైనా అస్వ‌స్త‌త‌కు గురైతే సొంత దేశంలో చికిత్స పొందేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఎందుకంటే వారికి సంబంధించిన‌వారు ఇక్క‌డ ఉంటారు కాబ‌ట్టి వారిని జాగ్ర‌త్త‌గా చూసుకునే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఇక్క‌డ బీమా పాల‌సీ ఉండ‌టం ఎంతైనా అవ‌స‌రం. ఎన్ఆర్ఐల‌కు సెక్ష‌న్ 80 డీ కింద ప‌న్ను త‌గ్గింపుల‌కు కూడా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. అదేవిధంగా పాల‌సీ తీసుకునే స‌మ‌యంలో ఇత‌ర దేశాల్లో కూడా చికిత్స తీసుకునే అవ‌కాశం ఉందా లేదా అన్న‌ది పాల‌సీ తీసుకునేముంది తెలుసుకోవాలి. దీంతో మీరు భార‌త్‌లో కాకుండా విదేశాల్లో కూడా చికిత్స పొందే ప్ర‌యోజ‌నం ఉంటుంది. అయితే వ్య‌యాల‌ను బ‌ట్టి భార‌త్‌లో చికిత్స పొందేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది.

మీరు విదేశాలు వీడి స్వ‌దేశం రావాల‌నుకుంటే?

మీరు విదేశాల్లోనే స్థిర‌ప‌డాల‌నుకుంటున్నారా లేదా తిరిగి భార‌త్‌కు వ‌చ్చేయాలా అన్న‌ది చాలా ముఖ్య‌మైన నిర్ణ‌యం. అయితే మీరు స్వ‌దేశానికి వ‌చ్చేయాల‌నుకుంటే విదేశాల్లో ఉన్న రుణాల‌ను త‌గ్గించుకుంటూ భార‌త్‌లో పెట్టుబ‌డుల మీద దృష్టి సారించాలి. విదేశాల్లో సంపాదించిన డ‌బ్బుతో ఇక్క‌డ ఏమి కొనుగోలు చేయాల‌నుకుంటున్నారో ప్ర‌ణాళికా వేసుకోవాలి. మీరు అక్క‌డే ఉన్న స‌మ‌యంలో భార‌త్‌లో ఆస్తులు కొనుగోలు చేయాల‌నుకుంటే భార‌త బ్యాంకు ద్వారా క‌రెన్సీని బ‌దిలీ చేసి ఇండియ‌న్ క‌రెన్సీతో ఆస్థిని కొనుగోలు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని